
- రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లే అవకాశం
- రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర సాయం కోరనున్న సీఎం
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో ఈ నెల 24న జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నట్లు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి జాతీయ ప్రాధాన్యత అంశాలపై చర్చించనున్నారు.
వీటితోపాటు తెలంగాణకు సంబంధించిన పలు ప్రత్యేక అభ్యర్థనలను కూడా ఈ వేదికపై సీఎం రేవంత్ ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రధానంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు ఆర్థిక సహాయంపై అభ్యర్థించనున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ప్రాజెక్టుకు పూర్తిస్థాయి ఆర్థిక సహాయం, హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణకు అవసరమైన కేంద్ర నిధులు, అనుమతులు, అలాగే పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం సాయం, త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు.
వీటితోపాటు రాష్ట్రంపై ఉన్న రుణ భారాన్ని తగ్గించేందుకు రుణాల రీషెడ్యూలింగ్, కేంద్రం నుంచి ఆర్థిక వెసులుబాటు, వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలలో వేగం, రాష్ట్రాల ఆర్థిక హక్కులు, కేంద్రం నుంచి నిధుల కేటాయింపుల్లో పారదర్శకత లాంటి అంశాలను కూడా సీఎం రేవంత్ ప్రస్తావించనున్నారు. ఈ కీలక ప్రాజెక్టులతోపాటు వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతి, విద్య, వైద్య రంగాల్లో రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లనువివరించనున్నారు.