ప్రకృతి వైపరిత్యాలను తట్టుకునేలా మేడారంలో రాతికట్టడాలు: సీఎం రేవంత్

ప్రకృతి వైపరిత్యాలను తట్టుకునేలా మేడారంలో రాతికట్టడాలు: సీఎం రేవంత్

ప్రకృతి వైపరిత్యాలను తట్టుకునేలా మేడారంలో  రాతికట్టడాలు నిర్మిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  రాతితో నిర్మిస్తే వందల ఏళ్లయినా తట్టుకునే ఉంటాయన్నారు. మేడారం ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ఆలయ అభివృద్ది పనులు వందరోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధిలో భాగస్వాములయిన వారి  జన్మ ధన్యమవుతుందన్నారు రేవంత్.  ఇలాంటి అవకాశం ఈ జన్మకు దక్కిన వరం లాంటిదన్నారు. 

 మేడారం అభివృద్దిలో గిరిజనులను భాగస్వాములను చేస్తామన్న సీఎం..  వంద రోజుల్లో పనులు పూర్తయ్యేలా టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. నిధుల విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.  ఎన్ని కోట్లైనా వెచ్చిస్తాం.. సమ్మక్క సారక్క గద్దెలను పునః నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. మేడారం అభివృద్ది  పనులను ప్రతి వారం మంత్రి పొంగులేటి సమీక్షిస్తారని చెప్పారు రేవంత్.  జంపన్న వాగును అభివృద్ది చేస్తామన్నారు.  గిరిజనులు సంప్రదాయాలను కాపాడుతామని తెలిపారు . 

ALSO READ : మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించి నిధులివ్వాలి..

ఆదాయం ఆశించి కాదు భక్తితో పనిచేయాలని సూచించారు రేవంత్.  ఆదివాసీ పోరాట చరిత్రను, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేలా పనిచేయాలన్నారు.  జంపన్న వాగులో నీటి నిల్వ ఉండేలా సాగునీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.  అవసరమైనచోట చెక్ డ్యామ్ లు నిర్మించాలన్నారు.  రాబోయే వంద రోజులు సమ్మక్క సారలమ్మ మాలధారణ చేసినట్లుగా నిష్ఠతో పనిచేయాలన్నారు.  నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. పనులు పూర్తి చేయించుకునే బాధ్యత మీపైనే ఉందన్నారు.  ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ టీమ్ ఏర్పాటు చేయాలన్నారు.