గుడ్ న్యూస్ : ఇవాళే (జూన్ 30).. రైతుల అకౌంట్లో రైతుభరోసా డబ్బులు

గుడ్ న్యూస్ : ఇవాళే (జూన్ 30)..  రైతుల అకౌంట్లో రైతుభరోసా డబ్బులు
  • హైదరాబాద్‌‌‌‌లోని శిల్పకళావేదిక నుంచి 
  • ప్రారంభించనున్న సీఎం రేవంత్‌‌‌‌ 
  • తొలి విడత రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లు జమ
  • వర్షాల నేపథ్యంలో రైతు ఆశీర్వాద సభ వేదిక మార్పు 
  • హైదరాబాద్​ నుంచి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ 

హైదరాబాద్, వెలుగు: వానాకాలం పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం మంగళవారం నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు వెల్లడించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని శిల్పకళా వేదిక మీదుగా సీఎం రేవంత్​రెడ్డి పెట్టుబడి సాయం నిధుల విడుదలను ప్రారంభిస్తారని చెప్పారు.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో దశలవారీగా రైతు భరోసా పైసలు జమచేస్తామని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలివిడత మంగళవారం రెండెకరాల వరకు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లను జమ చేయనున్నట్టు చెప్పారు. ఇందులో ఎకరం వరకు భూమి కలిగిన 14.65 లక్షల మంది రైతులకు రూ.878.94 కోట్లు, రెండెకరాల వరకు భూమి కలిగిన 26.72 లక్షల మంది రైతులకు రూ.1,603.08 కోట్లు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. 

రైతు ఆశీర్వాద సభవేదిక మార్పు.. 

ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభను భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని శిల్పకళా వేదికకు మార్చినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని, ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి సుమారు 2,500 మంది రైతులు ప్రత్యక్షంగా పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా అన్ని రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా  రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతు సంఘాల నాయకులు తమ సమీప రైతు వేదికలకు చేరుకొని వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో పాల్గొని, విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. 2 ఎకరాలు పైబడిన రైతులకు కూడా  దశలవారీగా రైతు భరోసా నిధులు జమ చేస్తామని తెలిపారు. కొత్తగా పాస్‌‌‌‌‌‌‌‌పుస్తకాలు పొందిన రైతులు జులై 5లోపు సమీప వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి బ్యాంకు ఖాతా వివరాలు ఇస్తే  వారికి   రైతు భరోసా నిధులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.