42 శాతం బీసీ రిజర్వేషన్లకు మోదీనే అడ్డంకి: సీఎం రేవంత్

42 శాతం బీసీ రిజర్వేషన్లకు మోదీనే అడ్డంకి: సీఎం రేవంత్
  • తెలంగాణ ప్రజ‌ల శ‌క్తిని తక్కువగా అంచనా వేయొద్దు
  • బీసీ బిల్లులను ఆమోదించకపోతే గద్దె దింపుతాం: సీఎం రేవంత్​రెడ్డి
  • బీసీ రిజర్వేషన్ల పెంపు మోదీకి ఏమాత్రం ఇష్టం లేదు
  • కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్‌, రాంచంద‌ర్‌రావుకు తెలంగాణలో బీసీల ఓట్లు అక్కర్లేదా?
  • ఇప్పుడు ఢిల్లీకి వచ్చి డిమాండ్​ చేస్తున్నం.. వినకపోతే గల్లీలో పట్టుకుంటం
  • లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా రానివ్వం
  • వందేండ్లలో కులగ‌ణ‌న చేసిన ప్రభుత్వం ఏదీ లేదు
  • మాకు ఆ చాన్స్​ దక్కితే మోదీ కడుపు మండుతున్నది
  • బీసీలపై కక్ష గట్టి కేసీఆర్​ చట్టం తెచ్చిండు.. అది రిజర్వేషన్లకు గుదిబండ
  • దాన్ని మార్చేందుకు ఆర్డినెన్స్​ తెస్తే దాన్నీ ఆమోదిస్తలేరు
  • బీసీలకు న్యాయం కోసం రాహుల్​గాంధీ పోరాడ్తున్నరు
  • ఆయన మ‌హ‌త్తర ఆశయాల‌కు ఎవరు అడ్డుపడ్డా వాళ్ల అడ్రస్​ గ‌ల్లంతేనని వ్యాఖ్య
  • జంతర్​ మంతర్  వద్ద ‘బీసీ రిజర్వేషన్ల సాధన పోరుబాట’ ధర్నాలో ప్రసంగం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్లకు ప్రధాని మోదీనే అడ్డంకి అని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. బీసీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా మోదీ అడ్డుపడ్తున్నారని ఆయన ఆరోపించారు. ‘‘బిల్లులపై రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ అడిగి చాలా రోజులైంది. ఇప్పటివ‌ర‌కు దీనిపై ఎలాంటి స‌మాధానం రాలేదు. గురువారంలోగా అపాయింట్‌మెంట్ ఇచ్చి, స‌మ‌స్యను విని ప‌రిష్కారిస్తార‌ని ఆశిస్తున్నాం. న‌రేంద్ర మోదీ తాజాగా రాష్ట్రప‌తిని క‌లిశారు. బీసీ బిల్లులపై అయిపాంట్‌మెంట్ ఇవ్వొద్దని రాష్ట్రపతిపై ఏమైనా ఒత్తిడి చేశారు కావొచ్చు.. బ‌ల‌హీన వ‌ర్గాల‌న్నీ ఆలోచ‌న చేయాలి’’ అని తెలిపారు. బీసీ రిజ‌ర్వేష‌న్ల సాధనలో తెలంగాణ ప్రజ‌ల శ‌క్తిని తక్కువగా అంచనా వేయొద్దని, బిల్లులకు ఆమోదం తెలుపకపోతే ప్రధాని మోదీకి తెలంగాణ త‌డాఖా చూపిస్తామ‌ని సీఎం రేవంత్​ హెచ్చరించారు. ‘‘బీసీ రిజ‌ర్వేష‌న్లను ఆమోదిస్తారా? గద్దె దిగుతారా?” అని మోదీని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతామని ఆయన ప్రకటించారు. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ‘బీసీ రిజర్వేషన్ల సాధన పోరుబాట’ పేరిట ధర్నా నిర్వహించింది. ఇందులో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నరేంద్ర మోదీకి జంతర్​ మంతర్ చౌరస్తా నుంచి సవాల్ విసురుతున్నా.. మా డిమాండ్ ఆమోదిస్తారా? లేదంటే మిమ్మల్ని గద్దెదించి, ఎర్రకోట మీద మూడు రంగుల జెండా ఎగరేసి, రాహుల్​ను ప్రధానిని చేసి, 42శాతం బీసీ రిజర్వేషన్లు సాధించుకోమంటరా? ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు వదలబోం’’ అని అన్నారు.

