- మొదటి విడతలో వాళ్లకే కేటాయించాలి: సీఎం రేవంత్
- 1 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ మార్చాలి
- ‘బ్రేక్‌ఫాస్ట్’ను రాష్ట్రమంతా విస్తరించాలని సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల విషయంలో ఆడబిడ్డలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మొదటి విడతలో పూర్తయ్యే పాఠశాలలను బాలికలకే కేటాయించాలని ఆదేశించారు. ‘‘రాబోయే మూడేండ్లలో ప్రతి నియోజకవర్గంలో బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి చొప్పున స్కూళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. ఇప్పుడు బాలికలకు కేటాయించిన చోట, తర్వాతి విడతలో బాలురకు కేటాయించాలి. ఈ పాఠశాలల్లో సోలార్ కిచెన్ల ఏర్పాటుకు పీఎం కుసుమ్ పథకాన్ని వినియోగించుకోవాలి. నిర్మాణ పనుల బిల్లులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలి” అని సూచించారు. గురువారం సెక్రటేరియెట్‌లో విద్యాశాఖపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్యపుస్తకాల్లోనూ మార్పులు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘భవిష్యత్ పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా ఒకటి నుంచి పదో తరగతి వరకు సిలబస్ మార్చాలి. దీనిపై తక్షణమే కసరత్తు ప్రారంభించాలి. కేవలం డిగ్రీలు చేతికి ఇవ్వడమే కాకుండా, విద్యార్థులకు ఉపాధి కల్పించేలా విద్యావిధానం ఉండాలి. ముఖ్యంగా పాలిటెక్నిక్ కళాశాలలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికీ కచ్చితంగా ఉద్యోగం లభించేలా సిలబస్, బోధన ఉండాలి. పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త కోర్సులు, మౌలిక వసతుల కోసం టాటా టెక్నాలజీస్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని త్వరగా అమల్లోకి తీసుకురావాలి” అని ఆదేశించారు.
సెంట్రలైజ్డ్ కిచెన్ల ఏర్పాటు..
ప్రస్తుతం తన నియోజకవర్గం కొడంగల్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనికి సంబంధించి సాధ్యసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. తగినంత స్థలం, సహకారం అందిస్తే రాష్ట్రవ్యాప్తంగా రుచికరమైన భోజనం అందించేందుకు సిద్ధమని అక్షయపాత్ర ప్రతినిధులు సీఎంకు వివరించారు. దీంతో ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని, తద్వారా విద్యార్థులందరికీ వేడివేడి భోజనం సకాలంలో అందుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ కిచెన్ల ఏర్పాటుకు అవసరమైన రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించడం లేదా 99 ఏళ్ల లీజుకు తీసుకోవడంపై వెంటనే కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు.
మహిళా వర్సిటీ పనులు స్పీడప్ చేయండి..
హైదరాబాద్‌లో ప్రభుత్వ పాఠశాలలను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి గ్రేటర్‌లో కొత్తగా నిర్మిస్తున్న 23 పాఠశాలలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని డెడ్‌లైన్ విధించారు. నిర్మాణ పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే, మహిళా విశ్వవిద్యాలయం పనులను వేగవంతం చేయాలన్నారు. వర్సిటీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దని అధికారులను మందలించారు.
ఇకపై బూట్లు, బెల్టులు..
సర్కార్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి బూట్లు, బెల్టులు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనికి సంబంధించి విద్యాశాఖ ప్రతిపాదనలకు ఆయన ఓకే చెప్పారు. ఇందుకు సమగ్ర శిక్ష నిధులను వినియోగించనున్నారు. సర్కార్ నిర్ణయంతో దాదాపు 20 లక్షలకు పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది.
