
- మురుగునీరు శుద్ధిచేసే లక్ష్యంతో ముందుకు
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేసే లక్ష్యంతో నిర్మించిన ఆరు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)లను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు. అంబర్పేట్తో పాటు మరో 5 ఎస్టీపీలను ఓపెన్ చేయనున్నారు. వీటితో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 39 ఎస్టీపీలకు శంకుస్థాపన చేయనున్నారు.
జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలలో 1,450 చదరపు కిలో మీటర్ల పరిధిలో మురుగనీటి శుద్ధి ప్రక్రియను కూడా మెట్రో వాటర్ బోర్డు నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌లో 100శాతం మురుగు శుద్ధి కోసం 20 ఎస్టీపీలు (1,106 ఎంఎల్డీ) నిర్మాణం చేపట్టారు. తాజాగా మరో 39 ఎస్టీపీలను ఔటర్రింగ్రోడ్ పరిధిలోని ప్రాంతా ల్లోనూ నిర్మించనున్నారు.