బలహీనవర్గాలకు న్యాయం చేయాలన్న ఆలోచన నరేంద్ర మోదీకి లేదని సీఎం రేవంత్​ రెడ్డి విమర్శించారు. ‘‘మోదీ మోచేతి నీళ్లు తాగుతున్న కిషన్​రెడ్డి, బండి సంజయ్, రాంచందర్​రావుకు  ఏమైంది? మీరు మళ్లీ తెలంగాణకు రారా? తెలంగాణ ఓట్లు మీకు అవసరం లేదా? బీఆర్ఎస్​ తెంపుకున్నట్లే తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మీ పేగు బంధం తెంపుకున్నారా? ’’ అని ప్రశ్నిం చారు.  ‘‘అయ్యా.. నరేంద్రమోదీ! మీ గుజరాత్ నుంచి గుంట భూమి అడగలే. మీ పోరుబందర్ పోర్ట్ నుంచి గుక్కెడు నీళ్లడగలే.. మా తెలంగాణలో మా గడ్డ మీద బలహీనవర్గాలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చుకుంటామంటే మీకు వచ్చిన కడుపు మంట ఏంటి? రిజర్వేషన్ల కోసం బిల్లులు ఆమోదించాలని మేం 4.5 కోట్ల మందిమి విజ్ఞప్తి చేస్తే మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకెవ్వరిచ్చారు?” అని నిలదీశారు. ‘‘మన పోరాటం.. చంద్రశేఖర్​రావుతోనో, కిషన్​రెడ్డితోనో, బండి సంజయ్​తోనో, రాంచందర్​రావుతోనో కాదు.. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీతో..’’ అని  ఆయన అన్నారు. బీసీల‌కు స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్లు సాధించి తీరుతామ‌ని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన బీసీ రిజ‌ర్వేషన్ల బిల్లులను కేంద్ర ప్రభు త్వం ఆమోదించ‌కుండా కావాలని ఆపుతున్నదని మండిపడ్డారు. 

వాజ్​పేయి చెప్పినా మోదీ వినలే

గోద్రా అల్లర్ల స‌మ‌యంలో రాజీనామా చేయాలని న‌రేంద్ర మోదీని నాటి ప్రధాన‌మంత్రి వాజ్‌పేయీ కోరితే చేయ‌లేద‌ని, ఇప్పుడు 75 ఏండ్లు నిండినందున ప‌ద‌వి నుంచి వైదొల‌గాల‌ని ఆర్ఎస్ఎస్  సంఘ్ చాల‌క్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ కోరుతున్నా మోదీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ‘‘న‌రేంద్ర మోదీ లేక‌పోతే 150 సీట్లు కూడా బీజేపీకి రావ‌ని మోదీ భ‌క్తుడు నిశికాంత్ దూబే అంటున్నడు. ఈసారి బీజేపీకి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ 150 సీట్లు కూడా రానివ్వం. బీసీ రిజ‌ర్వేష‌న్లను మోదీ అడ్డుకుంటే ఆయ‌న‌ను గ‌ద్దె దించుతాం” అని ఆయన తెలిపారు.  42 శాతం బీసీ రిజ‌ర్వేష‌న్ల సాధ‌న‌ కోసం తెలంగాణ‌లోనైనా ధ‌ర్నా చేయొచ్చు  కానీ అక్కడ ధ‌ర్నా చేస్తే స్థానిక పార్టీలు మాత్రమే వ‌స్తాయ‌ని,  అందుకే ఢిల్లీలో ధ‌ర్నా చేస్తున్నామ‌ని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ఢిల్లీలోధ‌ర్నా చేయ‌డంతోనే కాంగ్రెస్‌కు చెందిన ప‌లువురు ఎంపీల‌తో పాటు ఇండియా కూట‌మిలోని స‌మాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ, వామ‌ప‌క్షాల‌కు చెందిన ఎంపీలు ధ‌ర్నాలో పాల్గొని సంఘీభావం తెలియ‌జేశారని  చెప్పారు. ‘‘బీసీ రిజ‌ర్వేష‌న్ల సాధ‌న‌కు అండ‌గా ఉంటామ‌ని యూపీ, బిహార్‌, మ‌హారాష్ట్ర, రాజ‌స్తాన్‌, కేర‌ళ రాష్ట్రాల‌కు చెందిన ఎంపీలు మ‌ద్దతు ఇచ్చారు. తెలంగాణ‌లో అధికారంలోకి వస్తే కులగ‌ణ‌న చేప‌డ‌తామ‌ని భార‌త్ జోడో యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఏడాదికాలంలోనే కుల గ‌ణ‌న చేప‌ట్టి, బీసీ రిజ‌ర్వేష‌న్ల బిల్లుల‌ను శాస‌న‌స‌భ‌లో ఆమోదించుకున్నం. దేశంలో వందేండ్ల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కులగ‌ణ‌న చేయ‌లేదు.. ఇప్పటి వ‌ర‌కు దేశంలో 300 మంది సీఎంలు అయినా.. ఎవ‌రూ చేయ‌ని ప‌నిని చేసే అదృష్టం మాకు దక్కింది. ఆ అవకాశం మాకు దక్కిందని మోదీకి మంట’’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల రిజ‌ర్వేష‌న్లు పెంచే అవ‌కాశం కూడా త‌న‌కు లభించిందని తెలిపారు. 

