- అన్ని మున్సిపాలిటీలను గెలుచుకొని రావాలి: సీఎం రేవంత్
- ఎన్నికలు పూర్తయ్యే వరకు నియోజకవర్గాల్లోనే ఉండాలి
- అసంతృప్తులను బుజ్జగించి ప్రచారంలో కలుపుకొనిపోవాలి
- ఉత్తర తెలంగాణలో బీజేపీని కట్టడి చేయాలి
- పార్టీ బలహీనంగా ఉన్నచోట ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచన
- 90 శాతం మున్సిపాలిటీలు కాంగ్రెస్‌వే: పీసీసీ చీఫ్
- ఈ ఎన్నికల్లో మజ్లిస్‌తో పొత్తు లేదు..
- సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌తో ఉందని క్లారిటీ
హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలి పించాల్సిన బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికలయ్యేవరకు నియోజకవర్గాల్లోనే ఉండాలని, అన్ని మున్సిపాలిటీలను గెలుచుకునే రావాలని ఆయన దిశానిర్దేశం చేశారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన క్యాంప్ ఆఫీసులో మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్‌కు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం పలు సూచనలు చేశారు. బుధవారం నుంచి మంత్రులంతా ఆయా జిల్లాల్లోనే ఉండాలని ఆదేశించారు. కేటాయించిన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలు, డీసీసీ చీఫ్‌లను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయాలని కోరారు. రెబల్స్ ను గుర్తించి కాంగ్రెస్ ఓట్లను చీలకుండా జాగ్రత్తపడాలని సూచించారు. పార్టీ నేతల ఆదేశాలను ధిక్కరించి బరిలో నిలిచిన రెబల్స్ పై పీసీసీ కఠినంగా వ్యవహరించాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ను సీఎం ఆదేశించారు. అసంతృప్తితో ఉన్న నాయకులను బుజ్జగించి వారిని ప్రచారంలో భాగస్వాములను చేయాలని కోరారు. కొత్త, పాత నేతలను సమన్వయం చేసుకుంటూ అం దరి మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేలా కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు. మూడు దశల్లో నిర్వహించిన సర్వే నివేదికలను సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో మంత్రులకు వివరించారు. కాంగ్రెస్ ఏయే మున్సిపాలిటీల్లో బలహీనంగా ఉందో సర్వే రిపోర్టులను చదివి వినిపించారు. అక్కడ కాంగ్రెస్ గెలిచేలా మంత్రులు స్వయంగా రంగంలోకి దిగాలని సీఎం కోరారు.
అక్కడ బీజేపీతోనే పోటీ..
ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌కు బీజేపీ గట్టిపోటీ ఇస్తున్నదని.. కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఆ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నా యని సీఎం ఈ సందర్భంగా మంత్రులతో అన్నట్లు సమాచారం. బీజేపీ బలంగా ఉన్నచోట్ల ఈ వారం రోజుల్లో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడేలా మంత్రులు కార్యాచరణ చేపట్టాలని, పాత..కొత్త నేతలను కలుపుకొని సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ కార్పొరేషన్లలో బీఆర్ఎస్‌తో కాకుండా బీజేపీతో కాంగ్రెస్ పోటీపడే పరిస్థితులు ఉన్నాయని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని, ఈ మూడు కార్పొరేషన్లలలో ఆ పార్టీని కట్టడి చేయడమే లక్ష్యంగా మంత్రు లు.. ఎమ్మెల్యేలను, డీసీసీ చీఫ్‌లను, పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ప్రచారం సాగించాలని సూచించారు. ఇలాంటి చోట కాంగ్రెస్ పరిస్థితిని ఏ రోజుకు ఆ రోజు నివేదిక రూపంలో తమ కు పంపించాలని మంత్రులను సీఎం ఆదేశించారు.
ఎక్కడైనా.. ఏదైనా..సమస్య ఉంటే పీసీసీ దృష్టికి, గాంధీ భవన్‌లోని వార్ రూం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రులను కోరారు. బుధవారం నుంచి తాను నిర్వ హించనున్న ప్రచార సభలపై కూడా సీఎం ఆరా తీశా రు. ఈ సభలతో కాంగ్రెస్ కు పూర్తి అనుకూల వాతావరణం ఏర్పడేలా స్థానిక నేతలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికలను ప్రతి నాయకుడు చాలెంజ్‌గా తీసుకోవాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఏ ఒక్క మున్సిపాలిటీని వదులుకోవద్దని, అన్ని కార్పొరేషన్లలో కాంగ్రెస్ గెలువాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. రెండేళ్ల పాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని, లోకల్ సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తామనే భరోసాను అక్కడి ఓటర్లకు ఇవ్వాలన్నారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి రోజు కావడంతో స్థానికంగానే ఉండాల్సి వచ్చిందని, అందుకే తాము ఈ సమావేశానికి రాలేకోపోయామని డిప్యూటీ సీఎం భట్టి, మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పీసీసీ చీఫ్‌కు సమాచారం అందించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
మున్సిపాలిటీలకు పీసీసీ పరిశీలకులు
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నేతలను సమన్వయం చేస్తూ వార్ రూంతో టచ్‌లో ఉండేందుకు ప్రతి కార్పొరేషన్, ప్రతి మున్సిపాలిటీకి పీసీసీ ఒక పరిశీ లకుడిని నియమించనుంది. మున్సిపాలిటీ ఎన్నికలు లేని నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, పీసీసీ ఆఫీసు బేరర్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లను ఒక్కో మున్సిపాలిటీకి పరిశీలకుడిగా నియమిస్తూ జాబితాను పీసీసీ సిద్ధం చేసింది.
కాంగ్రెస్‌కు పోటీ లేదు: మహేశ్ గౌడ్
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏ పార్టీ పోటీ కాదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సీఎంతో మంత్రుల భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 90 శాతం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మజ్లిస్‌తో ఎలాంటి పోత్తు లేదని.. సీపీఐ, సీపీఎం, టీజేఎస్ పార్టీలతో మాత్రం పొత్తు ఉందని క్లారిటీ ఇచ్చారు. జగిత్యాల నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వివాదంపై బుధవారం చర్చించి పరిష్కారిస్తామని చెప్పారు. గద్వాల సమస్య పరిష్కారం అయిందన్నారు. రాష్ట్రంలో ఒకటి, రెండు నియోజకవర్గాల్లో చిన్న, చిన్న సమస్యలు ఉన్నాయని.. మిగతా అన్ని నియోజకవర్గాల్లో పార్టీకి ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. 99 శాతం పార్టీ బీఫామ్‌లను పంపిణీ చేశామన్నారు.
