హైదరాబాద్: విధి నిర్వహణలో అమరులైన పోలీసు ఫ్యామిలీలకు కోటి పరిహారం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గోషామహల్ పోలీస్ స్టేడియం సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం పురస్కరించుకొని గోషామహల్ పోలీస్ స్టేడియంలో పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అమరులైన పోలీసు ఫ్యామిలీలకు కోటి పరిహారం అందిస్తామని తెలిపారు.
కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా, ఎస్సై నుంచి డీఎస్పీ వరకు కోటి 25 లక్షల నష్టపరిహారం అందిస్తామని సీఎం ప్రకటించారు. పోలీసు అమరుల కుటుంబాలను ఆదుకుంటామని, పోలీస్ సంక్షేమానికి ఏటా రూ.20 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. పోలీసుల సమస్యల పరిష్కారంలో ముందుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Also Read :- బాధితులతో ఫ్రెండ్లీగా.. క్రిమినల్స్‌తో కఠినంగా ఉండండి
సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ హైలైట్స్:
* వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు ఇక నుండి కోటి రూపాయలు నష్ట పరిహారం
* కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్కు కోటి రూపాయలు నష్టపరిహారం
* సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్లకు కోటి 25 లక్షలు
* డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీలకు కోటి 50 లక్షలు
* ఐపీఎస్ కుటుంబాలకు 2 కోట్లు
* శాశ్వతంగా అంగవైకల్యం పొందిన కుటుంబాలకు, ర్యాంక్ అధికారులను బట్టి వారికి 50 లక్షల నష్ట పరిహారం చెల్లిస్తాం
* చనిపోయిన పోలీసుల కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తాం
* పోలీసులు సమాజానికి రోల్ మోడల్స్
* పోలీసులు ఎవరు ఎదుట చేయి చాచకూడదు
* హుందాగా, గౌరవంగా బతుకుదాం
* క్రిమినల్స్తో పోలీసులు ఫ్రెండ్లీగా ఉండడం కాదు.. బాధితులతో ఫ్రెండ్లీగా ఉండాలి
* క్రిమినల్స్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలి
* 50 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నాం
* వచ్చే అకాడమీ నుంచి విద్యా సంస్థ ప్రారంభిస్తాం
* నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలి
* పోలీస్ సమస్యలు ఏమున్నా నా దగ్గరికి తీసుకువస్తే నేను పరిష్కరిస్తాను.