బీసీలపై కేసీఆర్​ కక్ష 

‘‘బ‌ల‌హీన వ‌ర్గాల‌పై క‌క్ష గ‌ట్టిన గ‌త సీఎం కేసీఆర్ మొత్తం రిజర్వేషన్లు 50% మించ‌కుండా చ‌ట్టం చేసిండు. నాడు కేసీఆర్ చేసిన చ‌ట్టం నేడు రిజ‌ర్వేష‌న్లకు గుదిబండ‌గా మారింది. తెలంగాణ‌లో బ‌ల‌హీన వ‌ర్గాల బిడ్డలు స‌ర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిల‌ర్లు, కార్పొరేట‌ర్లు, మేయ‌ర్లు కాకుండా అడ్డుగా ఉన్న ఆ చ‌ట్టాన్ని తొల‌గించాల‌ని మేం ఆర్డినెన్స్ చేసి గ‌వ‌ర్నర్‌కు పంపినం. దాన్నీ  ఆమోదించ‌డం లేదు” అని సీఎం రేవంత్​ అన్నారు. బీసీలకు  స్థానిక ఎన్నిక‌ల్లో, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్లు సాధించేందుకు ఢిల్లీలో ధ‌ర్నాకు దిగామని.. కేంద్ర ప్రభుత్వం మెడ‌లు వంచైనా సాధించి తీరుతామని చెప్పారు. 

డ్రామాల్లో కేసీఆర్​ కుటుంబం

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌, కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్, రాంచంద‌ర్‌రావు బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపుకు అడ్డుప‌డుతున్నార‌ని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘వీళ్లకు తెలంగాణలోని బీసీలు అవసరం లేదా?” అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయ‌కులు బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపు ధ‌ర్నాకు ఎందుకు రాలేద‌ని, ఆ పార్టీ తెలంగాణ‌తో పేరు బంధంతో పాటు పేగు బంధం కూడా తెంచుకుందా? అని నిలదీశారు. ‘‘బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపు  కోసం చేస్తున్న ధ‌ర్నాను కేటీఆర్ డ్రామా అంటున్నడు. కేటీఆర్ పేరే డ్రామారావు. కేసీఆర్ కుటుంబం డ్రామాల‌తో బ‌తుకుతున్నది. అధికారం, ప‌ద‌వులు పోయినా కేటీఆర్ బుద్ధి మార‌లేదు.. ఆయన అహంకారం త‌గ్గలేదు. ఆ కుటుంబంలోనే ఒక‌రు రిజ‌ర్వేష‌న్లకు అనుకూల‌ంగా.. మ‌రొక‌రు ప్రతికూల‌ంగా... ఇంకొకరు  అటూ ఇటూ కాకుండా మాట్లాడుతున్నరు” అని ఫైర్​ అయ్యారు. 

