100 లక్షల కోట్ల అప్పులతో దేశాన్ని మోదీ దివాలా తీయించారు: సీఎం రేవంత్

100 లక్షల కోట్ల అప్పులతో దేశాన్ని మోదీ దివాలా తీయించారు: సీఎం రేవంత్

ప్రధాని నరేంద్ర మోదీ 100 లక్షల కోట్లు అప్పు చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశం పూర్తిగా దివాళా తీయడానికి మోదీనే కారణమన్నారు. దేశానికి రాహుల్ గాంధీ లాంటి నాయకుడు అవసరమని చెప్పారు రేవంత్.  మోదీ రైతులను ఏనాడు పట్టించుకోలేదన్నారు.  మూడోసారి ప్రధానిని చేసేందుకు మోదీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్టేనని విమర్శించారు. 

గాంధీ భవన్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. అప్పులు, ఫిరాయింపుల్లో ప్రధాని  మోదీ, కేసీఆర్ పోటీపడ్డారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ సచ్చిపోయింది..బావాబామ్మర్దులే పోటీపడుతున్నారని ధ్వజమెత్తారు.  రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై బీఆర్ఎస్ ఏనాడు కేంద్రంతో పోరాడలేదని చెప్పారు. కేసీఆర్ అడగలేదు..మోడీ ఇవ్వలేదన్నారు. తెలంగాణ  హక్కులను కేంద్రం నిర్లక్ష్యం చేసిందన్నారు.  విభజన హామీలు నెరవేర్చాలంటే  కేంద్రంలో కాంగ్రెస్ ఉండాలన్నారు రేవంత్.  తెలంగాణ నుంచి 17 సీట్లు గెలిస్తే తెలంగాణకు మేలన్నారు. 

ఎంపీకి అప్లికేషన్..రూ.50 వేలు చెల్లించాలి
 
రాజ్యసభ ఎన్నిలకు అభ్యర్థుల ఎంపిక  అధిష్టానం చూసుకుంటదన్నారు రేవంత్.  రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులు గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 3 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవాలని సూచించారు. ఓసీలు అప్లికేషన్ రూ. 50 వేలు,  ఎస్సీ,ఎస్టీ,అభ్యర్థులు రూ.25 వేలు చెల్లించాలని చెప్పారు.   ప్రతి ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్ కు  ఇన్ చార్జ్ నియమించామన్నారు. త్వరలోనే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఉంటాయని తెలిపారు.  ఫిబ్రవరి 2 ఇంద్రవెల్లి నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తామన్నారు.