మేడారం దారిలో అందాల కనువిందు.. ఊటీ, కొడైకెనాల్‌‌‌‌ను తలపిస్తున్న తాడ్వాయి అడవులు

మేడారం దారిలో అందాల కనువిందు.. ఊటీ, కొడైకెనాల్‌‌‌‌ను తలపిస్తున్న తాడ్వాయి అడవులు
  •      టూరిస్ట్‌‌‌‌ల కోసం కాటాపూర్‌‌‌‌ రూట్‌‌‌‌లో సఫారీ, వ్యూ పాయింట్‌‌‌‌
  •      జలగలంచ వద్ద పోర్ట్‌‌‌‌ వ్యూ పాయింట్‌‌‌‌ ఏర్పాటు 
  •      ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన బ్లాక్‌‌‌‌బెర్రీ
  •     మేడారం వచ్చే భక్తులకు గ్రీన్‌‌‌‌ వెల్కమ్‌‌‌‌ చెబుతున్న ములుగు జిల్లా

 

ములుగు, వెలుగు : మరికొన్ని రోజుల్లో మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. సంక్రాంతి సెలవులతో పాటు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. లక్షలాది మంది భక్తుల రాకతో మేడారం పరిసరాలు కిటకిటలాడిపోతున్నాయి. ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్‌‌‌‌తో కలిసి మేడారం వచ్చే భక్తులకు ములుగు జిల్లా తాడ్వాయి అడవులు ఆహ్లాదం, ఆనందం కలిగిస్తున్నాయి. ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న ఫారెస్ట్‌‌‌‌ ఊటీ, కొడైకెనాల్‌‌‌‌ను తలపిస్తోంది. మేడారం వచ్చే భక్తులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడంతో పాటు అటవీ అందాలను కండ్లకు కట్టినట్లు చూపించేలా ఆఫీసర్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఏటూరు నాగారం వైల్డ్‌‌‌‌ లైఫ్‌‌‌‌ సాంక్చురీతో పాటు కాటారం రూట్‌‌‌‌లోని హట్స్‌‌‌‌ వద్ద సఫారీ వ్యూ పాయింట్‌‌‌‌, జలగలంచ వద్ద పోర్ట్‌‌‌‌ వ్యూ పాయింట్‌‌‌‌ ఏర్పాటు చేశారు. వీటికి తోడు తాడ్వాయి అడవుల్లో ఏర్పాటు చేసిన బ్లాక్‌‌‌‌ బెర్రీ ఇప్పటికే భక్తులు, టూరిస్ట్‌‌‌‌లకు అందుబాటులోకి వచ్చింది. 

18 కిలోమీటర్ల లాంగ్‌‌‌‌ సఫారీ డ్రైవ్‌‌‌‌

ములుగు జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ సమీపంలో బ్లాక్‌‌‌‌బెర్రీని అందుబాటులోకి తీసుకువచ్చిన ఆఫీసర్లు మరో అపురూప దృశ్యమాలతో పర్యాటకులకు కనులవిందు చేస్తున్నారు. ఏటూరునాగారం అభయారణ్యంలోని తాడ్వాయి అడవుల్లో గతేడాది డిసెంబర్‌‌‌‌ 26న బ్లాక్‌‌‌‌ బెర్రీని, డిసెంబర్‌‌‌‌ 31న సఫారీ వ్యూ పాయింట్‌‌‌‌ను ప్రారంభించగా.. తాజాగా పస్రా రేంజ్‌‌‌‌లో ఏర్పాటు చేసిన పోర్ట్‌‌‌‌ వ్యూ పాయింట్‌‌‌‌ను ఈ నెల 10న మంత్రి సీతక్క ప్రారంభించారు. బ్లాక్‌‌‌‌ బెర్రీలో స్టే చేయడానికి గుడారాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తాడ్వాయి హట్స్‌‌‌‌కు సమీపంలోని కాటారం రూట్‌‌‌‌లో గుట్టల నడుమ సఫారీ వ్యూ పాయింట్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. ములుగు జిల్లాల్లో అందుబాటులోకి వచ్చిన రెండు సఫారీల్లో ఒకటి 18 కిలోమీటర్లు సాగనుండగా.. మరొకటి నాలుగు కిలోమీటర్లు సాగనుంది. సఫారీలో భాగంగా ప్రత్యేక వాహనంలో కొండ కోనల్లో తిప్పుతూ... మధ్యమధ్యలో కనిపించే ప్రత్యేక వృక్షాలు, జంతువుల గురించి ఆఫీసర్లు వివరించనున్నారు. సఫారీ రైడ్‌‌‌‌లో అడవి దున్నలు, దుప్పులు, మెకాలు, కనుజులు, కొండగొర్రెలు, బెట్టు ఉడుతలతో పాటు పలు రకాల జంతువులు కనువిందు చేసే అవకాశం ఉంది. గుట్టలపై ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ నుంచి చూస్తే తాడ్వాయి ఫారెస్ట్‌‌‌‌ ఊటీ, కొడైకెనాల్‌‌‌‌ను గుర్తు చేయనుంది.

