కారు గుర్తుకు ఓటేస్తే కమలానికి వేసినట్టేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. సీఎం మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ లో మైనార్టీలను మభ్యపెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు.
భారత్ పాదయాత్ర ద్వారా రాహుల్ గాంధీ దేశంలోని మైనార్టీలకు ఒక భరోసా ఇచ్చారని చెప్పారు.బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎనిమిది చోట్ల డిపాజిట్ రాలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవ దానం చేసిందని చెప్పారు. మోదీకి మద్దతు ఇస్తున్న కేసీఆర్ ప్రమాదకరమని, కారు గుర్తుకు ఓటేస్తే కమలానికి వేసినట్టేనని అన్నారు.
కాళేశ్వరం కేసు విచారణ కోసం సీబీఐకి అప్పగించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన లేదన్నారు రేవంత్ . ఫార్ములాఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఒప్పందం లేకపోతే ఎందుకు అనుమతి ఇవ్వరని అన్నారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ ఆఫీసుకు పిలిచి విచారణ చేశారని, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ను మాత్రం పిలవడం లేదని చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయ్యే పరిస్థితి ఉందని అన్నారు. గతంలో కవితనే ఈ విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసేందుకు జూబ్లీహిల్స్ ను ప్రయోగశాలగా చూస్తున్నారని అన్నారు.
