
- భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నరు: సీఎం
- పేదలకు చుట్టంగా భూభారతి చట్టం
- భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే లైసెన్స్‌డ్ సర్వేయర్ల వ్యవస్థ
- భూ సర్వేలో తప్పులు చేస్తే ప్రజలు తిరగబడతరని హెచ్చరిక
- 3,456 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు నియామక పత్రాలు అందజేత
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ పార్టీ ఓటమికి వాళ్లు తెచ్చిన ‘ధరణి’ భూతమే ప్రధాన కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘కొద్దిమంది దొరలకు చుట్టంగా ధరణి చట్టాన్ని తెచ్చారు. దాన్ని అడ్డంపెట్టుకుని భూమిపై ఆధిపత్యం చెలాయించాలని, దోచుకోవాలనుకున్నరు. ఆ దొరలకు ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేశారు” అని తెలిపారు. ధరణి దరిద్రం వల్ల ఒక ఎమ్మార్వోను పెట్రోల్ పోసి తగలబెట్టిన చరిత్ర ఉందని, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జంట హత్యలకు కూడా ఆ ధరణినే కారణమైందని చెప్పారు. అందుకే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి భూతాన్ని వదిలించి, పేద ప్రజలకు చుట్టంగా ‘భూభారతి’ చట్టాన్ని తెచ్చామన్నారు. 3,456 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. గతంలో భూ సమస్యలు పరిష్కారం కాక అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉండేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకే లైసెన్స్‌డ్ సర్వేయర్ల వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పారు. ‘‘ఏ రైతు కూడా తమ భూమి సరిహద్దులు తెలవకుండా, భూమి పరాయి ఆధీనంలో ఉండడాన్ని సహించలేడు. రైతులకు సహాయంగా ఉండేందుకే ఈ వ్యవస్థ” అని వివరించారు.
అన్యాయం చేస్తే సహించం
‘‘భవిష్యత్తులో భూ యజమానుల హక్కులను, భూమి సరిహద్దులను నిర్ణయించే అధికారం తెలంగాణ రాష్ట్రం మీ చేతుల్లో పెట్టబోతున్నది. ఒకవేళ ఇందులో తప్పులకు తావిస్తే ప్రజలు మీ మీదనే కాదు.. ప్రభుత్వం మీద కూడా తిరగబడే అవకాశం ఉన్నది” అని లైసెన్స్‌డ్ సర్వేయర్లను సీఎం రేవంత్ హెచ్చరించారు. ‘‘మీ కష్టంలో నిజాయితీ, చిత్తశుద్ధి ఉండాలి. మీరు చేసిన శ్రమకు మీరు ఫీజు తీసుకోండి. తప్పులు చేయడం ద్వారా ఒక రైతుకు అన్యాయం చేస్తే అది మన కుటుంబ సభ్యులకే మనం అన్యాయం చేసుకున్న వాళ్లమవుతాం” అని వారికి హితబోధ చేశారు. ‘‘చేసే కష్టంలో నిజాయితీ, చిత్తశుద్ధి ఉండాలి” అంటూ లైసెన్స్‌డ్ సర్వేయర్లతో ప్రమాణం చేయించారు.
నాడు నియామకాలు వాళ్ల కుటుంబానికే..
నిధులు, నియామకాలు పేరుతో గతంలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినా.. నియామకాలు చేపట్టలేదని, కేవలం వారి కుటుంబ సభ్యులకే నియామకాలు ఇచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి, మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. 562 మంది గ్రూప్-1 ఉద్యోగులకు, 783 మంది గ్రూప్ -2 ఉద్యోగులకు నియామక పత్రాలు అందించామని తెలిపారు. మిగతవాళ్లకు కూడా త్వరలో అందిస్తామని చెప్పారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా ప్రస్తుతం 5 శాతంగా ఉందని, జీడీపీలో తెలంగాణ వాటా త్వరలోనే 10 శాతానికి చేరాలని అన్నారు. ఉద్యోగులు కష్టపడితేనే, ప్రజల సమస్యలు పరిష్కరిస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని సూచించారు. తమ సైన్యం, ప్రతినిధులు మీరేనని, తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఇది దీపావళి కానుక: మంత్రి పొంగులేటి
దశాబ్దాలుగా అసంతృప్తితో ఉన్న తెలంగాణ రైతాంగానికి లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకను అందించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ధరణి పేరిట చేసిన తప్పులను తమ ప్రభుత్వం సరిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టిందని, ఇందులో భాగంగా 3,456 మందికి లైసెన్స్‌లు మంజూరు చేశామని తెలిపారు. సీఎం రేవంత్ ఆలోచనల మేరకు నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని, రెవెన్యూలో భాగమైన సర్వే వ్యవస్థను పటిష్టం చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించినట్లు చెప్పారు. ఈ నియామక ప్రక్రియలో బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పదివేల మంది దరఖాస్తు చేసుకోగా.. ఏడువేల మందికి శిక్షణ ఇచ్చామన్నారు. వీరిలో 3,456 మంది క్షేత్రస్థాయిలో శిక్షణ పొంది ఎంపికయ్యారన్నారు. చిన్న అవకతవకలు జరగకుండా, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయకుండా, ప్రజా ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్టు చిత్తశుద్ధితో పనిచేయాలని నూతన సర్వేయర్లకు మంత్రి పొంగులేటి సూచించారు.
భూములను పంచిన చరిత్ర కాంగ్రెస్‌దే
తమ విజయానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ, బీఆర్‌ఎస్ ఓటమికి ప్రధాన కారణం మాత్రం ధరణి భూతాన్ని పెంచి పోషించడమేనని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి, భుక్తి, విముక్తి కోసమే జరిగిందని గుర్తుచేశారు. ‘‘కన్న తల్లిపై ఎంత మమకారం ఉంటుందో, సొంత గ్రామంలో భూమిపై కూడా అదే మమకారాన్ని ఇక్కడి ప్రజలు కొనసాగించారు. భూములను ఆక్రమించాలనుకున్నప్పుడు పేదవాళ్లు, దళితులు, గిరిజనులు నిటారుగా నిలబడి కొట్లాడిన చరిత్ర తెలంగాణది” అని పేర్కొన్నారు. పేదలకు భూములను పంపిణీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ‘‘విస్నూర్ దొరలు ఆక్రమించాలనుకున్న భూమి కోసం చాకలి ఐలమ్మ వీరనారిగా మారి పోరాటం చేసింది. తెలంగాణ ఉద్యమానికి ఆమె స్ఫూర్తిని అందించారు. ఆ పోరాటానికి కారణం భూమి మీద ఉన్న మమకారమే. అందుకే ఈ చరిత్రను ప్రజలందరూ గుర్తించుకోవాలి” అని సూచించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ద్వారా భూములను జాగీర్దారులు, జమీందారుల వద్ద నుంచి సేకరించి, దాదాపు 25 లక్షల ఎకరాల భూములను దళితులకు, గిరిజనులకు, పేదవాళ్లకు పంచిపెట్టిందని వివరించారు.