V6 News

తెలంగాణ ఏరోస్పేస్ హబ్‌‌‌‌..స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలు

తెలంగాణ ఏరోస్పేస్ హబ్‌‌‌‌..స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలు
  • స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలు: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి
  • పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ
  • ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతుల్లో 117.9% వృద్ధి.. దేశంలోనే అత్యధికం 
  • ఈ వృద్ధిలో విమాన విడిభాగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వెల్లడి
  • శ్రీహరికోటకు పంపనున్న రాకెట్‌‌‌‌ విక్రమ్‌‌‌‌-1ను  జెండా ఊపి ప్రారంభించిన సీఎం
  • యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీతో భాగస్వామ్యానికి స్కైరూట్ సంస్థ సై

హైద‌‌‌‌రాబాద్ , వెలుగు: దేశంలోనే తెలంగాణ ఏరోస్పేస్ హ‌‌‌‌బ్‌‌‌‌గా అవ‌‌‌‌త‌‌‌‌రించ‌‌‌‌నున్నదని, రాష్ట్రం ఏరోస్పేస్ రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి తెలిపారు. ఏరోస్పేస్ రంగాన్ని ఒక కీలక వృద్ధి రంగంగా తమ ప్రభుత్వం పరిగణిస్తున్నదని వివ‌‌‌‌రించారు. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ హైదరాబాద్ న‌‌‌‌గ‌‌‌‌రంలోనే రూపకల్పన చేసి.. అభివృద్ధి చేసిన, శ్రీహరి కోటకు పంపనున్న ప్రైవేట్‌‌‌‌ ఆర్బిటల్‌‌‌‌ రాకెట్‌‌‌‌ విక్రమ్‌‌‌‌–--1ను శనివారం మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబుతో కలిసి సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌‌‌‌ర్భంగా రేవంత్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌‌‌‌ ఆర్బిటల్ రాకెట్​ ప్రయోగానికి స్కైరూట్ సిద్ధంగా ఉండ‌‌‌‌టం హ‌‌‌‌ర్షణీయం అన్నారు. స్కైరూట్ బృందాన్ని ప్రశంసించారు. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌‌‌‌ ఆర్బిటల్ రాకెట్‌‌‌‌ను స్కైరూట్ హైద‌‌‌‌రాబాద్‌‌‌‌లో అభివృద్ధి చేయ‌‌‌‌డం ఏరోస్పేస్ రంగంలో ఈ రాష్ట్ర వృద్ధికి  మైలురాయి అని పేర్కొన్నారు. ఈ సంస్థ 2022లో తన తొలి రాకెట్‌‌‌‌ను ప్రయోగించింద‌‌‌‌ని, అయితే, ఇంత తక్కువ సమయంలోనే ఆర్బిటల్ ప్రయోగ దశకు చేరుకోవ‌‌‌‌డం అభినందనీయమని తెలిపారు.


ఏరోస్పేస్ రంగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. బోయింగ్, ఎయిర్‌‌బస్, సాఫ్రాన్‌‌లాంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నాయ‌‌ని పేర్కొన్నారు.2047 నాటికి ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవాలన్నది తమ లక్ష్యమని తెలిపారు.2023 డిసెంబర్ నుంచి ఇంజినీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ అసాధారణ వృద్ధి న‌‌మోదు చేసింద‌‌న్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2023–-24, 2024–-25 మధ్యలో దేశంలోనే ఇంజినీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ 117.9% అత్యధిక వృద్ధిని నమోదు చేసిందని చెప్పారు.  అయితే, ఈ వృద్ధికి విమాన విడిభాగాలు, రక్షణ పరికరాలే ప్రధానంగా దోహదపడ్డాయని వివరించారు. ప్రపంచ విశ్వవిద్యాలయాలు, పారి శ్రామిక దిగ్గజాలతో భాగస్వామ్యాల ద్వారా ఏరోస్పేస్ రంగం అవ‌‌స‌‌రాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవ‌‌స‌‌ర‌‌మైన చర్యలపై తమ ప్రజా ప్రభుత్వం దృష్టి సారిస్తుంద‌‌న్నారు. అందుకు అవ‌‌స‌‌ర‌‌మైన విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రతిభతో స్కైరూట్‌‌లాంటి కంపెనీలకు మద్దతు ఇవ్వడానికి తమ ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ప్రతిభావంతులకు నైపుణ్య శిక్షణ ఇస్తామ‌‌న్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు), త్వరలో అప్‌‌డేట్‌‌ కానున్న పాలిటెక్నిక్ కళాశాలల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ఆయన వివరించారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా.. ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువ‌‌స్తామ‌‌ని చెప్పారు. ఈ సంస్థల్లో  అత్యుత్తమ శిక్షణ ఇవ్వడంపైనే తాము దృష్టి కేంద్రీక‌‌రించిన‌‌ట్టు వివ‌‌రించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏటీసీల్లో సిబ్బందికి టాటా టెక్నాలజీస్ ఇప్పటికే శిక్షణ అందిస్తున్నట్టు వివ‌‌రించారు. 

స్కిల్స్‌‌ వర్సిటీ ఆలోచన గొప్పది: స్కైరూట్‌‌ సీఈవో పవన్‌‌ కుమార్​

సీఎం రేవంత్‌‌ రెడ్డి సూచనకు స్పందనగా.. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌‌ర్సిటీతో కలిసి పనిచేయడానికి స్కైరూట్ ఏరోస్పేస్ సీఈవో, కోఫౌండ‌‌ర్‌‌ పవన్ కుమార్ ముందుకొచ్చారు. స్కిల్స్ యూనివర్సిటీ ఆలోచన ప్రత్యే కమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ వర్సిటీ ద్వారా త‌‌మ‌‌కు అవ‌‌స‌‌ర‌‌మైన ప్రతిభావంతులు దొరుకుతారని తెలిపారు. ఈ యూనివర్సిటీతో భాగస్వామ్యం కావడం త‌‌మ‌‌కు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంద‌‌న్నారు. ఇక హైదరాబాద్‌‌లోని మల్లేపల్లిలో ఉన్న ఏటీసీని సందర్శించాల్సిందిగా స్కైరూట్‌‌ సంస్థను సీఎం ఆహ్వానించారు.

 పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు పాఠ్యప్రణాళికను మార్చడంలో స్కిల్స్ యూనివర్సిటీ  కల్పిస్తున్న వెసులుబాటును  గుర్తు చేశారు. పాఠశాల విద్యా వ్యవస్థలోని లోపాలను పరిష్కరించడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికల గురించి సీఎం ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థిపై ఏడాదికి రూ. 1.08 లక్షలు ఖర్చు చేస్తున్నప్పటికీ, ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదని అన్నారు. దీనిని పరిష్కరించడానికి తాము ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించినట్టు తెలిపారు. కాగా, శ్రీహరికోట సతీశ్‌‌ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ప్రయోగ స్థలానికి రాకెట్ లాంఛనంగా బయలుదేరింది. రాబోయే నెలల్లో భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌‌ ఆర్బిటల్ ప్రయోగానికి స్కైరూట్ సిద్ధమవ‌‌నున్నది. ఈ కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్‌‌రెడ్డి, స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ నాగ భరత్ డాకా తదితరులు పాల్గొన్నారు.