- తెలంగాణను మరో పంజాబ్ కానివ్వం
- డ్రగ్స్, సైబర్ నేరాలను ఉక్కుపాదంతో అణచివేస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- యూత్‌ను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే
- యువత ప్లే గ్రౌండ్లు వీడి పబ్‌లు, డ్రగ్స్ కల్చర్ వైపు వెళ్తోంది
- హైదరాబాద్ ఫుట్‌బాల్‌కు పాత వైభవాన్ని తీసుకొస్తం
- దక్షిణ కొరియా స్ఫూర్తితో ‘యంగ్ ఇండియా’ స్పోర్ట్స్ వర్సిటీ
- పోలీస్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో సీఎం
హైదరాబాద్, వెలుగు: దేశంలో యువతను డ్రగ్స్ మహమ్మారి పట్టిపీడిస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశాభివృద్ధిలో భాగం కావాల్సిన యువత స్ఫూర్తినిచ్చే క్రీడా మైదానాలను వదిలి పబ్, డ్రగ్ కల్చర్‌లోకి వెళ్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడల ద్వారానే యువతను డ్రగ్స్, పబ్ సంస్కృతి నుంచి దూరం చేస్తామని స్పష్టం చేశారు. భారత ఫుట్‌బాల్ చరిత్రలో ‘నర్సరీ’గా పేరొందిన హైదరాబాద్ పాత వైభవాన్ని తిరిగి తీసుకువస్తామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 74వ బీఎన్ ముల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ చాంపియన్ షిప్ టోర్నమెంట్2026 ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీఐఎస్‌ఎఫ్, గోవా జట్ల మధ్య జరిగిన ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో గోవా టీం తరఫున ఆడిన ఆయన వరుసగా మూడు గోల్స్ కొట్టి గోవా జట్టును గెలిపించారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలీసు ఫుట్‌బాల్ జట్టుకు కూడా దేశంలో సాటిలేని గుర్తింపు ఉందని కొనియాడారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను తీర్చిదిద్దిన స్పై మాస్టర్ బీఎన్ మల్లిక్ స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో 34 జట్లు అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించడంపై అభినందించారు. దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన యువతను డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని సీఎం రేవంత్ సూచించారు. ఒకప్పుడు వీరుల భూమి అయిన పంజాబ్‌లో ఇప్పుడు డ్రగ్స్ కల్చర్ పెరిగిందని, పంజాబ్‌లా మరే రాష్ట్రం కావొద్దన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు.
దేశం పేరును యువతే నిలబెట్టాలి
నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న దక్షిణ కొరియా ఒలంపిక్స్‌లో 30కి పైగా పతకాలు సాధించిందని,140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశం నుంచి ఒక్క పతకం రాకపోవడం బాధాకరమని సీఎం రేవంత్ అన్నారు. ‘‘అంతర్జాతీయ స్థాయిలో దేశం పేరునిలబెట్టేలా క్రీడాకారులను తయారు చేసేందుకు తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీలో పుల్లెల గోపీచంద్, కపిల్‌దేవ్ సహా ఎంతో మంది గొప్ప క్రీడాకారులు బోర్డ్ సభ్యులుగా ఉన్నారు. గచ్చిబౌలి స్టేడియం వేదికగానే స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాం. బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగంతో పాటు రూ.2 కోట్ల నగదు పురస్కారం ఇచ్చాం. సిరాజుద్దీన్ 12 ఫెయిల్ అయినా.. రూల్స్ పక్కన పెట్టి అతడిని డీఎస్పీని చేశాం. చదువుకుంటే జాబ్‌లు వస్తాయో లేదో కానీ, మీరు క్రీడాకారులుగా రాణిస్తే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. తెలంగాణ యువతకు మార్గదర్శనం చేసేందుకు ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీని తెలంగాణకు తీసుకువచ్చాను. మెస్సీతో ఆడేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఆడేందుకు అవకాశం ఇచ్చాను” అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సవాలుగా మారుతున్న సైబర్‌నేరాలు, డ్రగ్స్ ను అరికట్టేందుకు పోలీసులు కృషి చేయాలని సూచించారు.
క్రికెట్ క్రేజ్‌లో ఫుట్‌బాల్‌ను
మరుస్తున్నరు: మంత్రి వాకిటి శ్రీహరి
యువత క్రికెట్ క్రేజ్‌తో ఫుట్‌బాల్‌ను మరిచిపోతున్న తరుణంలో భారీ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహణతో తెలంగాణ పోలీసులు స్ఫూర్తి నింపారని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో స్వయంగా పాల్గొనడం ద్వారా ఈ క్రీడపై తనకున్న మక్కువను సీఎం చాటారన్నారు. డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ సిటీలో ఫుట్‌బాల్ క్రేజ్ క్రమంగా పెరుగుతోందని, భారత్ ఫుట్‌బాల్ టీంలో హైదరాబాద్ నుంచి ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారని గుర్తు చేశారు. 12 రోజులపాటు జరిగిన మ్యాచ్‌లలో 34 టీంలు పాల్గొన్నాయని తెలిపారు. విజేతలను, మ్యాచ్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన అధికారులను అభినందించారు. టోర్నమెంట్ లో పురుషుల జట్టు నుంచి సీఐఎస్‌ఎఫ్, మహిళల జట్టు నుంచి అస్సాం రైఫిల్స్ విజేతలుగా నిలిచాయి. గెలుపొందిన జట్లతోపాటు గోల్డెన్ బూట్ గెలుచుకున్న ప్రియా సాసా, విజయ్ బెహరేకు సీఎం రేవంత్‌రెడ్డి ట్రోఫీలను అందజేశారు.
