బీజేపీ వాళ్లు సంక్రాంతి గంగిరెద్దుల్లాగా వచ్చిపోయేటోళ్లే : సీఎం రేవంత్

బీజేపీ వాళ్లు సంక్రాంతి గంగిరెద్దుల్లాగా వచ్చిపోయేటోళ్లే : సీఎం రేవంత్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ అచ్చోసిన ఆంబోతులా బరితెగించి మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొద్ది మంది ఫోన్లు వింటే విని ఉండొచ్చంటున్నారని, వింటే ఏమవుతుందన్నట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. దొంగచాటుగా ఫోన్లు విన్నోళ్లు చర్లపల్లి జైలులో చిప్పకూడు తినక తప్పదని హెచ్చరించారు.

మోదీ చంద్రమండలానికి రాజైతడా? 

కాంగ్రెస్​ను కాదని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీ పాలమూరుకు ఏమీ చేయలేదన్నారు. ‘‘మోదీ పదేండ్లు ప్రధానిగా ఉన్నారు కదా? ఇంకా ఏమవుతారు.. చంద్రమండలానికి రాజైతరా? చంద్రమండలానికి రాజై మనకు ఏమైనా మేలు చేస్తరా? వాళ్లెవరూ ఇక్కడ ఉండరు. వాళ్లు మనకేం చేయరు. ఇక్కడ శాశ్వతంగా ఉండేది మనమే. బీజేపీ వాళ్లు సంక్రాంతి గంగిరెద్దుల్లాగా వచ్చిపోయేటోళ్లే” అని రేవంత్ అన్నారు. 

ఓటు చాలా విలువైంది 

ఓటు చాలా విలువైందని, మనల్ని ఏలే వాళ్లను ఎన్నుకునేది ఓటు ద్వారానే అని సీఎం రేవంత్ అన్నారు. అందుకే ఎన్ని పనులున్నా ఢిల్లీ నుంచి వచ్చి మరీ మహబూబ్​నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశానని చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చి సీజేఐని కలిసి కొడంగల్​కు వెళ్లి ఓటేశానన్నారు. ‘‘కానీ, ఇలాంటి లఫంగా గాళ్లను ఎన్నుకుంటే నష్టమే జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పకుండా 200 ఓట్ల మెజారిటీతో గెలుస్తాం. సీఎం మనోడే.. ప్రభుత్వం మనదే.. మంచిగా అభివృద్ధి చేసుకోవచ్చు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చన్న ఉద్దేశంతో ఎంపీపీలు, ఎంపీటీసీలు, జిల్లా నాయకులు మద్దతిచ్చారు’’ అని రేవంత్ చెప్పారు.

బోయల డిమాండ్లు నెరవేరుస్తం

ఇప్పటికే బీసీ ఫెడరేషన్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చామని, మరికొన్ని నిర్ణయాలనూ తీసుకోవాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆ నిర్ణయాలను తీసుకోలేకపోతున్నామని, ఎన్నికలైపోగానే వాల్మీకీ బోయల డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమం, అభివృద్ధి, విద్యాఉద్యోగాల్లో మంచి స్థానం కల్పిస్తామన్నారు. వాల్మీకీ బోయలంతా కాంగ్రెస్​వైపు ఉండాలని కోరారు. ఎన్నికలవ్వగానే అందరినీ సెక్రటేరియెట్​కు పిలిపించుకుని మాట్లాడతామన్నారు. జిల్లాలోని రెండు ఎంపీ సీట్లలోనూ గెలిపించాలని కోరారు.