కేసీఆర్.. దళితుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్.. దళితుడికి  ప్రతిపక్ష హోదా ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి

 

  • కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీశ్ చెప్పడంలో అర్థం లేదు
  • ఆ స్థానంలో బిల్లా అయితే ఏంది.. రంగా అయితేంది?
  • వాళ్ల కుటుంబంలో ఎవరి నాయకత్వం అయితే తేడా ఏంటి
  • దళితుడిని సీఎం చేయలేదు.. పార్టీ అధ్యక్షుడినైనా చేయండి
  •  రసమయి, కొప్పుల ఇంకెవరిపేరైనా హరీశ్ చెప్తే బాగుండేది
  • చిట్ చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి


హైదరాబాద్: దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పిన కేసీఆర్.. పదేండ్లు ఆ పనిచేయలేదని, కనీసం దళితుడిని  ప్రతిపక్ష నేతగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం మీడియాతో చిట్  చాట్ లో మాట్లాడుతూ..మాజీ మంత్రి హరీశ్ రావు కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని  చెప్పడంలో అర్థం లేదని అన్నారు. ఆ స్థానంలో బిల్లా అయితే ఏంటి..? రంగా అయితే ఏంటి..? అని అన్నారు. వాళ్ల కుటుంబంలో ఎవరి నాయకత్వం అయితే ఏమిటని సీఎం  ప్రశ్నించారు. 

హరీశ్ రావు కనీసం కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్ ఇంకా ఎవరి నాయకత్వంలోనైనా పనిచేస్తానని చెప్పి ఉంటే బాగుండేదని అన్నారు. అధికారంలో ఉండగా దళితుడికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వలేదని, ఇప్పుడైనా పార్టీ అధ్యక్షుడిని దళితుడిని చేస్తే బాగుంటుందని అన్నారు. నాయకత్వం అప్పగించడంతోపాటు విధేయంగా ఉండాలని అన్నారు.  ఏఐసీసీ అధ్యక్షుడిగా దళిత వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేను తాము గాంధీ కుటుంబంతో సమానంగా గౌరవిస్తామని సీఎం చెప్పారు.