ప్రపంచ బల్క్ డ్రగ్ రాజధానిగా హైదరాబాద్

ప్రపంచ బల్క్ డ్రగ్ రాజధానిగా హైదరాబాద్
  • వ్యాక్సిన్లలో 33% , బల్క్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌లో 40%  ఇక్కడి నుంచే: సీఎం రేవంత్
  • జీనోమ్‌‌‌‌ వ్యాలీతో తెలంగాణకే గుర్తింపు 
  • రాబోయే రోజుల్లో డేటా సిటీగా హైదరాబాద్‌‌‌‌ 
  • ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం 
  • చైనా ప్లస్ వన్‌‌‌‌గా హైదరాబాద్‌‌‌‌ను సృష్టించడమే మా లక్ష్యం
  • 18 నెలల్లో రాష్ట్రానికి రూ.3.28 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం
  • శామీర్‌‌‌‌‌‌‌‌పేటలో ఐకార్ బయోలాజిక్స్ కొత్త యూనిట్‌‌‌‌కు శంకుస్థాపన 
  • మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్‌‌‌‌ బాబు హాజరు

హైదరాబాద్, వెలుగు:ప్రపంచ బల్క్‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ రాజధానిగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఎదిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 33% , బల్క్ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌లో 40% హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతోందని తెలిపారు. 

ప్రపంచాన్ని కరోనా భయపెడుతున్న సమయంలో జీనోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్లు తయారు చేసి, 100 దేశాలకు అందించామని, ఈ గొప్పతనం ఇక్కడి పారిశ్రామిక వేత్తలదేనని కొనియాడారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని శామీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయోలాజిక్స్ కొత్త యూనిట్‌‌‌‌‌‌‌‌కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘25 ఏండ్ల క్రితం కేవలం 1,200 ఎకరాల్లో ప్రారంభించిన ఈ జీనోమ్‌ వ్యాలీ.. వ్యాక్సిన్లలో, బల్క్‌ డ్రగ్స్‌ ఉత్పత్తిలో ప్రపంచానికే రాజధానిగా హైదరాబాద్‌ను నిలబెట్టింది. తెలంగాణకు కూడా గుర్తింపు తీసుకొచ్చింది. ఇక్కడ ప్రారంభించిన పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తల కృషి వల్లే రాష్ట్రానికి ఈ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 

ఈ సందర్భంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలను అభినందిస్తున్నా’’అని సీఎం పేర్కొన్నారు. ఫార్మా, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి మద్దతు తెలంగాణకు మరింత అవసరమన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని, ఇందుకోసం తమ మద్దతు, ప్రోత్సహం, ప్రోత్సాహకాలు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 

కోవిడ్ తర్వాత ప్రపంచ దేశాలు చైనా ప్లస్ వన్ దేశాన్ని అన్వేషిస్తున్నాయని, ప్రస్తుతం తైవాన్ ఒక ప్రత్యామ్నాయంగా ఉన్నప్పటికీ, పెట్టుబడిదారులు భారతదేశం వైపు చూస్తున్నారన్నారు. అయితే తెలంగాణ, హైదరాబాద్‌ను చైనా ప్లస్ వన్ ఆల్టర్నేట్‌గా సృష్టించడమే తన లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం అవసరమైన వాతావరణం, మౌలిక సదుపాయాలు, విధానాలను రూపొందించడానికి కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. 

పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నం..

రాష్ట్రంలో పార్టీలు, ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాలు మారలేదని సీఎం రేవంత్‌ అన్నారు. ‘‘దాదాపు 1994 నుంచి పదేండ్ల చొప్పున టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ప్రస్తుతం మేము అధికారంలో ఉన్నాం. అయినా పరిశ్రమల పాలసీలు, ఇన్సెంటివ్స్, పరిశ్రమలకు అనుమతులిచ్చే విషయంలో విధానపరమైన నిర్ణయాల్లో మెరుగుపరుచుకుంటూనే ముందుకెళ్లాం. ఎక్కడా పరిశ్రమలకు ఇబ్బంది కలిగించలేదు. 

పారిశ్రామిక విధానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేలా మా నిర్ణయాలు ఉన్నాయి’’అని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని మరింత వేగంగా, మెరుగైన పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్లి, పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఐటీ, ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి 18 నెలల్లో దాదాపు రూ.3.28 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చినట్లు వెల్లడించారు. 

