
హైదరాబాద్, వెలుగు: విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసులను స్మరించుకుంటూ ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ గోషామహల్‌లోని పోలీస్ స్టేడియంలో అమరవీరుల స్తూపానికి మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ అమరవీరుల కుటుంబాలు పాల్గొంటాయని డీజీపీ శివధర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘మంగళవారం ఉదయం 9.30కు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఈ నెల 21 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. పోలీస్ స్టేషన్ పరిధిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన ఈ నెల 31న నిర్వహించనున్న జాతీయ సమైక్యత దినోత్సవం వరకు కార్యక్రమాలు నిర్వహిస్తాం’’ అని శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 191 మంది అమరులయ్యారు
రాష్ట్రానికి చెందిన పోలీస్ సిబ్బంది ఐదుగురు సహా దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించారు. పోలీసు అమరవీరులను గౌరవించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 22 నుంచి 24 మధ్య అమరుల కుటుంబాలను సందర్శించి వారి సంక్షేమం కోసం పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తారు. అమరవీరుల విగ్రహాలు, ఫొటోలకు వారి స్వగ్రామాల్లో శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాలు నిర్వహిస్తారు.