డ్రగ్స్ కల్చర్​ను ఖతం చేయాలి

డ్రగ్స్ కల్చర్​ను ఖతం చేయాలి

రాష్ట్రంలో వేళ్లూనుకున్న డ్రగ్స్​కల్చర్​ను సమూలంగా దగ్ధం చేయాల్సిన అవసరం ఉన్నది.  డ్రగ్స్ వ్యసనం మానవజాతి వినాశనానికి దారితీస్తోంది. దాన్ని సమష్టిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ.. దానికోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. డ్రగ్స్ రక్కసిని పారదోలేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.

ఈ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలను సాధించలేకపోయింది.  భావిభారత పౌరులుగా ఎదిగి దేశాన్ని పురోగాభివృద్ధివైపు పరుగులు పెట్టించాల్సిన యువత మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారు. అధికారులు కోట్లాది రూపాయల డ్రగ్స్ ను  పట్టుకుంటున్నా పూర్తిస్థాయిలో డ్రగ్​ మాఫియాను అరికట్టలేకపోతున్నారు. ఆ మధ్య చెన్నైలో 160 కోట్ల రూపాయల విలువచేసే మత్తుమందులు పట్టుబడ్డాయి. అంతకుముందు గుజరాత్​లోని ముద్రాపోర్టులో 21 వేల కోట్ల రూపాయల విలువచేసే హెరాయిన్ పట్టుబడింది. హైదరాబాద్ లో కూడా మాదకద్రవ్యాలు పట్టుబడుతూనే ఉన్నాయి. స్మగ్లర్లు, డీలర్లు, వినియోగదారులను ఎవరినీ వదలబోమని సీపీ తెలిపారు. నిరుడు హైదరాబాద్​ నార్కోటిక్స్​ ఎన్ఫోర్స్​మెంట్​ వింగ్,  నార్కోటిక్ విభాగం పోలీసులు 83 కేసులు నమోదు చేసి, 139 మంది స్మగ్లర్లను, 50 మంది సరఫరాదారులను, 54 మంది వినియోగదారులను పట్టుకున్నామని తెలిపారు. 

కోట్లాది మంది మత్తులో..

దేశవ్యాప్తంగా ప్రతి రోజూ వేల కోట్ల రూపాయల విలువచేసే మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నాయి. మత్తు పదార్థాలకు భారత్ అతిపెద్ద మార్కెట్​గా తయారైంది. దాదాపు కోటి యాభై ఎనిమిది లక్షల మంది మైనర్లు మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. కోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా సర్వేలు నిర్వహించినట్లు, మూడు కోట్ల పది లక్షల మంది వరకు గంజాయి, మరో రెండు కోట్ల అరవైలక్షల మంది డ్రగ్స్​కు అలవాటుపడినట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది.  

ఆధునిక కాలంలో తరతమ భేదాలు లేకుండా పిల్లలు మొదలుకొని పెద్దలు వరకు మత్తుపదార్థాల ఊబిలోకి దిగుతున్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబం, సమాజంతోపాటు జాతికి తీరని నష్టాన్ని కలుగజేస్తోంది.  డ్రగ్స్ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి. మెదడు, గుండె, కాలేయం, జీర్ణాశయం, ఊపిరితిత్తులు మొదలైన అవయవాల్ని మాదకద్రవ్యాలు పీల్చి పిప్పిచేస్తాయి. 

