ఉస్మానియా యూనివర్సిటీపై .. సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్​ ఫోకస్

ఉస్మానియా యూనివర్సిటీపై .. సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్​ ఫోకస్
  • సమస్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం
  • వెంటనే వర్సిటీ హాస్టళ్లను తనిఖీ చేసిన ఆఫీసర్లు
  • ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తేవాలని స్టూడెంట్లకు సూచన
  • హాస్టళ్లలో సిబ్బందితో సమావేశాలు.. ఇయ్యాల రిపోర్టు అందజేసే చాన్స్​

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. వర్సిటీలో సమస్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఓయూ ఆఫీసర్లు వెంటనే హాస్టళ్లకు వెళ్లారు. తనిఖీ చేసి, స్టూడెంట్లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అడిగిన అంశాలతో నివేదికను తయారు చేసి.. శనివారం రిపోర్టును అందజేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రోజూ ఆందోళనలు

గత ప్రభుత్వం వర్సిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఓయూలో అనేక సమస్యలు నెలకొన్నాయి. హాస్టళ్లు సరిగా లేకపోవడం, సమయానికి మెస్ బిల్లులు రాకపోవడం, స్కాలర్‌‌‌‌షిప్‌‌లు విడుదల కాకపోవడం వంటి అంశాలపై విద్యార్థులు ఎన్నో రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు లేడీస్ హాస్టళ్లలోకి ఆగంతకులు ప్రవేశించడం, తమకు సరిపడా ఫుడ్ పెట్టడం లేదని, భోజనంలో క్వాలిటీ ఉండటం లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు నిరసనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 

‘‘అన్నంలో పురుగులు వస్తున్నాయి.. పురుగుల అన్నం మీరు తింటారా?” అంటూ ఓ పీజీ స్టూడెంట్.. ముఖ్యమంత్రికి ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చాలా సీరియస్​గా తీసుకున్నట్లు తెలిసింది. దీంతో హాస్టల్ సమస్యలపై వెంటనే తమకు నివేదిక అందజేయాలని సీఎంఓ అధికారులు ఓయూ ఆఫీసర్లను ఆదేశించారు. 

సెలవులు ప్రకటించినా..

ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఓయూ అధికారులు హాస్టళ్లను సందర్శించారు. శుక్రవారం నుంచే సెలవులు ప్రకటించినప్పటికీ.. నాలుగు లేడీస్ హాస్టళ్లకు వెళ్లారు. అక్కడి సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, హాస్టల్​ అధికారులు, ఇతర సిబ్బంది తీరుపై తమకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు వర్సిటీలోని అన్ని హాస్టళ్లలో సిబ్బందితో సమావేశాలు కూడా నిర్వహించారు. వంటల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని, అన్నంలో పురుగులు వచ్చినా, నాణ్యత లేకపోయినా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. వర్సిటీలో నిర్మాణంలో ఉన్న భవనాలను సందర్శించి.. పనులు వేగవంతం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అలాగే వర్సిటీలో పెండింగ్ పనులు, ఇతర ఆర్థికపరమైన అంశాలపై అత్యవసరంగా సమావేశాలు నిర్వహించారు. నివేదికను శనివారం అందజేయనున్నట్లు తెలిసింది. ఇవేకాక.. యూనివర్సిటీలో ఇటీవల జరిగిన సీనియర్ ప్రొఫెసర్ల ప్రమోషన్లు, ఫ్యాకల్టీ కొరత, కాంట్రాక్టు అధ్యాపకుల పర్మినెంట్ సమస్య, వర్సిటీలో నెలకొన్న ఇతర సమస్యలపై సీఎం నివేదిక కోరినట్లు తెలిసింది.