శనివారం ( నవంబర్ 1 ) జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బోరబండలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అజారుద్దీన్ ను మంత్రి చేసి మాట నిలబెట్టుకున్నానని అన్నారు. కారు షెడ్డుకు పోయింది, బిల్లా రంగాలు ఆటోల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్. పీజేఆర్ చనిపోతే ఏకగ్రీవానికి బీజేపీ, బీఆర్ఎస్ ఎందుకు సహకరించలేదని ప్రశ్నించారు. ఈ దుష్ట సంస్కృతికి తెర లేపిందే బీఆర్ఎస్ కాదా అని ధ్వజమెత్తారు సీఎం రేవంత్. ఎమ్మెల్యే చనిపోతే ఎన్నికలు తీసుకొచ్చిన కాసాయే కెసిఆర్ అని అన్నారు.
బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సెంటిమెంట్ రాజేయాలని చూస్తోందని అన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదో ఆలోచించండని అన్నారు సీఎం రేవంత్. తాడు బొంగరం లేని బీజేపీ ఇక్కడ అభివృద్ధి చేస్తామని అంటోందని ఎద్దేవా చేశారు. బోరబండలో అడిగినోళ్లందరికి రేషన్ కార్డులు ఇచ్చామని.. ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు ఇస్తే బీఆర్ఎస్ కు కడుపు మండుతోందని.. ఆడబిడ్డలు పైసా లేకున్నా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని అన్నారు సీఎం రేవంత్.
2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. ఐదేళ్లు మహిళా మంత్రి లేదని.. తాము అధికారంలోకి రాగానే ఇద్దరు మహిళలను మంత్రులను చేశామని అన్నారు సీఎం రేవంత్. మాగంటి గోపినాథ్ ఎప్పుడైనా అసెంబ్లీలో ప్రజాసమస్యలు ప్రస్తావించారా అని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కావాలంటే నవీన్ యాదవ్ ను గెలిపించాలని అన్నారు సీఎం రేవంత్.
