- హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడకండి: సీఎం రేవంత్‌రెడ్డి
- అభ్యంతరాలుంటే చెప్పండి.. పరిష్కరిస్తం
- ప్రతిపక్షాల సూచనల కోసం డిప్యూటీ సీఎం
- అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ వేస్తం
- సుందరీకరణకు కాదు.. నల్గొండ ప్రజల ప్రాణాలు కాపాడటానికే మూసీ ప్రక్షాళన
- సబర్మతి ప్రాజెక్టు స్ఫూర్తిని మూసీలోనూ చూపిద్దాం
- అవినీతికి ఆస్కారం లేకుండా స్మార్ట్ గవర్నెన్స్.. అన్నీ ఆన్‌లైన్
- ఎల్ అండ్ టీ నుంచి మెట్రో స్వాధీనం..
- రూ. 24 వేల కోట్లతో మెట్రో రెండో దశ
- దేశంలోనే తొలిసారి.. బేగంపేట రన్‌వే కింద అండర్ పాస్
- మండలిలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం
హైదరాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు రాజకీయ రంగు పులిమి, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవద్దని.. అభ్యంతరాలుంటే పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాధితుల పక్షాన నిలబడతామని, ప్రతిపక్షాల సూచనల కోసం డిప్యూటీ సీఎం, మంత్రులతో కూడిన ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీని వేస్తామని ప్రకటించారు. ఎల్అండ్‌టీ నుంచి మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని.. రూ.24 వేల కోట్లతో రెండో దశను విస్తరిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్ దిశగా అడుగులు వేస్తూ అన్నీ ఆన్‌లైన్ చేస్తున్నామని తెలిపారు. మూసీ పరీవాహక ప్రాంత పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లతో పాటు మెరుగైన పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత, ట్రాఫిక్ ఇబ్బందులు లేని విశ్వనగరాన్ని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సోమవారం శాసనమండలిలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా మెట్రో రైలు, రోడ్ల విస్తరణపై సమగ్రంగా వివరించారు. మూసీ నది ప్రక్షాళన కేవలం సుందరీకరణ కాదని.. నల్గొండ జిల్లా ప్రజల ప్రాణాలను కాపాడడానికేనని సీఎం స్పష్టం చేశారు. మూసీలో 20 టీఎంసీల గోదావరి జలాలను నింపి, మురుగునీటిని శుద్ధి చేసేందుకు భారీగా ఎస్టీపీలను ఏర్పాటు చేస్తామన్నారు.
మూసీ పరీవాహక ప్రాంతంలోని 50 మీటర్ల బఫర్ జోన్ నిబంధన గత ప్రభుత్వమే తెచ్చిందని, తాము కేవలం దాన్ని అమలు చేస్తూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు రాజకీయాల కోసం మూసీకి వ్యతిరేకంగా ప్రజలను ఉసిగొల్పవద్దని, బాధితులకు అండగా ఉండే బాధ్యత తనదని ప్రకటించారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించి నగర మధ్యభాగం నుంచి రవాణా సులభం చేస్తామన్నారు. మూసీ పునరుజ్జీవం ద్వారా హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చడమే తన లక్ష్యమన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత..
నగరాభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు రాజకీయ కక్షలను పక్కనపెట్టి.. నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అహ్మదాబాద్‌లో సబర్మతి ప్రాజెక్టును కాంగ్రెస్ మేయర్, అప్పటి సీఎం నరేంద్ర మోదీ కలిసి ప్రారంభించారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో మూసీ ప్రక్షాళనకు అందరూ సహకరించాలని, తమ ప్రభుత్వం ఓపెన్ మైండ్‌తో ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుల సూచనల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో కూడిన కేబినెట్ సబ్ కమిటీని వేస్తామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టులను అడ్డుకుంటే నగర భవిష్యత్తుకు తీరని నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల నిర్మాణం ద్వారా రాబోయే తరాలకు అద్భుతమైన నగరాన్ని అందించాలన్నదే తన తపనని చెప్పారు. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని, అభివృద్ధిలో మాత్రం తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లోనే క్లియరెన్స్ వచ్చేలా పారదర్శక వ్యవస్థను రూపుదిద్దుతున్నామని వివరించారు. వాహనాల రిజిస్ట్రేషన్లను షోరూమ్‌లోనే చేసుకునే సౌకర్యాన్ని కల్పించామని, డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ వంటి సేవలను ఆన్‌లైన్ చేశామన్నారు. ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే అవసరం లేకుండా సిటిజన్ చార్టర్ అమలు చేస్తున్నట్టు చెప్పారు. అవినీతిని తగ్గించేందుకు అన్ని మున్సిపల్ సేవలను డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీదికి తెస్తున్నామని వివరించారు. డేటా సెంటర్ల అవసరాల కోసం గ్రే వాటర్ (శుద్ధి చేసిన నీరు) సరఫరా చేసేందుకు ప్రత్యేక పైపులైన్లను నిర్మిస్తామన్నారు. ఐటీ ఉద్యోగులు, విద్యార్థుల ప్రయాణ కష్టాలు తీర్చేందుకు ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
