వైద్యరంగంలో ప్రపంచంలోనే బెస్ట్‌‌ కావాలి: సీఎం రేవంత్

 వైద్యరంగంలో ప్రపంచంలోనే బెస్ట్‌‌ కావాలి: సీఎం రేవంత్
  • ‘ఫెలోస్ ఇండియా’ సదస్సులో డాక్టర్లకు సీఎం రేవంత్‌‌రెడ్డి పిలుపు
  • పాఠశాల విద్యార్థులకు ‘సీపీఆర్’ నేర్పించే బాధ్యత తీసుకోవాలి
  • ప్రివెంటివ్ మెడిసిన్‌‌పై దృష్టి పెట్టాలి.. గుండె జబ్బులను అరికట్టాలి
  • నిరంతర అధ్యయనమే డాక్టర్ల విజయానికి అసలైన రహస్యమని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు:  దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్యం అందించే స్థాయికి మన డాక్టర్లు ఎదగాలని సీఎం రేవంత్‌‌రెడ్డి సూచించారు.  నాణ్యమైన వైద్యం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని తెలిపారు. టెక్నాలజీ డెవలప్‌‌ అవుతున్నా కొద్దీ వైద్యం హైటెక్‌‌గా మారుతున్నదని, ఆ మార్పులను గమనిస్తూనే మానవీయ కోణాన్ని మర్చిపోవద్దని సూచించారు.  వైద్య సేవల్లో ఎంత అత్యాధునిక సాంకేతికత వచ్చినా.. రోగితో వైద్యుడికి ఉండే అనుబంధమే (హ్యూమన్ టచ్) ముఖ్యమని పేర్కొన్నారు. తాను వృత్తిపరంగా డాక్టర్​ను కాకున్నా.. పదవీ బాధ్య తల పరంగా సామాజిక వైద్యుడి పాత్ర పోషిస్తూ.. సమాజంలోని సమస్యలకు చికిత్స అందిస్తున్నానని చెప్పారు. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌‌లాంటి టెక్నాలజీని వాడుకుంటూనే, ఆప్యాయంగా వైద్యం అందించినప్పుడే అది పరిపూర్ణమవుతుందని చెప్పారు. 

శనివారం హైదరాబాద్‌‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన ‘ఫెలోస్ ఇండియా’ సదస్సులో సీఎం రేవంత్‌‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన 500 మందికి పైగా గుండె జబ్బుల నిపుణులను (కార్డియాలజిస్టులు) ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వైద్యం, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ప్రపంచస్థాయి హబ్‌‌గా మారుతున్న మన దగ్గర ఇలాంటి సదస్సు జరగడం గర్వకారణమని పేర్కొన్నారు. ‘‘మీరంతా డాక్టర్లుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయినా సరే, ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తితో ఇక్కడికి వచ్చారు. ఇదే మీ విజయ రహస్యం. ఎప్పుడైతే కొత్తవి నేర్చుకోవడం ఆపేస్తామో.. అప్పుడే మన ఎదుగుదల ఆగిపోతుంది. నిరంతరం నేర్చుకుంటూ ఉండటమే విజయానికి సూత్రం” అని పేర్కొన్నారు. ప్రాణాలు కాపాడే డాక్టర్లను ప్రజలు దైవంగా భావిస్తారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. 

వైద్యరంగానికి పెద్దపీట

వైద్య రంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, డాక్టర్లు ఇచ్చే సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని రేవంత్‌‌రెడ్డి తెలిపారు. ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు బాగా పెరిగాయని అన్నారు. వీటిని అడ్డుకునేందుకు డాక్టర్లు సామాజిక బాధ్యత తీసుకోవాలన్నారు. ‘‘ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు సీపీఆర్ చేయడం ఎలాగో నేర్పించాలి. కార్డియాలజిస్టులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పిల్లలకు ఈ టెక్నిక్ నేర్పిస్తే.. భవిష్యత్తులో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వారవుతారు” అని తెలిపారు.  కేవలం జబ్బు వచ్చాక చికిత్స చేయడమే కాదు.. అసలు రాకుండా చూసుకోవడంపై (ప్రివెంటివ్ మెడిసిన్) దృష్టి పెట్టాలని సూచించారు. దీనిపై ప్రజల్లో తగినంత అవగాహన లేదని, డాక్టర్లే చొరవ తీసుకొని ప్రజలను చైతన్యం చేయాలన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే గుండె జబ్బుల మరణాలను తగ్గించవచ్చని చెప్పారు.