
- 25 ఏండ్ల అవసరాలకు తగ్గట్టు ప్రణాళికలు
- రూపొందించాలని అధికారులకు ఆదేశం
- అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కేబులింగ్‌పై దృష్టిపెట్టండి
- కాలుష్య పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలికి తరలించాలి
- పాతబస్తీ మెట్రో పనులు స్పీడప్ చేయండి
- వారసత్వ కట్టడాలను పరిరక్షించాలి
- మూసీ పనులను వేగవంతం చేయండి
- రివర్ ఫ్రంట్‌కు ప్రతీకగా ఇండియా గేట్ లాంటి ల్యాండ్‌మార్క్ నిర్మించాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 25 ఏండ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని.. ఇందుకోసం ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో ఉన్న సమస్యలను అధ్యయనం చేయాలని సూచించారు. సిటీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, కేబులింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఈ క్రమంలో అన్ని శాఖలు సమగ్ర డీపీఆర్‌లు తయారు చేయాలని సూచించారు. ‘‘విపరీతమైన కాలుష్యంతో ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్‌లో తలెత్తకూడదు. కోర్ సిటీలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్‌ఆర్ బయటకు తరలించాలి” అని ఆదేశించారు. మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌పై మంగళవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
డ్రైనేజీ వ్యవస్థను సంస్కరించాలి..
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని, నిర్మాణ రంగ వ్యర్థాలను సిటీలో ఎక్కడపడితే అక్కడ డంప్ చేయకుండా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా అలా చేసేటోళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘హైద రాబాద్‌లో మంచినీటి, మురుగు నీటి సరఫరా వ్యవ స్థలను పూర్తిగా సంస్కరించాలి. దీనిపై సీవరేజీ బోర్డు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బోర్డు తమకున్న వనరులను ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. ఓఆర్‌ఆర్ పరిధిలోని వారసత్వ కట్టడాల సంరక్షణ, వాటిని పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకుగాను కులీకుతుబ్ షాహీ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మార్గదర్శకాలను సవరించి దాన్ని మరింత బలోపేతం చేయాలి. మార్గదర్శకాల రూపకల్పనలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి” అని సూచించారు. పాతబస్తీ మెట్రోకు అవసరమైన నిధులను ఇప్పటికే విడుదల చేశామని, అక్కడ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మెట్రో సెకండ్ ఫేజ్ అనుమతులు, తదితర విషయాల్లో ఏమాత్రం జాప్యాన్ని సహించబోమని హెచ్చరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పనులు పట్టాలెక్కేలా చూడాలన్నారు. ప్యార డైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
మీరాలం ట్యాంక్ దగ్గర హోటల్ నిర్మాణం..
మూసీ రివర్ ఫ్రంట్‌కు సంబంధించి హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఓఆర్‌ఆర్ నుంచి మూసీ వైపు వచ్చే క్రమంలో కొత్వాల్‌గూడ జంక్షన్‌లో మూసీ రివ ర్ ఫ్రంట్‌కు ప్రతీకగా ఇండియా గేట్, గేట్ వే ఆఫ్ ఇండియా, చార్మినార్ లాంటి ఓ ల్యాండ్ మార్క్‌ను నిర్మించాలని సూచించారు. మూసీపైన బ్రిడ్జి కమ్ బ్యారేజీలకు ప్రణాళికలు రూపొందించాలని.. అను మతులు, నిబంధనల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ‘‘మీరాలం ట్యాంక్ ఎదుట ఏర్పా టు చేసిన ఎస్టీపీలు వాటి సామర్థ్యానికి అనుగుణంగా పని చేసేలా చూడండి. జూపార్క్, మీరాలం ట్యాంక్ సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అధునాతన వసతులతో హోటల్ నిర్మించండి. పార్క్, మీరాలం ట్యాంక్‌తో పాటు నగరాన్ని వీక్షించేలా హోటల్ ఉండాలి” అని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, ఎంఏయూడీ కార్యదర్శులు ఇలంబర్తి, టీకే శ్రీదేవి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎఫ్‌సీడీఏ కమిషనర్ కె.శశాంక, వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.