జూబ్లీహిల్స్ రోడ్ నం.45 నుంచి
నాలెడ్జ్ పార్క్‌కు మరో ఫ్లైఓవర్
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్‌లను నివారిం చేందుకు కేంద్రంతో చర్చించి రక్షణ శాఖ భూములను సేక రించినట్టు సీఎం తెలిపారు. కంటోన్మెంట్ పరి ధిలో 153 ఎకరాల భూమిని రోడ్ల విస్తరణ కోసం తీసు కోవడం ఒక విజయమని, దీంతో ఉత్తర తెలంగాణ ప్రయాణికుల కష్టాలు తీరుతాయని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా బేగంపేట ఎయిర్పోర్ట్ రన్‌వే కింద అండర్ పాస్ నిర్మిస్తున్నామని, దీనికి ఎయిర్పోర్ట్ అథారిటీ అనుమతి కూడా లభించిందని వెల్లడించారు. నల్గొండ చౌరస్తా వంటి బాటిల్ నెక్ ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లను జూన్ నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.45 నుంచి నేరుగా రాయదుర్గం నాలెడ్జ్ పార్క్ వరకు మరో ఫ్లైఓవర్ ప్రతిపాదనలో ఉందన్నారు. కేబీఆర్ పార్క్ వద్ద 20 అంతస్తుల ఆటోమేటెడ్ మల్టీలెవల్ పార్కింగ్‌ను అందుబాటులోకి తెచ్చామని, మరిన్ని చోట్ల ఇలాంటివి ఏర్పాటు చేస్తామన్నారు. పాదచారుల రక్షణ కోసం ఫుట్‌పాత్ ఆక్రమణలను కఠినంగా తొలగిస్తామని సీఎం స్పష్టం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనరేట్లను ఏర్పాటు చేసినట్టు సీఎం తెలిపారు. గతంలో ఒకే ప్రాంతంలో గ్రామ పంచాయతీ, మున్సి పాలిటీ, కార్పొరేషన్ ఉండటం వల్ల ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగలేదన్నారు. దీంతో చెరువులు, కుంటలు కబ్జాకు గురవుతున్నాయని, రోడ్ల వెడల్పులో అసమానతలు వస్తున్నాయని వివరించారు. ఇకపై పోలీసు కమిషనరేట్ పరిధికి తగ్గట్టుగానే మున్సిపల్ జోనల్ వ్యవస్థ ఉంటుందని, దీనివల్ల అధికారులు సమన్వయంతో పనిచేస్తారని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో ‘ఫ్యూచర్ సిటీ’ కోసం ప్రత్యేక పోలీస్ కమిషనరేట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలను ఎస్పీ స్థాయి పరిపాలన కిందికి తెచ్చి శాంతిభద్రతలను పటిష్టం చేస్తున్నామన్నారు. ఈ వికేంద్రీకరణ వల్ల ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని, అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు.
మూడు జోన్లుగా స్టేట్ డెవలప్మెంట్
రాష్ట్రాన్ని మూడు ఆర్థిక జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి సభలో వివరించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 2,073 చదరపు కిలో మీటర్ల కోర్ అర్బన్ రీజియన్(క్యూర్)ను కేవలం సర్వీస్ సెక్టార్‌కే పరిమితం చేస్తామన్నారు. ఇక్కడ ఉన్న రెడ్, ఆరెంజ్ కేటగిరీ కాలుష్య పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలికి తరలిస్తామన్నారు. దీని కోసం ‘హిల్ట్ పాలసీ’ని తెచ్చామని, పరిశ్రమలు ఖాళీ చేసిన 9 వేల ఎకరాల భూమిని మధ్యతరగతి గృహ నిర్మాణాలకు, పార్కులకు ఉపయోగిస్తామని తెలిపారు. రెండో జోన్‌గా ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారుస్తామన్నారు. రీజినల్ రింగ్ రోడ్ వెలుపల ఉన్న ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో వ్యవసాయాధారిత పరిశ్రమలకు కేటాయించనున్నట్టు వెల్లడించారు. ఇలా శాస్త్రీయంగా నగరాన్ని విస్తరించడం ద్వారా భవిష్యత్తులో ఢిల్లీ లాంటి కాలుష్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతున్నామని సీఎం వివరించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకుంటే నగర భవిష్యత్తుకు తీరని నష్టం. ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల నిర్మాణం ద్వారా రాబోయే తరాలకు అద్భుతమైన నగరాన్ని అందించాలన్నదే మా ప్రభుత్వ తపన. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి. ఆ తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కావాలి.
- సీఎం రేవంత్‌రెడ్డి
