
- అలాంటి సన్నాసులను పట్టించుకోను..
- ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం: సీఎం రేవంత్
- 2029లోగా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తం
- అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంపుసెట్లు
- ఈ సెగ్మెంట్‌ను దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ప్రకటన
- నాగర్‌కర్నూల్ జిల్లా మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ ప్రారంభం
- నల్లమల డిక్లరేషన్ విడుదల
నాగర్ కర్నూల్, వెలుగు: తమ ప్రజా ప్రభుత్వం 16 నెలల్లో సాధించిన విజయాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని, కొందరు కడుపునిండా విషం పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘కొందరు అడ్డగోలుగా, అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నరు. ఊరికిద్దరు తాగుబోతులు ఉన్నట్టే తెలంగాణలోనూ నలుగురైదుగురు సన్నాసి లీడర్లు ఉన్నరు. వారి విమర్శలను నేను పట్టించుకోను” అని ఆయన అన్నారు. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో, శాంతిభద్రతల పరిరక్షణలో, నిరుద్యోగ సమస్య నిర్మూలనలో, పన్నుల వసూళ్లలో తెలంగాణ నంబర్‌గా ఉందని.. ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని తెలిపారు. తమకు పరిపాలన చేతకాదనే సన్నాసులకు ఇదే సమాధానమని ఆయన పేర్కొన్నారు. వాళ్లు ఎంత తప్పుడు ప్రచారం చేసినా తమ పథకాలే ప్రజలకు నిజాలు చెప్తాయని అన్నారు.
రూ. 12,600 కోట్ల ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. సౌర గిరి జల వికాసం పైలాన్‌ను ఆవిష్కరించారు. గిరిజన సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. రిమోట్ ద్వారా సోలార్ మోటార్లు ఆన్ చేశారు. అనంతరం చెంచు మహిళా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అచ్చంపేట నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు రూ.119 కోట్ల విలువైన చెక్కు అందజేశారు. నల్లమల డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఒకప్పుడు నల్లమల బాగా వెనుకబడిన ప్రాంతమని, ఈ ప్రాంతానికి చెందిన తాను ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రినై, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నానని సీఎం రేవంత్ అన్నారు. ‘‘ఇది బూర్గుల రామకృష్ణారావు, జయపాల్‌రెడ్డి, మహేంద్రనాథ్ పుట్టిన ప్రాంతం. ఈ ప్రాంత బిడ్డను కావడం నాకు గర్వకారణం. పాలమూరు బిడ్డలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో మట్టి పనికి వెళ్లారు. పాలమూరు బిడ్డల చెమట చుక్క చూడని ప్రాజెక్టులు లేవు. ఈ వేదిక ద్వారా నల్లమల డిక్లరేషన్ ప్రకటించడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంత అభివృద్ధిలో ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు నాకు కూడా బాధ్యత ఉంది. నల్లమల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేసి.. నిధులు విడుదల చేసి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తం” అని తెలిపారు.
