
హైదరాబాద్ లో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఐటీకి కారిడార్ లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ రూట్ మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. జూన్ మొదటివారంలో ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఫ్లై ఓవర్ పనులు స్పీడప్ చేశారు అధికారులు. రెండు ఫ్లైఓవర్లపై నిర్మించిన థర్డ్ లెవెల్ ఫ్లైఓవర్ ఇది.ఈ ఫ్లై ఓవర్ ప్రారంభిస్తే ORR నుంచి కొండాపూర్, హఫీజ్ పేట్ మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఈజీ అవుతుంది.
ఎంత అంచనా వ్యయం..
రద్దీగా ఉండే ఐటీ కారిడార్, బిజినెస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి గచ్చిబౌలి -కొండాపూర్ మధ్య ఆరు లేన్ల ఫ్లైఓవర్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. రూ.178 కోట్ల అంచనా వ్యయంతో గచ్చిబౌలి జంక్షన్ రెండో లెవల్ క్రాసింగ్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ (ORR) వైపు ఈ ఫ్లైఓవర్ రాబోతోంది. ఈ ఫ్లైఓవర్ పొడవు 1.2 కిలో మీటర్లు, వెడల్పు 24 మీటర్లు.
ప్రయోజనాలేంటి..
గచ్చిబౌలి -కొండాపూర్ మధ్య చేపట్టిన ఈ ఆరు లేన్ల ఫ్లైఓవర్ పూర్తయితే..గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ నుంచి వాహనదారులకు ఉపశమనం లభిస్తుంది. అలాగే హైటెక్ సిటీ-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య మెరుగైన కనెక్టివిటీ ఉంటుంది.