వికారాబాద్ జిల్లాలో అరుదైన గుడ్లగూబ ప్రత్యక్షమైంది.. జిల్లాలోని మోమిన్ పేట్ మండలం ఎన్కతల గ్రామంలోని స్టోన్ క్వారీలో అరుదైన గుడ్లగూబ దర్శనమిచ్చింది. ఇండియన్ రాక్ ఈగల్ ఓల్ జాతికి చెందిన ఈ గుడ్లగూబ ఐదు గుడ్లు కూడా పెట్టినట్లు సమాచారం. వారం రోజుల కిందట వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు ఈ గుడ్లగూబను గుర్తించారు. ఈ విషయంపై అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో క్వారీని సందర్శించారు వికారాబాద్ ఫారెస్ట్ అధికారులు.
క్వారీని సందర్శించిన అధికారులు నెల రోజుల పాటు పనులు నిలిపేయాలని క్వారి ఓనర్ ని కోరగా, క్వారీ పనులు నిలిపివేసేందుకు అంగీకరించి పనులకు బ్రేక్ వేయించారు క్వారీ ఓనర్. గుడ్లగూబ ఇప్పటికే ఐదు గుడ్లు పెట్టిందని.. మూడు గుడ్ల నుండి పిల్లలు బయటకు వచ్చాయని ఇంకో రెండు నెలల పాటు ఈ క్వారీ పనులు నిలుస్తున్నట్టు తెలిపారు వికారాబాద్ ఫారెస్ట్ అధికారులు.
ఈ గుడ్లగూబ 25 రోజుల్లో కనీసం మూడు పిల్లలను పొదుగుతుందని.. అంతరించి పోతున్న ఈ అరుదైన జాతి పక్షిని షెడ్యూల్-1లో చేర్చారని తెలిపారు అటవీశాఖ అధికారులు.అరుదైన జాతికి చెందిన ఈ గుడ్లగూబను చూసేందుకు స్థానికులు క్వారీ దగ్గరకు వస్తున్నారు. అంతరించిపోతున్న జాతికి చెందిన ఈ గుడ్లగూబను అటవీ అధికారులు రక్షించాలని కోరుతున్నారు స్థానికులు.