డ్రగ్స్ పై  ఉక్కుపాదం మోపాలి

దేశవ్యాప్తంగా ఏడు కోట్ల ముప్పై లక్షల మంది మత్తు పదార్థాలకు అలవాటుపడ్డారని కేంద్ర హోంశాఖ అందించిన వివరాలు సమస్య తీవ్రతని తెలియజేస్తున్నాయి. గత పదేండ్లలో పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాలలో స్వాధీన పరచుకున్న మాదక ద్రవ్యాలు 50 లక్షల కిలోలకు పైగా ఉండటం సమస్య వికృత రూపానికి నిలువెత్తు నిదర్శనం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  మాదక ద్రవ్యాల ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ పోటీపడుతున్నాయి. తెలంగాణలో ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్​లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలోని అటవీ ప్రాంతాలలో గంజాయి సాగు భారీగా  అదీ ప్రభుత్వ భూములలో జరగడం విశేషం. మిగతా ప్రాంతాలలో కూడా కందిపంట, బంతిపూలు, మిరప మొక్కలతోపాటు గంజాయి సాగు కొనసాగుతోంది. 

 ప్రపంచంలో మాదక ద్రవ్యాల ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలైన మయన్మార్, లావోస్, థాయిలాండ్​  స్వర్ణ త్రిభుజిగా ఉంటే, ఇరాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ బంగారు నెలవంకగా పేరు పొందాయి. పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నుంచి కోట్లాది రూపాయల విలువైన మాదకద్రవ్యాలు వివిధ మార్గాల ద్వారా భారతదేశంలోకి చేరుకుంటున్నాయని నిఘా వర్గాలు చెపుతున్నాయి.  సింగపూర్, సౌదీ అరేబియా, చైనా, అమెరికా సహా 30కి పైగా దేశాలు మాదక ద్రవ్యాల రవాణాదారులకు మరణశిక్షను అమలు చేస్తున్నాయి. మాదక ద్రవ్యాలతో 'త్రీడి' సమస్యలు అంధకారం (డార్క్​నెస్), విధ్వంసం (డిస్ట్రక్షన్), వినాశనం (డెవస్టేషన్) కలుగుతాయని ప్రధాని మోదీ మాటలు అక్షరసత్యమనడంలో సందేహం లేదు. పాలకులలో చిత్తశుద్ధి, పట్టుదల, దీక్ష, దక్షత ఉంటే ఏ సమస్యయైనా కచ్చితంగా పరిష్కారమవుతుంది.  కాబట్టి తెలంగాణ  ప్రభుత్వం డ్రగ్స్​పై ఉక్కుపాదం మోపి ప్రజలను, యువతను చైతన్యపరచాలి.

ప్రమాదంలో యువత భవిత

డ్రగ్స్​కల్చర్ యువత భవితను ప్రమాదంలోకి నెట్టివేస్తున్నది. వాళ్ల జీవితాల్ని బుగ్గిపాలు చేస్తోంది. అణుశక్తి కన్నా శక్తిమంతమైన యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నది. స్మగ్లింగ్, అవినీతి, ఉగ్రవాదం మొదలైనవాటిని పెంచి పోషించడంలో మాదకద్రవ్యాలు 'పెద్దన్న' పాత్రను పోషిస్తున్నాయి. నేరస్థుల నేస్తంగా అక్రమ వ్యాపారస్థుల పాలిట అభయహస్తంగా మాదక -ద్రవ్యాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

మాదకద్రవ్యాల వినియోగం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం ప్రముఖ స్థానంలో ఉంది. అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్న దేశం భారతదేశమే. దేశంలో ఎక్కువగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న యువతే డ్రగ్స్ కు దాసోహం అవుతున్నారు. మాదక ద్రవ్యాల బారిన పడుతున్నవారిలో  25- నుంచి 35 ఏళ్ల వారే అధికమని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 35 లక్షల మంది హెపటైటిస్ వ్యాధి బారిన పడటం జరిగింది.  భారతదేశంలో మత్తు పదార్థాల్ని వినియోగిస్తున్న ప్రతి ఐదుగురిలో ఒకరు 21 సంవత్సరాలలోపువారే. అత్యధికంగా యువతలో 76 శాతం మంది మాదక ద్రవ్యాలను వినియోగించటంలో పంజాబ్ ముందుంది.

మన్నారం నాగరాజు, సోషల్​ ఎనలిస్ట్