బీజేపీ చెప్పేదొకటి.. చేసేదొకటి.. 

బీజేపీ చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని సీఎం రేవంత్​రెడ్డి విమర్శించారు. ధర్నా సందర్భంగా ఆయన ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో చేప‌ట్టబోయే జ‌నగ‌ణ‌న విష‌యంలో మోదీ హామీని న‌మ్మలేం. అందుకోసం లోక‌స‌భ‌, రాజ్యస‌భ‌లో చ‌ర్చ జ‌ర‌గాలి. ఎడ్యుకేష‌న్‌, ఎంప్లాయిమెంట్​తోపాటు పంచాయ‌తీ మెంబ‌ర్ల నుంచి పార్లమెంట్  మెంబర్ల వ‌ర‌కు రిజర్వేషన్లలో ఎవ‌రికీ ఎంత వాటా ద‌క్కాల‌న్న విష‌యంపై పార్లమెంట్‌లో చ‌ర్చ జ‌రగాల్సిందే” అని అన్నారు. అలా జ‌ర‌గ‌కుండా బీజేపీ, ఎన్డీయే మోసం చేస్తున్నదని మండిపడ్డారు. పార్లమెంట్‌లో కూడా ఏఐసీసీ చీఫ్​ మ‌ల్లికార్జున ఖ‌ర్గే, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ధ‌ర్నాలు చేప‌ట్టి రిజ‌ర్వేష‌న్లు సాధిస్తామన్నారు. 

మిమ్మల్ని గల్లీలో పట్టుకుంటం

రిజ‌ర్వేష‌న్ల పెంపు బిల్లుల‌ను ఆమోదించ‌కుంటే ఇక ఢిల్లీ రాబోమని, గ‌ల్లీకి వ‌చ్చిన‌ప్పుడు బీజేపీ నేత‌ల‌ను ప‌ట్టుకుంటామ‌ని సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరించారు. ‘‘ద‌ళితులు, గిరిజ‌నుల‌కు అండ‌గా నిలిచి దేశ ప్రజ‌ల గుండెల్లో ఇందిరమ్మగా ఇందిరాగాంధీ నిలిచిపోయారు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఐటీ విప్లవంతో చాలామంది విదేశాల్లో ఉన్నతస్థాయిల్లో స్థిర‌ప‌డ్డారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వార‌సుడిగా వ‌చ్చిన రాహుల్ గాంధీ బీసీల‌కు న్యాయం చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్నారు. ఆయ‌న మ‌హ‌త్తర ఆశ‌యాల‌కు ఎవరు అడ్డుత‌గిలినా వాళ్ల చిరునామా గ‌ల్లంత‌వుతుంది” అని హెచ్చరించారు.

 ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లులు వెంటనే ఆమోదం పొందేలా చూడాల‌ని.. లేకుంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజ‌లు బీజేపీకి, మోదీకి గుణ‌పాఠం చెప్తారని సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరించారు. ధ‌ర్నాలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాక‌ర్‌, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వివేక్​ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వర్​రావు, దామోద‌ర రాజ‌న‌ర్సింహ, శ్రీ‌ధ‌ర్ బాబు, జూప‌ల్లి కృష్ణారావు, కొండా సురేఖ‌, సీతక్క, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, అడ్లూరి ల‌క్ష్మణ్, వాకిటి శ్రీ‌హ‌రి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పీసీసీ చీఫ్​ మ‌హేశ్ గౌడ్‌, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవ‌హారాల ఇన్‌చార్జ్​ మీనాక్షి న‌ట‌రాజ‌న్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేష‌న్ల చైర్​పర్సన్లు, బీసీ సంఘాల నాయ‌కులు, పెద్ద సంఖ్యలో కార్యక‌ర్తలు పాల్గొన్నారు.