- సమ్మక్క జాతర వేళ లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
- రూ.వేలల్లో ప్రైవేట్ గదుల అద్దెలు
సిద్దిపేట, వెలుగు: కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి మహా జాతర మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. అయినా భక్తులకు సౌకర్యాలకు సంబంధించిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. వసతి కోసం నాలుగేండ్ల క్రితం ప్రారంభించిన 50 గదుల సత్రం, రెండేళ్ల క్రితం ప్రారంభమైన క్యూలైన్ నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. వచ్చే ఆదివారం నుంచి మల్లన్న మహా జాతర ప్రారంభమవుతుంది. తొలిరోజే దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నా.. అప్పట్లోగా పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు.
ఈ ఏడాది మేడారం జాతర నేపథ్యంలో కొమురవెల్లికి భక్తుల రద్దీ పెరుగుతుందని తెలిసినా అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సరైన వసతి సౌకర్యం లేకపోవడంతో గుడారాలు వేసుకోవడం, అధిక ధరలు చెల్లించి ప్రైవేట్గదులను అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
రెండేళ్లుగా సాగుతున్న క్యూ కాంప్లెక్స్ పనులు
శ్రీమల్లికార్జున స్వామి దేవాలయ రాజగోపురానికి ఎడమ వైపున ఎకరం స్థలంలో కొత్తగా క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. రెండేళ్ల క్రితం 2 వేల గజాల ప్రైవేట్స్థలంతోపాటు దానికి ఆనుకొని ఉన్న ఆలయానికి సంబంధించిన మరో 2 వేల గజాల స్థలంలో అత్యాధునిక సౌకర్యాలతో కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించారు. జీ ప్లస్ టూ పద్ధతిలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్మించిన క్యూ కాంప్లెక్స్ తరహాలో దాదాపు రూ.12 కోట్లతో చేపడుతున్న నిర్మాణం ఇప్పటికీ 80 శాతమే పూర్తయింది. గ్రిల్స్, తాగునీటి సౌకర్యం, విద్యుత్, ఫ్లోరింగ్ పనులు పూర్తి కాలేదు. దీంతో రాజగోపురానికి కుడివైపున తాత్కాలిక చలువ పందిళ్ల కింద క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.
సత్రం పనులు ప్రారంభమై నాలుగేళ్లు
కొమురవెల్లి బండ గుట్టపై 50 గదుల సత్రం పనులను మూడెకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.25 కోట్లతో చేపట్టారు. ఈ పనులు ప్రారంభమై నాలుగేళ్లు కావొస్తున్నా పూర్తి కావడం లేదు. జీ ప్లస్ టూ పద్ధతిలో భక్తుల వసతి కోసం గదుల నిర్మాణం పూర్తయినా చిన్న చిన్న పనులు మిగిలిపోయాయి. దీంతో ఈ గదులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. మల్లన్న దేవస్థానం వద్ద గదులు దొరక్కపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జాతర సమయంతోపాటు వారాంతాల్లో ప్రైవేట్అద్దె గదులకు రూ.వేలల్లో చెల్లిస్తుండటంతో జేబులకు చిల్లు పడుతోంది.
మేడారం జాతరకు ముందు దర్శించుకోవడం ఆనవాయితీ
ఈ నెలాఖరులో మేడారం సమ్మక్క జాతర ఉండటంతో అక్కడికి వేళ్లే భక్తులు ముందుగా కొమురవెల్లి మల్లికార్జునస్వామి, వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో వచ్చే పక్షం రోజుల్లో లక్షలాది మంది మల్లన్న దర్శనానికి వచ్చే అవకాశం ఉంది.
పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నం
మల్లన్న భక్తుల కోసం నిర్మిస్తున్న క్యూ లైన్ కాంప్లెక్స్, 50 గదుల సత్రం పనులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నం. క్యూ కాంప్లెక్స్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తెస్తాం. బండ గుట్టపై నిర్మిస్తున్న సత్రం పనులు తుది దశకు చేరుకున్నాయి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగింది. పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ తో మాట్లాడి , పనులు పూర్తి చేయిస్తాం. – టంకశాల వెంకటేశ్, ఈవో, శ్రీమల్లికార్జునస్వామి దేవస్థానం, కొమురవెల్లి
