
- ఆపరేషన్ సిందూర్‌తో మన సత్తా ప్రపంచానికి తెలిసింది: సీఎం రేవంత్ రెడ్డి
- ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కేంద్రానికి పూర్తి మద్దతు
- మా శాంతి సిద్ధాంతాన్ని చేతగానితనంగా భావించవద్దు
- ఎవరైనా భారత్‌పై దాడి చేయాలని చూస్తే,
- వాళ్లకు భూమ్మీద నూకలు చెల్లినట్టేనని హెచ్చరిక
- ఆర్మీకి మద్దతుగా హైదరాబాద్‌లో సంఘీభావ ర్యాలీ
హైదరాబాద్, వెలుగు: ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు తీసుకునే ఏ చర్యకైనా పార్టీలకు అతీతంగా కేంద్రానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేసే వారిని క్షమించేది లేదన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్‌ను ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టే సత్తా భారత్‌కు ఉందని అన్నారు. మన జవాన్లు ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశ సైనిక శక్తిని ప్రపంచానికి చాటిచెప్పారని కొనియాడారు. శాంతి మార్గంలో బ్రిటీషోళ్లను ఓడించిన మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించే భారత్.. అవసరమైతే తన శక్తిని ప్రదర్శించడానికి వెనుకాడబోదని అన్నారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆర్మీకి మద్దతుగా హైదరాబాద్‌లోని సెక్రటేరియెట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు జాతీయ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడి మృతులకు పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు, వాళ్లకు సహకరించే దేశాలకు గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ‘‘140 కోట్ల మంది భారతీయులు దేశ రక్షణలో ఏకమై ఉన్నారు. తెలంగాణ నుంచి జవాన్లకు పూర్తి మద్దతు ఉంటుంది. మన జవాన్లు ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి, దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటారు” అని అన్నారు. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు జవాన్లకు అండగా నిలుస్తారని, ఈ ర్యాలీ ద్వారా దేశవ్యాప్తంగా స్ఫూర్తి నింపాలని పిలుపునిచ్చారు.
శాంతి సిద్ధాంతం.. మా బలహీనత కాదు
భారత సార్వభౌమత్వంపై దాడి చేస్తే, ఎవరినీ వదిలిపెట్టబోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ‘‘మహాత్మాగాంధీ శాంతియుత పోరాటంతో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టారు. ఆ శాంతి సిద్ధాంతాన్నే భారతీయులు పాటిస్తున్నారు. మేం శాంతిని కోరుకుంటాం.. అభివృద్ధి పథంలో దేశాన్ని నడిపిస్తాం. కానీ మా శాంతి సిద్ధాంతాన్ని బలహీనతగా భావిస్తే, ఆపరేషన్ సిందూర్ ద్వారా సమాధానం చెబుతాం. భారత్ ప్రపంచంలోనే గొప్ప దేశంగా నిలిచే దిశగా పయనిస్తున్నది. ఉగ్రదాడులతో మా దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేసే వారిని క్షమించేది లేదు. మా శాంతి సిద్ధాంతాన్ని ఎవరైనా చేతగానితనంగా భావించి, మా భూభాగంలో కాలుమోపి, మా ఆడబిడ్డల నుదుటి సిందూరాన్ని తుడిచి వెయ్యాలని అనుకుంటే.. అలాంటి వాళ్లకు ఆపరేషన్ సిందూర్ సమాధానం. మా జవాన్లు తలుచుకుంటే ఒక్క రాత్రిలోనే పాకిస్తాన్‌ను ప్రపంచ పటం నుంచి తొలగించగలరు” అని హెచ్చరించారు.
అలాంటోళ్లకు భూమ్మీద చోటుండదు..
రాజకీయాలు, పార్టీలు వేరైనా.. దేశ రక్షణ విషయంలో 140 కోట్ల మంది భారతీయులు ఒక్కటేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు తీసుకునే ఏ చర్యకైనా మద్దతు ఇస్తామని ప్రధాని మోదీని కలిసి కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ తెలిపారు. ఎన్నికల టైమ్‌లో రాజకీయ భేదాలు ఉండొచ్చు. కానీ దేశ రక్షణ విషయంలో మేం అందరం ఒక్కటే. భారత సార్వభౌమత్వంపై దాడి చేయాలనుకునే వారికి ఈ భూమిపై చోటుండదు. పాక్ ఉగ్రవాదులు, పాక్ పాలకులు, అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఉన్నా ఏ దేశమైనా సరే.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, భారత సార్వభౌమత్వంపై దాడి చేయాలనుకొని భారత్ వైపు కన్నెత్తి చూస్తే.. వాళ్లకు ఈ భూమ్మీద నూకలు చెల్లినట్టే” అని హెచ్చరించారు. ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ విజయశాంతి, సీఎస్ రామకృష్ణారావు, మాజీ సైనికాధికారులు, పోలీస్ ఆఫీసర్లు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.