మాచారంలో పోడుభూములు పోరు భూములుగా మారాయని, పోడు సాగు చేస్తున్న చెంచులపై కేసులు పెట్టి జైళ్లకు పంపించారని, తమ ప్రభుత్వం చెంచులకు పట్టాలిచ్చి ఆ భూముల్లో బోర్లు వేయించడంతో పాటు పైప్లైన్లు, డ్రిప్ సిస్టం ఏర్పాటు చేసి తోటలు పెంచుకునేందుకు చేయూతనిస్తున్నదని వివరించారు. చెంచులు ఆత్మగౌరవంతో జీవించేందుకు ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం చేపట్టామన్నారు. ‘‘వస్తూ వస్తూ నేను అలివేలు అనే చెంచు మహిళతో మాట్లాడిన. ఆమెకు తోటల పెంపకంపై మంచి అవగాహన ఉంది. ఆమెను మాస్టర్ ట్రైనర్‌గా గుర్తించి చెంచు పెంటలు, గూడెల్లో శిక్షణ ఇప్పించాలని అధికారులకు చెప్పిన. కొడంగల్‌లోనూ ఆమెతో శిక్షణ ఇప్పిస్త” అని సీఎం తెలిపారు. చెంచులు తమ అవసరాలకు సోలార్ విద్యుత్ వినియోగించుకుని మిగులు సోలార్ విద్యుత్‌ను అమ్ముకునేలా చూడాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులందరికీ 100 రోజల్లో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సోలార్ విద్యుత్ వినియోగంలో అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తం
2029 లోగా తెలంగాణలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు కేటాయిస్తే వారే నిర్వహించుకుంటున్నారని, 600 ఆర్టీసీ బస్సులు మహిళలకు కేటాయించామని చెప్పారు. శిల్పారామం దగ్గర మూడున్నర ఎకరాల్లో 100 స్టాల్స్ ఏర్పాటు చేశామని.. మహిళలు ఆదానీ, అంబానీతో పోటీపడే విధంగా ఎదగాలన్నారు. ఒక ఆడబిడ్డ ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం, ఆ ప్రాంతం బాగుపడుతుందని తెలిపారు. ‘‘మహిళా పొదుపు సంఘాలకు గత ఏడాది 21వేల కోట్లు ఇవ్వగా , ఈఏడాది ఇప్పటికే రూ.15వేల కోట్లు బ్యాంక్ లింకేజీ పూర్తి అయింది. మా ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా, కనీస మద్దతు ధర, సన్నాలకు రూ.500 బోనస్రూపంలో రైతులకు రూ.60 వేల కోట్లు ఖర్చు చేసింది. వరి వేస్తే ఉరే అన్న మాజీ సీఎం తన ఫామ్‌హౌస్‌లో మాత్రం సన్నాలు పండించిండు. సన్న వడ్లు పండించాలని చెప్తే నన్ను సన్నాసి అని విమర్శించిన్రు. పేద ప్రజలకు ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం చూసి వాళ్లే సన్నాసులయ్యారు” అని ఆయన అన్నారు. రెండు సీజన్లలో 2.80లక్షల టన్నుల సన్న బియ్యం పండించారని, ఇది దేశంలోనే రికార్డు అని తెలిపారు. ప్రతి నెలా 3.10 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నామని, గృహజ్యోతి కింద 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ అందజేస్తున్నామని ఆయన వివరించారు.
ఇది సువర్ణ అధ్యాయం: డిప్యూటీ సీఎం భట్టి
జల్ జంగిల్ జమీన్ పోరాటాలు జరిగిన నేలపై ఇందిర సౌరగిరి జలవికాసం పథకం ప్రారంభించడం సువర్ణ అధ్యాయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ పథకం కింద ఆదివాసీలు, చెంచులు, గిరిజనులకు భూములిచ్చి వాటిని సాగులోకి తెస్తామని తెలిపారు. నల్లమల డిక్లరేషన్‌తో ఆదివాసీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ డిక్లరేషన్‌ను పూర్తిస్థాయిలో అమలుచేసి, నాలుగేండ్లలో ఆ ఫలితాలను రాష్ట్ర గిరిజనులకు అందిస్తామని చెప్పారు. అభివృద్ధికి దూరంగా ఉన్న ఆదివాసుల కోసం రూ. 12,600 కోట్లతో పథకాన్ని ప్రారంభించడం ఓ గొప్ప సాహసమని తెలిపారు. ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాడో లాంటి పంటలను గిరిజనులతో సాగుచేయిస్తామని, ఈ పంట ద్వారా రెండేండ్లలో ఫలసాయం అందుతుంఈదని ఆయన పేర్కొన్నారు. పండ్ల తోటల్లో గిరిజనులకు ఆదాయం వచ్చేలా అంతర పంటలు సాగుకు ఉద్యాన శాఖ ద్వారా ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. జూన్ 2న గిరిజన యువతకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రూ. 