జలగలంచ వద్ద మరో వ్యూ పాయింట్‌‌‌‌

తాడ్వాయి అడవుల్లోని జలగలంచ వాగు ప్రాంతంలో మరో వ్యూ పాయింట్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. పస్రా రేంజ్‌‌‌‌ పరిధిలోని ఈ పాయింట్‌‌‌‌ ద్వారా చూస్తే చుట్టూ ఎత్తైన కొండలు, సెలయేళ్లు కనిపించనున్నాయి. చలికాలంలో వచ్చే పర్యాటకులకు ముగులు జిల్లా అడవులు.. మరో మారేడుమిల్లి అనుభూతి కలిగించనున్నాయి. సఫారీ ద్వారా వెళ్లే పర్యాటకులకు 18 కిలోమీటర్ల నిడివిలో ఈ పోర్ట్ వ్యూ పాయింట్ కూడా కనువిందు చేయనుంది. పచ్చని ప్రకృతితో పాటు అందమైన జంతువులు, పక్షులను తిలకిస్తూ స్నేహితులు, కుటుంబంతో గడిపేందుకు ములుగు జిల్లాకు రావాలని మంత్రి సీతక్క, ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు పిలుపునిస్తున్నారు. 

జిల్లా మొత్తం పర్యాటక ప్రాంతాలే...

ములుగు జిల్లాలో మేడారంతో పాటు అనేక పర్యాటక ప్రాంతాలు టూరిస్ట్‌‌‌‌లను ఆకట్టుకోనున్నాయి. జిల్లాలోకి ఎంటర్‌‌‌‌ కాగానే ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకోవచ్చు. అక్కడి నుంచి వెంకటాపూర్‌‌‌‌లోని రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయం, రామప్ప సరస్సు, లక్నవరం సరస్సులను సందర్శించడంతో పాటు బోటింగ్‌‌‌‌ సౌకర్యం కూడా ఉంటుంది. అనంతరం మేడారం, అక్కడి నుంచి ఏటూరునాగారం అభయారణ్యం, మల్లూరు హేమాచల క్షేత్రంతో పాటు బొగత జలపాతం పరవళ్లను చూడవచ్చు. 

  ప్రకృతి ఒడిలో గడిపేందుకు ములుగు జిల్లాకు రావాలి 

ప్రజలు ప్రకృతిలో గడిపేందుకు ములుగు జిల్లాకు రావాలి. ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రాంతాల అనుభూతి తాడ్వాయి అడవుల్లో కూడా లభిస్తోంది. బ్లాక్‌‌‌‌ బెర్రీ, సఫారీ రైడింగ్, వ్యూ పాయింట్లు అద్భుతంగా ఉన్నాయి. ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు దగ్గరుండి టూరిజం స్పాట్లను చూపించనున్నారు. 
- మంత్రి సీతక్క

అందుబాటులో కాటేజీలు...

టూరిజం శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రత్యేకంగా కాటేజీలు సైతం నిర్మించారు. ఇందులో బస చేసేందుకు.. మేడారం జాతర టైంలో అయితే ఏసీ గదికి రూ.3500ల నుంచి రూ.4 వేల వరకు, నాన్‌‌‌‌ ఏసీ గదులకు రూ.2500ల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. సాధారణ రోజుల్లో ఏసీ రూమ్‌‌‌‌కు రూ.2,500లు, నాన్‌‌‌‌ ఏసీ రూమ్‌‌‌‌కు రూ.1,500లు వసూలు చేస్తుంటారు. గదులు బుక్‌‌‌‌ చేసుకున్న టూరిస్ట్‌‌‌‌లు సఫారీకి వెళ్లాలంటే... ఒక్కొక్కరికి అదనంగా రూ.500లు చార్జ్‌‌‌‌ చేయనున్నట్లు సమాచారం.