హైదరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీలు సహా ఇతర ముఖ్యమైన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. వీటి అమలులో క్షేత్రస్థాయిలో ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు ఉండకుండా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పథకాల అమలులో ఫీల్డ్ లెవల్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకున్న సీఎం.. ముఖ్యమైన కార్యక్రమాల పర్యవేక్షణ కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డిని నియమించారు. ఫ్లాగ్‌షిప్ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వేగం, సమర్థత కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి సబ్యసాచి ఘోష్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఫ్లాగ్‌షిప్ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విభాగం స్పెషల్ సీఎస్‌గా ఆయనను నియమించారు.
ఫీల్డ్ లెవల్ ఫీడ్‌బ్యాక్‌తో..
క్షేత్రస్థాయి పర్యటనలు, ఎమ్మెల్యేలు, అధికారుల నుంచి అందిన నివేదికల ఆధారంగా కొన్ని పథకాల అమలులో ఫీల్డ్ లెవల్‌లో లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించినట్టు తెలిసింది. దీంతో ఈ అంశంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ‘‘పథకాలు అర్హులకు అందాలి. ఇందులో ఎలాంటి అలసత్వం, లోపాలున్నా సహించేది లేదు. ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించాలి.
అర్హులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే’’ అని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది. కాగా, కొత్తగా నియమితులైన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్‌తో కలిసి త్వరలోనే అన్ని శాఖల అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
నేరుగా సీఎం సమీక్ష..
ఆరు గ్యారంటీలైన మహాలక్ష్మి, రుణమాఫీ, గృహలక్ష్మి, చేయూత, యువజన భరోసా, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాల అమలును నేరుగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. గ్రామ పంచాయతీ నుంచి సెక్రటేరియెట్ వరకు అందరూ సమన్వయంతో పని చేయాలని, లబ్ధిదారులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.
పథకాల అమలులో ఫీల్డ్ లెవెల్‌లో ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు మానిటరింగ్ వ్యవస్థను బలపరచాలని సూచించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పర్యవేక్షణ వ్యవస్థతో అధికారులు లబ్ధిదారుల వివరాలను, పథకాల పురోగతిని రియల్ టైమ్‌లో పరిశీలించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో సలహాదారు, స్పెషల్ సీఎస్ పథకాల పర్యవేక్షణతో పాటు అవసరమైన సవరణలు, విధాన మార్పులు చేపట్టనున్నట్టు తెలుస్తున్నది.
