ట్యాంక్ బండ్పై శ్రీపాదరావు విగ్రహం పెడ్తం: సీఎం రేవంత్ రెడ్డి

ట్యాంక్ బండ్పై శ్రీపాదరావు విగ్రహం పెడ్తం: సీఎం రేవంత్ రెడ్డి

ట్యాంక్ బండ్ పై మాజీ స్పీకర్ దివంగత శ్రీపాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  రవీంద్రభారతిలో    శ్రీపాదరావు87వ  జయంతి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్బంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ట్యాంక్ బండ్ పై తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు.అందుకు కేబినెట్ సబ్ కమిటీ వేస్తామని చెప్పారు. 

మంథని ప్రాంతానికి ఓ చరిత్ర ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  మంథని నుంచే పీవీ అసెంబ్లీకి  ఎన్నికై సేవలందించారు. మంథని నుంచే శ్రీపాదరావు ఎన్నికయ్యారని గుర్తు చేశారు.  స్పీకర్ గా శ్రీపాదరావు అసెంబ్లీని సమర్థవంతంగా నడిపించారు.. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చకు అవకాశం కల్పించారని తెలిపారు. అందుకే  పీవీతో పాటు శ్రీపాదరావు సేవలను గుర్తు చేసుకుంటున్నామన్నారు రేవంత్.

శ్రీపాదరావు వారసుడిగా మంత్రి శ్రీధర్ బాబు  తన సత్తా నిరూపించుకున్నారని రేవంత్ అన్నారు.  శ్రీధర్ బాబు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.  శ్రీధర్ బాబుకు భాష మీద, భావం మీద మంచి పట్టు ఉందని కొనియాడారు.  సీనియర్ గా శ్రీధర్ బాబు ప్రభుత్వంలో ఎన్నో  సలహాలు, సూచనలు  అందిస్తున్నారని తెలిపారు.