డేటా సెంటర్స్‌కు హైదరాబాద్ కీలక కేంద్రంగా మారిందని, జీసీఎస్‌లో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, భవిష్యత్‌లో డేటా సిటీగా అవతరిస్తుందని చెప్పారు. బయో ఫార్మాతో పాటు ఇతర పరిశ్రమలను ఆకర్షించడంలో తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే ముందుందన్నారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలతోనే కాకుండా ప్రపంచ దేశాలతో పోటీ పడాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 

తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా, తమ లక్ష్యం 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవడమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భారత ఆర్థిక వ్యవస్థకు తాము 10% సహకారం అందించాలని కోరుకుంటున్నామన్నారు. 

గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా తెలంగాణ: శ్రీధర్ బాబు 

రాష్ట్రాన్ని గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు అన్నారు. ఐకార్‌తో కొత్తగా 800 మందికి ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇటీవల కాలంలో 23 శాతంగా ఉందని, అదే సమయంలో జాతీయ సగటు 14 శాతం మాత్రమేనన్నారు. 

తెలంగాణ జీఎస్డీపీలో లైఫ్ సైన్సెస్ రంగం వాటా 2.5 శాతం నుంచి 3 శాతం వరకు ఉందని, ఇది జాతీయ సగటు కంటే రెట్టింపు అని తెలిపారు. ‘సీబీఆర్‌ఈ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ 2025’నివేదిక ప్రకారం, ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్ల జాబితాలో బోస్టన్, శాన్‌ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జ్, టోక్యో తదితర నగరాల సరసన హైదరాబాద్ చేరిందని మంత్రి ప్రకటించారు. భారత్ నుంచి ఈ జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్న నగరం హైదరాబాద్ అని, ఇది తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. 

2024లో హైదరాబాద్‌లో 2.4 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లైఫ్ సైన్సెస్ సంస్థలు కొత్తగా అద్దెకు తీసుకున్నాయని, 2023లో ఇది 1.8 మిలియన్ చదరపు అడుగులు మాత్రమే ఉందన్నారు. లైఫ్ సైన్సెస్ రంగ వృద్ధికి ఊతమిచ్చేలా అవసరమైన ఎకో సిస్టమ్‌ను నిర్మించడంలో రాష్ట్రం ప్రపంచానికి దిక్సూచిగా మారిందన్నారు. హైదరాబాద్ – నాగ్‌పూర్, హైదరాబాద్ – బెంగళూరు కారిడార్లలో ప్రత్యేకంగా ఫార్మా విలేజ్‌లను అభివృద్ధి చేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు.

 నెక్స్ట్ జనరేషన్ బయో -మాన్యుఫ్యాక్చరింగ్, సెల్ అండ్ జీన్ థెరపీ, ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ, ఔషధాల ఉత్పత్తి, అరుదైన వ్యాధులపై పరిశోధన, సుస్థిరాభివృద్ధికి గ్రీన్ కెమిస్ట్రీ, బయో -కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ తదితర అంశాల్లో తెలంగాణను ప్రపంచ లైఫ్ సైన్సెస్ పటంలో అగ్రస్థానంలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని మంత్రి వివరించారు. 

ఉద్యోగ, ఉపాధితో పాటు నైపుణ్యాభివృద్ధికి సీఎం కృషి: మంత్రి వివేక్ 

రాష్ట్రంలో పరిశ్రమల ద్వారా మరిన్ని ఉద్యోగాలను సృష్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని కూడా ప్రారంభించారని, ఇది చాలా మందికి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు. 

స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించాలనే సీఎం ఆకాంక్ష నిజమవుతోందని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని పెంచడానికి, ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారని, ఈ ప్రక్రియలో ఐకార్ లాబొరేటరీస్ సుమారు 1,400 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ.. సహకారం అందిస్తోందని అన్నారు. ఐకార్‌‌ లాబొరేటరీస్ ఎండీ ఆనంద్, వారి కుటుంబం, సిబ్బంది కృషిని మంత్రి కొనియాడారు. 

ఐకార్‌‌ లాబొరేటరీస్ ఎండీ ఆనంద్ తనకు చాలా ఏండ్లుగా తెలుసునని, ఆయన డైనమిక్ వ్యక్తి అని అన్నారు. చక్కెర పరిశ్రమ నుంచి ఈ స్థాయికి రావడానికి పడిన కృషి, ప్యాషన్ అద్భుతమని ప్రశంసించారు. ప్లాస్మా ఫ్రాక్చనైజేషన్‌లో ఆయన ప్రవేశపెట్టిన కొత్త సాంకేతికత భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో 20కి పైగా ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి కావడం సంతోషకరమని మంత్రి పేర్కొన్నారు.