చెరువు మట్టి పర్మిషన్ కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన అశ్వారావుపేట ఏఈ శ్రీనివాస్

చెరువు మట్టి పర్మిషన్ కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన అశ్వారావుపేట ఏఈ శ్రీనివాస్
  • రూ. 4 లక్షలు డిమాండ్..రూ. 2 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన అశ్వారావుపేట ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస్ 

అశ్వారావుపేట, వెలుగు : చెరువులోని మట్టిని తరలించుకునే పర్మిషన్ ఇచ్చేందుకు ఓ ఇరిగేషన్ ఏఈ రూ. 4 లక్షలు డిమాండ్ చేశాడు. చివరకు రూ. 2 లక్షలు తీసుకుంటుండగా.. ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... అశ్వారావుపేట పట్టణానికి చెందిన ఓ రైతు స్థానిక దొంతికుంట చెరువు నుంచి మట్టిని పొలంలోకి తోలుకునేందుకు పర్మిషన్ కోసం ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస్ ను కలిశారు. పర్మిషన్ ఇచ్చేందుకు ఏఈ రూ.4 లక్షలు డిమాండ్ చేశారు.

 దీంతో సదరు రైతు ఖమ్మం ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన సూచనలతో సోమవారం ఇరిగేషన్ ఆఫీస్ కు చేరుకున్న రైతు.. తాను రూ. 4 లక్షలు ఇవ్వలేనని, రూ.2 లక్షలు ఇస్తానని చెప్పడంతో ఏఈ ఒప్పుకున్నాడు. దీంతో రైతు డబ్బులు ఇవ్వడంతో ఏఈ వాటిని తీసుకొని డ్రాలో పెట్టుకున్నాడు. అప్పటికే అక్కడికి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు ఏఈ శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.