కేసీఆర్ జల ద్రోహి .. కృష్ణా, గోదావరి నీటి హక్కులను ఏపీకి రాసిచ్చిండు: సీఎం రేవంత్

కేసీఆర్  జల ద్రోహి .. కృష్ణా, గోదావరి నీటి హక్కులను ఏపీకి రాసిచ్చిండు: సీఎం రేవంత్
  • ఆయన సంతకమే తెలంగాణ ప్రయోజనాలకు మరణశాసనమైంది
  • నదుల అనుసంధాన ప్రతిపాదన పెట్టిందే కేసీఆర్​
  • ఆయన​ చేసిన ద్రోహాన్ని ఊరూరా ప్రజలకు చెప్పాలి
  • 2016 అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​ తర్వాతే 
  • వ్యాప్కోస్​తో స్టడీ చేయించిన చంద్రబాబు
  • 2016 నుంచి 2019 వరకు ఏనాడూ కేసీఆర్​ వ్యతిరేకించలే
  • ఇప్పుడు రివర్స్​లో మాపైనే బురదజల్లుతున్నరు
  • బీఆర్‌‌ఎస్​ చచ్చిన పాము.. దానిని బతికించేందుకు బీజేపీ యత్నం 
  • పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్

హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరి జలాల హక్కులను ఏపీకి కేసీఆర్​తాకట్టు పెట్టారని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఆయన తీరని జలద్రోహం చేశారని మండిపడ్డారు. కేసీఆర్​, హరీశ్‌రావు సంతకాలు పెట్టి తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనం రాశారని అన్నారు. నీళ్లిస్తారని కేసీఆర్​, హరీశ్‌రావుపై ప్రజలు నమ్మకం పెట్టుకుంటే.. వాళ్లు ఆ నమ్మకాన్ని వమ్ము చేశారని తెలిపారు. మంగళవారం ప్రజాభవన్‌లో ‘గోదావరి–-బనకచర్ల’పై ప్రభుత్వం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. అధికారం పోగానే చచ్చిన పార్టీని బతికించుకునేందుకు ప్రభుత్వంపై రివర్స్​లో నిందలు వేస్తున్నారని బీఆర్‌‌ఎస్​ను విమర్శించారు. తొమ్మిదిన్నరేండ్లు కేసీఆర్​, హరీశ్​ రావు దగ్గరే ఇరిగేషన్​ శాఖ ఉన్నదని, తెలంగాణకు నీళ్లిస్తారని ప్రజలు నమ్మారని అన్నారు. 

‘‘నిర్లక్ష్యమో, అహంకారమో తెలియదుగానీ.. వారు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు మరణశాసనం, గుదిబండలా మారాయి. నీటి వాటాల విషయంలో 2015లో నాటి సీఎం కేసీఆర్​, నాటి ఇరిగేషన్​ మంత్రి హరీశ్​ రావు .. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 512 టీఎంసీలు ఏపీకి ఇచ్చారు. తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయంటూ తెలంగాణ రైతుల పాలిట మరణశాసనం రాశారు. వాళ్లిద్దరూ సంతకాలు పెట్టి ఒప్పందాలు చేసుకున్నారు. అంతర్జాతీయ జలవిధానం ప్రకారం.. ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్న రాష్ట్రానికే నీళ్లు ఎక్కువ రావాలి. ఆ లెక్కన కృష్ణా నది 68 శాతం పరివాహక ప్రాంతం తెలంగాణలోనే ఉన్నది. అంటే 555 టీఎంసీలు మనకు రావాలి. కాంగ్రెస్​ సర్కారు దాని మీదనే ట్రిబ్యునల్‌లో పోరాటం చేస్తున్నది. కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల వంటి కృష్ణా ప్రాజెక్టులకు కేసీఆర్​ సర్కారు అనుమతులు తీసుకురాలేకపోయింది. 

ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు కూడా కేసీఆర్​ హయాంలో పూర్తి కాలేదు’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో చంద్రబాబుకు ధైర్యం వచ్చి పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నారంటూ కేసీఆర్​, హరీశ్​ రావు అంటున్నారని, కానీ, వాళ్ల హయాంలో 2016లోనే బనకచర్ల ప్రాజెక్టుకు బీజం పడిందని  సీఎం రేవంత్ ​అన్నారు. ‘‘2023లో అధికారం కోల్పోయారు. 2024లో డిపాజిట్లు పోగొట్టు కున్నారు. 2025 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులే దొరకలేదు. ఇది బీఆర్ఎస్​ పరిస్థితి. ఇప్పుడు నదుల పునరుజ్జీవం కాదు.. బీఆర్ఎస్​ పునరుజ్జీవం కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా నీళ్ల సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాడుకుంటూ మనపై బురదజల్లుతున్నారు. 

అసలు 2016 అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​లో నదుల అనుసంధానం ప్రాజెక్టుపై ప్రతిపాదన చేసిందే కేసీఆర్. 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని లేని రాచపుండును పెట్టిండు. ఆ తర్వాతే 2016లోనే చంద్రబాబు.. రాయలసీమకు నీటి తరలింపుపై వ్యాప్కోస్​కు సర్వే బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రాజెక్టుతో 400 టీఎంసీలను తరలించేందుకు ఏపీ అప్పుడే ప్రతి పాదించింది. 2016 నుంచి 2019 వరకు కేసీఆర్​ ఎప్పుడూ చంద్రబాబును వ్యతిరేకించలేదు. ఆ తర్వాత జగన్​ సీఎం అయ్యాక.. ఆయనతో కేసీఆర్​ సమావేశమై గోదావరి జలాలను ఎలా తరలించుకుపోవచ్చో చెప్పారు. నగరిలో రోజా ఇంటికెళ్లి కూడా గోదావరి జలాలను తరలించి రాయలసీమను రతనాల సీమను చేస్తామన్నారు. ఇప్పుడు రెండోసారి సీఎం అయిన చంద్రబాబు ఆ పాత ఫైళ్ల దుమ్ముదులిపి పోలవరం– బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు’’ అని రేవంత్​ రెడ్డి వివరించారు.  

ఊరూరా నిజాలు చెప్పాలె

సచ్చిపోయిన బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ను తిరిగి బతికించేందుకే కేంద్రం, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఆరోపించారు. నదీ జలాలను అడ్డం పెట్టుకుని తమ మీద బురదజల్లి లబ్ధి పొందాలనుకుంటున్నారన్నారు. ఊరూరా దీనిని తిప్పికొట్టాలని కాంగ్రెస్​ నేతలకు సీఎం రేవంత్​ పిలుపునిచ్చారు. ‘‘గ్రామసభకు పోయినా, నియోజకవర్గానికి పోయినా.. జిల్లాకు పోయినా కాంగ్రెస్​ లీడర్లంతా కేసీఆర్​ చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించాలి. ప్రస్తుతం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పంచాయితీ పెట్టుకోవడం కన్నా.. మన హక్కులు ఎలా సాధించుకోవాలన్న దానిపైనే దృష్టి పెట్టాలి. 

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ చచ్చినపాము. దాని గురించి ఆలోచించి సమయం వృథా చేసుకోవద్దు. బీజేపీ ప్రయత్నాలన్నీ బీఆర్​ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బతికించడానికే. కేంద్రాన్ని నీళ్ల హక్కులపై నిలదీయాలి.  11 ఏండ్లుగా రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్రం ఎలా సహాయ నిరాకరణ చేసిందో దానిపైనే మన పోరాటం. మన ఫోకస్​ అంతా బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపైనే పెట్టాలి. సీఎంగా నేను, మంత్రిగా ఉత్తమ్​.. కిషన్​రెడ్డిని ఇంటికి వెళ్లి కలిసి వచ్చినం. ఏనాడూ నీళ్ల హక్కులపై ఆయన కేంద్ర మంత్రుల దగ్గరకు తీసుకుపోలేదు. కావాలనే తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తీరు అనుమానాలు కలిగిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు రామచందర్​రావుకు ఉన్న మొట్టమొదటి సమస్య గోదావరి జలాలేనని, ఆయన తొలుత దీనిపైనే దృష్టి పెట్టాలని రేవంత్​ కోరారు.  

కేంద్రం కూడా దృష్టిపెట్టలే..

తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేసేందుకు కేంద్రం కూడా ఏనాడూ పనిచేయలేదని, మన ప్రాజెక్టులపై దృష్టి సారించలేదని సీఎం రేవంత్ ఫైర్​ అయ్యారు. తొమ్మిదన్నరేండ్లు ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ దీనిని పట్టించుకోలేదన్నారు. గోదావరి నీళ్లను వినియోగించుకునే ఉద్దేశంతో 2008లో వైఎస్​ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించిందని చెప్పారు. 2014 నాటికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి పనులు కూడా చేశారని గుర్తు చేశారు.

 కానీ, ప్రాజెక్టుల రీడిజైన్​ పేరుతో కేసీఆర్​.. ఆ ప్రాజెక్టు పేరు, ఊరు, అంచనాలను మార్చేశారన్నారు. ‘‘దాన్ని పక్కనపెట్టి కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాళేశ్వరం ఎత్తిపోతలు చేపట్టారు. దీంతో రూ.38 వేల కోట్లున్న ప్రాజెక్టు కాస్తా రూ.లక్షన్నర కోట్లు అయింది. తన ధన దాహం తీర్చుకునేందుకే కేసీఆర్​ ఈ ప్రాజెక్టును చేపట్టారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారు. రూ.1.02 లక్షల కోట్ల బిల్లులు అయితే.. ఇప్పటికే కాంట్రాక్టర్లకు రూ.94 వేల కోట్లు చెల్లించారు. ఇంకా ప్రాజెక్టులో పనులు పూర్తి చేయాలంటే ఇంకో రూ.50 వేల కోట్లు కావాలి. మిగతా పనులూ కలిపితే.. మొత్తంగా ప్రాజెక్టుకు రూ.2 లక్షల కోట్లు అవుతుంది’’ అని ఆయన తెలిపారు.

రా.. అసెంబ్లీలో చర్చిద్దాం

కేసీఆర్​ ఫ్యామిలీ మొత్తం అబద్ధాలను ప్రచారం చేస్తున్నదని సీఎం రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. ‘‘నిజాలు చెబితే చనిపోతారన్న శాపం వారికేమైనా ఉందేమో.. అందుకే అన్నీ అబద్ధాలే చెబుతున్నారు” అని ఎద్దేవా చేశారు. ‘‘హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేద్దాం. కృష్ణా నదిపై ఓ రోజు.. గోదావరి నదిపై మరో రోజు చర్చిద్దాం. ఫేస్​ టు ఫేస్​ అసెంబ్లీలోనే మాట్లాడుకుందాం. రాచపుండును ఎవరు అంటగట్టారో చర్చించాల్సిన అవసరం ఉంది. కేంద్ర పర్యావరణ శాఖ.. పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్​ను తిరస్కరించడం తాత్కాలికమే. అది శాశ్వతం కాదు. 

మళ్లీ క్లారిఫికేషన్​ పేరిట డౌట్లను తీరుస్తరు. ఎందుకంటే చంద్రబాబు మనుగడ ప్రధాని నరేంద్ర మోదీ మీద.. మోదీ మనుగడ చంద్రబాబు మీద ఆధారపడి ఉంది. రివర్​ లింకింగ్​ కాదు.. ఇది పొలిటికల్​ ఇంటర్​ లింకింగ్​లా​ ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్​లాగామాకు రాగి సంకటి, రొయ్యల పులుసు అక్కర్లేదు

కేసీఆర్​లాగా మాకు రాగి సంకటి, రొయ్యల పులుసు అక్కర్లేదు. మాకు కావాల్సింది తెలంగాణ ప్రజల ప్రయోజనాలు. వ్యక్తులు పరిచయం ఉన్నంత మాత్రాన రైతుల ప్రయోజనాలను తాకట్టు పెడతామా? 
పైన ఉన్న తెలంగాణ వాడుకున్నాక మిగిలిన నీళ్లనే వాడుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అలాంటప్పుడు కృష్ణాలో తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు అడ్డం పడుతున్నరు?
రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను కేంద్రం పరిష్కరించడం లేదు. లిటిగేషన్ పెడుతున్నది.


సీఎం రేవంత్​ రెడ్డి