- నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ చేపట్టిన 'చలో లోక్ భవన్' ప్రోగ్రామ్ ఉద్రిక్తంగా మారింది. పేపర్ లీకేజీ వల్ల ఆత్మహత్యలు చేసుకున్న 20 మంది స్టూడెంట్స్ కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ఖైరతాబాద్ నుంచి లోక్ భవన్ వైపు ఎస్ఎఫ్ఐ లీడర్లు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు.
ఈ క్రమంలో పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. నేతలను బలవంతంగా అరెస్టు చేసి పంజాగుట్ట పీఎస్‌కు తరలించారు. ఎస్ఎఫ్ఐ ఆలిండియా జాయింట్ సెక్రటరీ ఎండీ అతిక్, స్టేట్ ప్రెసిడెంట్ రజనీకాంత్ మాట్లాడుతూ కేంద్ర సర్కారు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని, విద్యాశాఖ మంత్రి వెంటనే సీటు నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. సీబీఎస్ఈ వాల్యువేషన్లో అక్రమాలు, ఇతర ప్రవేశ పరీక్షలు లీక్ అయినా కేంద్రంలోని బీజేపీ సర్కారు రెస్పాండ్ కావడం లేదన్నారు.
పరీక్ష పే చర్చ, మన్ కీ బాత్ పేరుతో స్పీచులు ఇచ్చే ప్రధాని మోదీ.. ఈ లీకులపై ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు. ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ మెంబర్ మమత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్, అశోక్ రెడ్డి, శ్రీకాంత్, లెనిన్ గువేరా, కార్తీక్, అవినాశ్, అరవింద్, కావ్య పాల్గొన్నారు. కాగా ఎస్ఎఫ్ఐ నేతలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మహేందర్ పరామర్శించి మద్దతును ప్రకటించారు.
అర్ధరాత్రి నుంచే అక్రమ అరెస్టులు
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచే ఎస్ఎఫ్ఐ లీడర్లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. రజినీకాంత్, టి. నాగరాజు తీవ్రంగా ఖండించారు. ఖమ్మం, కరీంనగర్, మహాబాద్, హన్మకొండ, కొత్తగూడెం, నల్గొండ, సంగారెడ్డి, రంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, మంచిర్యాల, భువనగిరి, భూపాలపల్లి, ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో అర్ధరాత్రి నుంచే అక్రమంగా హౌజ్ అరెస్టులు, అరెస్టులు చేశారని ఫైర్అయ్యారు.
