- ఇక్కడ పరిశ్రమలు పెట్టి.. నిధులు వేరే రాష్ట్రాల్లో ఖర్చు చేస్తే ఊరుకోం: సీఎం
- తెలంగాణ వాటా కేవలం 3 శాతమే ఉండడంపై విస్మయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి, ఇక్కడి వనరులను వాడుకుంటున్న కార్పొరేట్ సంస్థలు తమ కార్పొరేట్సోషల్రెస్పాన్సిబిలిటి (సీఎస్ఆర్) నిధులను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గురువారం శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్‌లో సీఎస్ఆర్ నిధుల వినియోగంపై హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. జాతీయ స్థాయిలో సీఎస్ఆర్ విరాళాల్లో తెలంగాణ వాటా కేవలం 3 శాతమే ఉండడంపై సీఎం విస్మయం వ్యక్తం చేశారు. ఇకపై రాష్ట్రంలోని కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధుల్లో కనీసం 50 శాతాన్ని ఇక్కడే ఖర్చు చేసేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం సమగ్రమైన ‘సీఎస్ఆర్ పాలసీ’ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
సీఎస్ఆర్ నిధుల సేకరణ, పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా ‘సీఎస్ఆర్ సెల్’తో పాటు కార్యాలయం ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వానికి, కార్పొరేట్ సంస్థలకు మధ్య అనుసంధానకర్తగా ఉండేలా ‘తెలంగాణ సీఎస్ఆర్ పోర్టల్’ను రూపొందించాలని ఐటీ శాఖను ఆదేశించారు. ఈ పోర్టల్‌లో వివిధ ప్రభుత్వ విభాగాల్లో అందుబాటులో ఉన్న ప్రాజెక్టులు, సీఎస్ఆర్ ద్వారా చేపట్టేందుకు వీలున్న కార్యక్రమాల వివరాలన్నీ పొందుపరచాలని సూచించారు. తద్వారా కార్పొరేట్ సంస్థలు తమకు నచ్చిన ప్రాజెక్టులను సులభంగా ఎంచుకునే వెసులుబాటు కలుగుతుందని, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను కూడా అధ్యయనం చేసి మన పాలసీలో చేర్చాలని అధికారులకు చెప్పారు.
ఉత్తమ సేవలు అందించిన సంస్థలను సన్మానించాలి
రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యే సంస్థలను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఏడాది సీఎస్ఆర్ ద్వారా అత్యుత్తమ సేవలు అందించిన సంస్థల ప్రతినిధులను గుర్తించి, వారిని ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానించాలని నిర్ణయించారు. ఈ అభినందన వేడుకలను ప్రతి ఏటా నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగానే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టే విద్య, వైద్యం, ఇతర ప్రజా ప్రయోజన కార్యక్రమాల్లో కార్పొరేట్ భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించేలా వినూత్న పద్ధతులను అవలంబించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్సబ్యసాచి ఘోష్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి, కార్యదర్శులు మాణిక్ రాజ్, యోగితా రాణా, శశాంక, భవేష్ మిశ్రా, నిఖిల్ చక్రవర్తి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
త్వరలో ప్రజా సూచన పోర్టల్
రాష్ట్రంలో పారదర్శకతను పెంచుతూ, ప్రజలకు ప్రభుత్వ పథకాల సమాచారాన్ని చేరువ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ‘ప్రజా సూచన పోర్టల్’ ఏర్పాటుకు నిర్ణయించారు. రాజస్తాన్‌లోని ‘జన్ సూచన పోర్టల్’ నమూనాలో దీనిని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గురువారం శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే బృందం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న ప్రజాహిత కార్యక్రమాలను నిఖిల్ డే ప్రశంసించారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో విజయవంతంగా కొనసాగుతున్న ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయి వరకు విస్తరించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ప్రజల వినతులను స్థానికంగానే పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న అన్ని పథకాల వివరాలు, లబ్ధిదారుల సమాచారాన్ని ఒకే చోట పారదర్శకంగా ఉంచేలా ఈ పోర్టల్‌ను రూపొందించనున్నారు. ఐటీ శాఖ ద్వారా ఈ ప్రతిష్టాత్మక పోర్టల్‌ను యుద్ధప్రతిపాదికన అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన 'గిగ్ వర్కర్స్ బిల్లు' దేశంలోనే చారిత్రాత్మకమని, ఇది అట్టడుగు కార్మికులకు భరోసానిస్తుందని నిఖిల్ డే కొనియాడారు. ఈ భేటీలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నా రెడ్డి, సీఎస్ రామకృష్ణారావుతో పాటు ఉన్నతాధికారులు దాన కిషోర్, శేషాద్రి, అజిత్ రెడ్డి, మాణిక్ రాజ్, దివ్య దేవరాజన్, వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి చిన్నారికి నాణ్యమైన
విద్య.. పోషకాహారం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ గురువారం శానసమండలిలోని కాన్ఫరెన్స్హాల్లో సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో10 ఏండ్ల లోపు పిల్లల్లో పోషకాహార లోపం.. విద్యాభ్యాసన స్థాయి సామర్థ్య లోపాలకు సంబంధించి పలు నివేదికలను కార్తీక్ మురళీధరన్ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. చిన్న వయస్సులో పోషకాహార లోపంతో భవిష్యత్‌లో తలెత్తే ఆరోగ్య సమస్యలు.. ప్రాథమిక స్థాయిలో సరైన బోధన లభించకపోతే విద్యార్థి భావి జీవితంలో పడే మానసిక వేదనను ఆయన తెలియజేశారు.
వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన అంశాలను ఆయన సీఎంకు సూచించారు. ఆయా అంశాలపై తాము ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం పెట్టేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని వివరించారు. అంగన్‌వాడీల్లో కార్యకర్తలు, ఆయాలతో పాటు పోషకాహారం అందజేసేందుకు అదనంగా మరొకరిని నియమించాలని కార్తీక్ మురళీధరన్ సూచించారు. అంగన్‌వాడీల్లో పిల్లలకు పోషకాహారం అందజేసేందుకు పోషణ సఖి పేరుతో మరొకరిని నియమించేందుకు అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. కార్తీక్ మురళీధరన్ సూచించే అంశాలను కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని 29 స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
