తెలంగాణ పోటీ.. ప్రపంచంతోనే

తెలంగాణ పోటీ.. ప్రపంచంతోనే
  • వందేండ్ల ప్లాన్​తో ముందుకు పోతం
  • సీఐఐ సదస్సులో సీఎం రేవంత్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే వందేండ్లకు ఏం కావాలనే దానిపై ఇప్పుడే ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తే మరింత అభివృద్ధి సాధిస్తామని తెలిపారు. పెట్టుబడులతో వస్తే ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌‌లోని హోటల్ వెస్టిన్‌‌లో బుధవారం సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ‘‘అభివృద్ధి విషయంలో మాకు ఎలాంటి భేషజాలు లేవు.

లోక్​సభ ఎన్నికల తర్వాత రాజకీయాలకు విరామం ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మా ఫోకస్ అంతా డెవలప్​మెంట్​పైనే ఉన్నది. ప్రభుత్వం మారిందనే భయం వద్దు. విధానాలు పూర్తిగా మార్చేస్తారేమో.. పర్మిషన్లు రాకుండా పోతాయేమో.. పాలసీలన్నీ రీ రైట్ చేస్తారేమో అనే అనుమానాలు పెట్టుకోవద్దు. స్కిల్ డెవలప్​మెంట్​ను నేను గట్టిగా నమ్ముతా. సర్టిఫికెట్ అనేది జస్ట్ ఇంట్రడక్షన్ గా మాత్రమే పనికొస్తది. ప్రాక్టికల్​గా ఎక్స్​పీరియన్స్, టాలెంట్ లేకపోతే ప్రపంచంతో పోటీ పడలేం’’అని రేవంత్ అన్నారు. 

ఓఆర్ఆర్ అవసరమా? అన్నరు..

ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసినప్పుడు.. కొందరు అవసరమా? అని ప్రశ్నించారని రేవంత్ గుర్తు చేశారు. ఇప్పుడు అవే హైదరాబాద్​కు లైఫ్​లైన్​గా మారాయన్నారు. ‘‘ఫార్మా సెక్టార్​లో ఐదు కంపెనీలు వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తుంటే.. వాటిలో నాలుగు హైదరాబాద్​లోనే ఉన్నాయి. కంప్లీట్ రీజినల్ రింగ్ రోడ్డును, ఒక నేషనల్ హైవే కింద నెంబర్ ఇచ్చి.. సహకారం అందించాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరాం. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలంటే.. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్​మెంట్, స్కిల్ డెవలప్​మెంట్ అవసరం. ఇప్పుడున్న రోజుల్లో ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లతో ఉద్యోగం దొరకడం లేదు. తెలంగాణ యువత ప్రపంచంతో పోటీ పడాల్సి ఉంది’’అని తెలిపారు. 

సర్టిఫికెట్లతో ఎటు వెళ్లాలో తెలియడం లేదు

యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్ తో బయటికొచ్చిన యువతకు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని రేవంత్ అన్నారు. ‘‘ఏం చదువుకోని వాడు రూ.50 వేలు సంపాదిస్తున్నడు. బాగా చదువుకున్నోడికి రూ.15 వేలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు వస్తలేరు. ఎక్స్​పీరియన్స్​ ఉన్న సైట్ సూపర్​వైజర్ కు రూ.50 వేల జీతం వస్తున్నది. 15 వేలకు జాబ్ చేస్తాం సార్ అంటూ.. ఇంజినీరింగ్ చదువుకున్నోళ్లు అంటున్నరు.

చదువుకు, ఎక్స్​పీరియన్స్​కు ఎలాంటి సంబంధం లేదు’’అని రేవంత్ స్పష్టం చేశారు. ఒకప్పుడు రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి పేర్లు వినిపించేవి కాదని.. ఇప్పుడు పేపర్, టీవీల్లో రెగ్యులర్​గా వింటున్నామని తెలిపారు. దీనికి కారణం యువతకు ఉద్యోగాలు లేకపోవడం, చదువుకు తగ్గ జాబ్ దొరక్కపోవడమే అని చెప్పారు. 

గత పాలకులు హైదరాబాద్​ను అభివృద్ధి చేశారు

అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని రేవంత్ అన్నారు. హైదరాబాద్​ను గత పాలకులు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు. వాళ్లు తీసుకున్న మంచి నిర్ణయాలు కొనసాగిస్తామని తెలిపారు. ఆర్థిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్య, ఉపాధి రంగంలో సీఐఐతో కలిసి ముందుకు వెళ్తామని తెలిపారు.

‘‘రాష్ట్రంలో 64 ఐటీఐలను రూ.2 వేల కోట్లతో స్కిల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ సెంటర్లుగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో డ్రైపోర్ట్‌‌ ఏర్పాటు చేస్తాం. పెట్టుబడులకు రక్షణ కల్పించడంతో పాటు లాభదాయ నిర్ణయాలు తీసుకుంటాం” అని రేవంత్​ తెలిపారు.