ఇల్లిల్లు తిరిగి అడుక్కున్నా..కేసీఆర్ను జనం క్షమించరు: సీఎం రేవంత్ రెడ్డి

ఇల్లిల్లు తిరిగి అడుక్కున్నా..కేసీఆర్ను  జనం క్షమించరు: సీఎం రేవంత్ రెడ్డి

చేవెళ్ల/కంటోన్మెంట్, వెలుగు: ఓట్ల కోసం వచ్చే బీజేపీ, -బీఆర్​ఎస్​ నాయకులను నిలదీయాలని, ఇనుప సలాకు కాల్చి వాతపెట్టాలని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘పదేండ్లు  ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్​ తెలంగాణను పట్టించుకోలేదు. ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నరు. మోదీ పాలనలో  వికసిత్​ భారత్​కాదు.. ఆకలి భారత్​గా మారింది” అని తెలిపారు. ‘‘కేసీఆర్​ ఊరూరు తిరిగినా.. ఇల్లు ఇల్లు తిరిగి అడుక్కున్నా.. తెలంగాణ సమాజం ఆయనను క్షమించదు. ఆయన కాళ్లు పైకి, చేతులు కిందికి పెట్టి తిరిగినా ప్రజలు నమ్మరు” అని అన్నారు. గురువారం రాత్రి సికింద్రాబాద్​లోని బాలమ్​రాయ్​లో, రాజేంద్రనగర్​లో నిర్వహించిన కార్నర్ మీటింగ్స్​లో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రజలను కేసీఆర్​ మోసం చేసినందుకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు తిత్తితీశారు. కారును ఖార్ఖానాకు పంపారు. ఇక కారు ఖార్ఖానా నుంచి సరాసరి తూకానికే పోతది” అని అన్నారు. కారు పైనైపోయిందని బస్సు వేసుకుని కేసీఆర్  బయలుదేరారని, ఆయన యాత్రకు వస్తుంటే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయినట్లుందని విమర్శించారు. ‘‘పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్​ ఏనాడైనా ప్రజలను కలిసిండా? సెక్రటేరియెట్​కు వచ్చిండా? ప్రగతి భవన్​ గేట్ల ముందు గద్దరన్నను నాలుగు గంటలు కూసోబెట్టిండు. అధికారం ఉన్నంత సేపు ఆంధ్ర కాంట్రాక్టర్లు, హైదరాబాద్​ రియల్​ఎస్టేట్​వాళ్లే కేసీఆర్​కు యాదికొచ్చిన్రు. ఇప్పుడు కారు ఖతం అయ్యేసరికి ప్రజలు గుర్తొచ్చినట్టు ఫామ్​హౌస్​ నుంచి బయటకు వచ్చిండు” అని రేవంత్​ అన్నారు. 

బీజేపీ అంటే బ్రిటీష్​ జనతా పార్టీ

డెబ్బయ్యేండ్లుగాఅమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కుట్రచేస్తున్నదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘బీజేపీ వాళ్లు నమో అంటున్నారు.. నమో అంటే నమ్మించి మోసం చేయడం. ఇయాళ తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి.. సిద్దిపేటలో అమిత్​షా, మొన్న మధ్యప్రదేశ్​లో మోదీ మాట్లాడుతూ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నరు. 400 సీట్లు వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నరు” అని మండిపడ్డారు. బీజేపీ అంటే  బ్రిటీష్ జనతా పార్టీ అని, వాళ్ల ఎజెండా బ్రిటీషోళ్ల ఎజెండా లెక్క ఉంటుందని విమర్శించారు. బీజేపీ నేతలు దేవుడిని అడ్డు పెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ‘‘దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి..” అని చెప్పారు. ‘‘రిజర్వేషన్లు రద్దు చేస్తామని మోదీ, అమిత్ షా చెప్తున్నారు.. దీనికి చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి ఏం సమాధానం చెప్తారు?” అని ఆయన ప్రశ్నించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్​ కాంగ్రెస్​ అభ్యర్థి శ్రీగణేష్​ను, మల్కాజ్​గిరి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్​రెడ్డిని, చేవెళ్ల కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రంజిత్​రెడ్డిని గెలిపించాలని రేవంత్​రెడ్డి కోరారు.