- మీరు అండగా ఉంటే.. ఢిల్లీనైనా ఢీకొడ్త..
- కేంద్రంతో కొట్లాడి నిధులు తెస్త: సీఎం రేవంత్ రెడ్డి
- రాష్ట్రాభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా
- ప్రధాని, కేంద్రమంత్రుల దగ్గరికి వందసార్లయినా వెళ్త
- జూబ్లీహిల్స్ బైపోల్‌లో జనం బండకేసి కొట్టినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలే
- కేటీఆర్ మళ్లీ రోడ్ల మీద కొచ్చి అబద్ధాలు చెప్తున్నడు
- పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటోళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలి
- త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తం
- మార్చి 31లోగా వరంగల్ ఎయిర్‌పోర్టు, ఔటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడతామని వెల్లడి
- నర్సంపేట ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం ప్రసంగం
వరంగల్/నర్సంపేట, వెలుగు:
జనం తనకు అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీకొడ్తానని, కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకొస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘మీరు (ప్రజలు) అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీకొడ్త.. నిధులు అడగడానికి వెనుకాడను. నిధులివ్వకుంటే కొట్లాడడానికి అస్సలు భయపడను. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతుల కోసం ప్రధాని, కేంద్రమంత్రుల దగ్గరికి వందసార్లయినా వెళ్తా. నాకు తిరిగే ఓపిక, వయసు ఉంది. విషయాన్ని వివరించే పరిజ్ఞానం ఉంది.
రాష్ట్రం కోసం ఎవరినైనా కలుస్తా.. ఎవరితోనైనా కొట్లాడ్త” అని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా శుక్రవారం వరంగల్జిల్లా నర్సంపేటలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ వద్ద రూ.532.24 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
నెహ్రూ ఆలోచనల మేరకు ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్‍పై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 8,9 తేదీల్లో ప్రపంచస్థాయిలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నిర్వహించనున్నట్టు చెప్పారు.
కోటి మంది ఆడబిడ్డలకు చీరలు..
రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు చీరలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘మొదటి విడతలో 45 లక్షల మందికి చీరలు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్అమల్లోకి వచ్చింది. కోడ్ ముగియగానే మిగిలినోళ్లకు చీరలు పంపిణీ చేస్తం. ఇక పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మందికి మార్చిలో చీరలు అందిస్తాం” అని చెప్పారు. ‘‘కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పని చేస్తున్నది. మహిళలను ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేశాం. వాళ్లకు పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్లు కేటాయిస్తున్నం. హైదరాబాద్ శిల్పారామం వద్ద ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశాం” అని పేర్కొన్నారు.
ప్రభుత్వంతో మంచిగున్నోళ్లనే సర్పంచ్ చేయాలె..
ప్రభుత్వంతో మంచిగా ఉండేటోళ్లనే సర్పంచ్‌గా ఎన్నుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అన్నిటికీ లొల్లులు పెట్టేవాళ్లతో అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. ‘‘మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసిపోయేవాళ్లయితే ప్రభుత్వ పథకాలు అందుతాయి. గొడవలు పెట్టుకునేవాళ్లు సర్పంచ్ అయితే ఊర్లు ఆగమవుతాయి. ఎన్నికల్లో పోటీ చేసేటోళ్లు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఊరి సమస్యలపై ఫోకస్ చేయాలి” అని సూచించారు.
‘‘బీఆర్‍ఎస్‌కు 2023లో అధికారం పోయింది. 2024లో జనం గుండు సున్నా ఇచ్చిన్రు. జూబ్లీహిల్స్ఉప ఎన్నికలో రెఫరెండమని మాట్లాడితే.. బండకేసి కొట్టిన్రు. అలాంటప్పుడు కేటీఆర్కనీసం ఒక్కనెలయినా ఇంట్ల ఉండాలే కదా.. కానీ మళ్లీ రోడ్ల మీదకొచ్చి అబద్ధాలు చెప్తున్నడు. అలాంటోళ్లకు సర్పంచ్ ఎన్నికల్లో సలకా కాల్చి వాత పెట్టాలి” అని అన్నారు. హైదరాబాద్‍తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని.. మార్చి 31 నాటికి మామునూర్ ఎయిర్‍పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగురోడ్డు పనులు చేపడతామని చెప్పారు. జనవరిలో జరిగే మేడారం సమ్మక్క, సారక్క దర్శనానికి జిల్లాకు మరోసారి వస్తానని తెలిపారు.
ఉచిత కరెంట్ మీద పేటెంట్ మాదే..
వరి వేస్తే ఉరేనని రైతులను గతంలో కేసీఆర్ బెదిరించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని లాభసాటి చేశామని పేర్కొన్నారు. ‘‘వడ్ల దిగుబడిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా ఉంది. సన్న వడ్లు పండించే రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు బంద్ అవుతుందని, కరెంట్ ఉండదని తప్పుడు ప్రచారం చేశారు. కానీ తెలంగాణను దోసుకున్నోళ్లకు మాత్రమే కరెంట్ పోయింది. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అమలు చేసిన క్రెడిట్ మాదే. ఉచిత కరెంట్స్కీమ్పై 2004లో వైఎస్ రాజశేఖర్‍రెడ్డి మొదటి సంతకం చేశారు. ఉచిత కరెంట్ మీద పేటెంట్ కాంగ్రెస్‌దే.
బీఆర్‍ఎస్ హయాంలో రైతుబంధు ఏడాదికి రూ.10 వేలిస్తే.. మేం రూ.12 వేల చొప్పున రైతు భరోసా ఇస్తున్నం. 25.35 లక్షల మందికి రూ.2 లక్షల చొప్పున రూ.20 వేల కోట్లు రుణమాఫీ చేశాం. పేదలు రేషన్ కార్డ్ అడిగితే కేసీఆర్ కుటుంబం తమ ఫామ్‍హౌస్ రాసిచ్చినట్టు ఫీలైంది. మేం పేదలందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం. ఏటా రూ.13 వేల కోట్ల ఖర్చుతో 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం ఇస్తున్నం. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నం” అని తెలిపారు.
మాది చేతల ప్రభుత్వం: పొంగులేటి
పేదలకు ఇండ్లు కడితే కమీషన్ రాదనే, ఆనాడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అభివృద్ధి మాటున అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా సీఎం రేవంత్‍రెడ్డి మంచి పనులు చేస్తుంటే.. ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయని మండిపడ్డారు. బీఆర్‍ఎస్ మాదిరి తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు.
చదువుతోనే మంచి భవిష్యత్తు
ఉన్నత చదువులు చదివితేనే మంచి భవిష్యత్తు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘గొల్లోళ్లు గొర్లు కాయాలని, బెస్తోళ్లు చేపలు పట్టాలని గతంలో కేసీఆర్ చెప్పారు. కానీ, నేను అలా చెప్పను. పిల్లలు బాగా చదివి డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు కావాలి. అందుకు కావాల్సిన సౌలతులు మేము కల్పి స్తం. తల్లిదండ్రులు భూములు, ఆస్తులు ఇస్తారని ఎదురుచూడకుండా.. పిల్లలు ఉన్నత చదువులు చదు వుకోవాలి. ఏండ్లుగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నోళ్లు సర్పంచ్, వార్డు మెంబర్ కోసమని బరిలోకి దిగి సమయం వృథా చేసుకోవద్దు. మరింత శ్రమించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి. రాజకీయా లకు దూరంగా ఉండాలి” అని సూచించారు. తాము అధికారంలోకి వచ్చాక 61,370 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.