1,000 కోట్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఇది పేదల ప్రభుత్వమని, ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలే కాపాడుకోవాలన్నారు. పదేండ్లు పాలించిన వారెవరూ ఒక్కరోజు కూడా పేద బిడ్డల ఆహారం గురించి ఆలోచించలేదని, రేవంత్ రెడ్డి సీఎం కాగానే కేబినెట్ సహచరులందరినీ కూర్చోబెట్టి సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల డైట్ చార్జీలు 40 శాతం , కాస్మోటిక్ చార్జీలు 200శాతం పెంచాలని ఆదేశించారని డిప్యూటీ సీఎం వివరించారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వరుస నోటిఫికేషన్లు వద్దంటున్నరు
తమ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే ప్రభుత్వ రంగంలో 60 వేలు, ప్రైవేట్ రంగంలో లక్ష ఉద్యోగాలు ఇచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘‘గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు లేవని ఆందోళనకు దిగిన స్టూడెంట్లు.. ఇప్పుడు వరుస నోటిఫికేషన్లు వద్దని నిరసన తెలుపుతున్నరు. 12 యూనివర్సిటీలకు వైస్ చాన్స్లర్లను నియమించినం. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నం. ప్రపంచ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్‌కు తెస్తున్నం. రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినం. గిరిజనులు, దళితులు, ఇతర బడుగు, బలహీనవర్గాల గురించి ఆలోచించే సర్కారు కాంగ్రెస్ ఒక్కటే. రాష్ట్రంలో 25 లక్షల ఎకరా లను అసైన్డ్పట్టాల కింద పంచి పెట్టిన ఘనత మాజీ ప్రధాని , దివంగత ఇందిరాగాంధీకి దక్కుతుంది. అందుకే సౌరగిరి జలవికాసం పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టినం” అని తెలిపారు. పహల్గాం ఘటన తర్వాత దేశప్రజలంతా ప్రధాని అంటే ఇందిరాగాంధీలా ఉండాలని అంటున్నారని, 54 ఏండ్ల కింద ఆమె సాహసాన్ని గుర్తు చేసుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు.
నల్లమల డిక్లరేషన్ ఇదే..
- తెలంగాణ ప్రభుత్వం ఆర్ఓఎఫ్ఆర్ చట్టం–2006 ప్రకారం 6.69 లక్షల ఎకరాల పోడు భూములపై 2,30,735 గిరిజన కుటుంబాలకు హక్కులు కల్పించింది.
- ఆయా భూములకు నీటిపారుదల సౌకర్యం కల్పించాలని పోడురైతులు చాలా కాలంగా డిమాండ్చేస్తున్నారు. ఈ క్రమంలో పోడు భూములు కలిగిన ఎస్టీ రైతులకు సోలార్ పంపు సెట్లను 100% సబ్సిడీపై అందించాలని 2025 జనవరి10న ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించడమేగాక ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని రూపొందించింది.
- ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం, మాచారం గ్రామంలో సోమవారం ప్రారంభించారు. ఇక్కడ 27 మంది ఎస్టీ రైతులకు చెందిన 44.5 ఎకరాలకు సాగునీటి ప్రయోజనం కలుగనుంది.
- 2025-–26 సంవత్సరం నుంచి 2029–-30 వరకు ఐదేండ్ల పాటు అటవీ, ఇంధనం, ప్రజా రవాణా, గ్రామీణాభివృద్ధి డబ్ల్యూఎస్, భూగర్భ జలాలు, ఉద్యానవన శాఖలన్నీ ఈ స్కీమ్‌లో భాగస్వాములు
- కానున్నాయి.
- వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన గిరిజన సమూహాల (పీవీటీజీ) కుటుంబాలకు ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద ఇండ్ల మంజూరు, రాజీవ్ యువ వికాసం పథకం కింద లక్ష మంది ఎస్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రూ.1000 కోట్ల సబ్సిడీతో ఆర్థిక సహాయం చేయనున్నట్లు నల్లమల డిక్లరేషన్‌లో స్పష్టంచేశారు.