బీసీ బిల్లుపై ముఖ్య నేతలతో సీఎం రేవంత్ కీలక మీటింగ్..

బీసీ బిల్లుపై ముఖ్య నేతలతో  సీఎం రేవంత్  కీలక  మీటింగ్..

బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై అడుగడుగునా జాగ్రత్తలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టులోను కేసు గెలిచేందుకు తన సర్వశక్తులు ఒడ్డుతోంది. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గంటగంటకు పరిస్థితిని అంచనా వేస్తూ ముందుకు వెళుతుంది. 

సీఎం కీలక మీటింగ్

 అక్టోబర్ 8న  హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు విచారణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన చర్యలు తదితర అనుబంధ అంశాలను చర్చించేందుకు ఏకైక ఎజెండాతో అక్టోబర్ 7న  సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 

అక్టోబర్ 6న  సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల  కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున  సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింగ్వి, సిద్ధార్థ దవే లు వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టులో కూడా  బీసీ రిజర్వేషన్ల కేసులో అక్టోబర్ 8న  వాదనలు వినిపించాల్సిందిగా అభిషేక్ సింగ్వీని సీఎం రేవంత్ కోరారు. 

సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు హైకోర్టులో అక్టోబర్ 8న  కేసు విచారణ నేపథ్యంలో స్వయంగా హాజరై వాదనలు వినిపించాలని  అభిషేక్ సింగ్విని సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రుల బృందం ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో రేపు హైకోర్టులో ప్రభుత్వం తరపున  అభిషేక్ సింగ్వీ వాదనలు వినిపించనున్నారు.