
- ఇలాంటి టైమ్‌లో రాజకీయాలు, పార్టీలకు తావు లేదు: సీఎం రేవంత్
- అత్యవసర సేవల ఉద్యోగులకు సెలవులు రద్దు
- మంత్రులు, అధికారులు అందుబాటులో ఉండాలి
- కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇన్ఫర్మేషన్ సెంటర్
- బ్లడ్, ఆస్పత్రుల్లో బెడ్లు, మెడిసిన్ నిల్వలు పెంచుకోవాలి
- ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు ప్రత్యేక సెల్
- పాక్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చినోళ్లను
- అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు ఆదేశం
- దేశ సైన్యానికి సంఘీభావంగా నేడు సెక్రటేరియెట్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ
హైదరాబాద్, వెలుగు: దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇలాంటి కీలక సమయంలో రాజకీయాలు, పార్టీలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. అత్యవసర సేవలు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యోగులు, మంత్రులు, అధికారులంతా అందుబాటులో ఉండాలని.. విదేశీ పర్యటనలుంటే రద్దు చేసుకోవాలన్నారు. సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. సాయంత్రం మాక్ డ్రిల్ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మరో సమీక్ష కూడా చేపట్టారు. మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ప్రభుత్వ ఉద్యోగులు అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆఫీసర్లను ఆదేశించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చి అనధికారికంగా నివసిస్తున్న వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై ఉక్కుపాదం
శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను సీఎం రేవంత్ ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు పెంచుకోవాలని సూచించారు. అత్యవసర ఔషధాలు, ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల అందుబాటుపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని.. రెడ్‌క్రాస్‌తో సమన్వయం చేసుకోవాలన్నారు. ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూసుకోవాలని, నిత్యావసరాలకు ఎలాంటి కొరత రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. సైబర్ సెక్యూరిటీపై అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసుకోవాలని.. ఆ న్యూస్‌ను ప్రచారం చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. సిటీలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయాలన్నారు. రాష్ట్రంలోని సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రతను పెంచాలని, విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేయాలని సీఎం ఆదేశించారు. ఐటీ సంస్థల వద్ద భద్రత పెంచాలన్నారు. పాతనేరస్తులపై పోలీసులు నిఘా ఉంచాలన్నారు.
సాయంత్రం 6 గంటలకు ర్యాలీ
హైదరాబాద్ పరిధిలోని ఆర్మీ, నేవీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. రక్షణ రంగానికి చెందిన సంస్థల దగ్గర భద్రత కల్పించాలన్నారు. రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని, విదేశీ పర్యాటకులకు రక్షణ కల్పించాలని ఆదేశించారు. కేంద్ర నిఘా బృందాలతో రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. దేశ సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియెట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకూ ర్యాలీ నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందులో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
రాజకీయాల కంటే దేశమే ముందు
‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఉగ్రమూకల శిబిరాలను ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీని చూసి ప్రతి ఇండియన్ గర్వపడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకంటే దేశమే ముందని, రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కతాటిపై ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి భారతీయుడు ఆర్మీకి బాసటగా నిలువాలని కోరారు. టెర్రరిస్టులు దేశంలోకి వచ్చి ఇక్కడి పౌరులను చంపుతుంటే చూస్తూ ఊరుకో లేమన్నారు. రక్షణ రంగంలో హైదరాబాద్ కీలక ప్రాంత మని, దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని విభాగాలను అప్రమత్తం చేశామని సీఎం చెప్పారు.