- నేడు భూమిపూజ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
- 9 అంతస్తుల రాజగోపురం.. కోనేరు నిర్మాణం
- మూడు రెట్లు పెరగనున్న ఆలయ విస్తీర్ణం
- శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులు, సూచనలతో మాస్టర్ ప్లాన్
హైదరాబాద్/ఆదిలాబాద్/నిర్మల్, వెలుగు: దక్షిణ భారతంలోనే ఏకైక జ్ఞాన సరస్వతీ క్షేత్రం.. వేల ఏండ్ల నాటి చారిత్రక వైభవం ఉన్న బాసర ఆలయం సరికొత్త శోభను సంతరించుకోబోతోంది. అక్షరాభ్యాసాలకు నిలయమైన ఈ పుణ్యక్షేత్రాన్ని అత్యంత వైభవంగా, ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం పునఃనిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.225 కోట్లను కేటాయించగా.. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. వేద వ్యాస మహర్షి స్వయంగా ఇసుకతో ప్రతిష్టించిన ముగ్గురమ్మల (సరస్వతి, లక్ష్మి, కాళీ) ఆలయం, భక్తుల సౌకర్యార్థం సకల హంగులతో రూపుదిద్దుకోనుంది.
ముగ్గురమ్మల కొలువు..
కురుక్షేత్ర సంగ్రామం అనంతరం ప్రశాంతత కోరి గోదావరి తీరానికి విచ్చేసిన వేద వ్యాస మహర్షి.. బాసరలో ఇసుకతో జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి మూర్తులను ప్రతిష్టించారని స్థల పురాణం చెబుతోంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఏటా భక్తుల తాకిడి పెరుగుతోంది. ముఖ్యంగా వసంత పంచమి, దేవీ నవరాత్రులు, చిన్నారుల అక్షరాభ్యాసాల సమయంలో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోతోంది. ఏటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బాసర ఆలయం అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించింది.
శృంగేరి పీఠం ఆశీస్సులతో మాస్టర్ ప్లాన్..
ఆలయ పునర్నిర్మాణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా శృంగేరి పీఠాధిపతుల సంప్రదింపులతో తుది ప్రణాళిక సిద్ధం చేశారు. గర్భాలయం, అర్థ మండపం, గోపురాలు, మాడ వీధుల నిర్మాణానికి వారి అనుమతులు తీసుకున్నారు. ప్రస్తుతం 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయ పరిధిని 5 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఆలయానికి ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురాన్ని, మిగిలిన మూడు దిశల్లో 7 అంతస్తుల గోపురాలను నిర్మించనున్నారు. 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాఢ వీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు.
మొత్తంగా ఆలయ విస్తీర్ణాన్ని 20 వేల చదరపు అడుగుల నుంచి 62 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు. నిర్మాణాలన్నీ శిలలతో (రాతితో) జరగడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. 6 వేల మంది ఒకేసారి వేచి ఉండేలా అన్ని వసతులతో (ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ తదితరాలతో) 70 వేల చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్‌లు, 200 మంది ఏకకాలంలో కూర్చొని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20 వేల చదరపు అడుగుల వైశాల్యంతో వంటశాల, భోజన శాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు.. తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరిఢవిల్లేలా తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో రోడ్ల అభివృద్ధి, దేవాలయం నుంచి ఆవతలి వైపు వెళ్లేందుకు అండర్ పాస్, సోలార్ రూప్‌టాప్‌తో వెహికల్స్ పార్కింగ్, దేవాలయ ప్రాంగణంలో పుష్పవనం పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణం ఆవల హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్‌లో ఆలయం వెనుక భాగం భారీ వృక్షాలతో ఆలరారేలా మొక్కలు నాటనున్నారు.
పుష్కరాల్లోపు సిద్ధం చేసేలా..
వచ్చే ఏడాది జూన్‌లో గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమయానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రధాన నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అటు ఆధ్యాత్మికత, ఇటు పర్యాటక రంగం రెండూ వెల్లివిరిసేలా బాసర తీరాన్ని తీర్చిదిద్దనున్నారు. ఆలయ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు బేగంపేట ఏయిర్ పోర్టు నుంచి హెలిక్యాప్టర్‌లో బయల్దేరి నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయానికి చేరుకుంటారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రూ.225 కోట్ల నిధులతో బాసర అభివృద్ధి పనులు, రూ.200 కోట్లతో ముథోల్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.45 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామానికి చేరుకుంటారు.
తర్వాత జిల్లాలో రూ.600 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ.200 కోట్లతో బోథ్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. పిప్పిరి గ్రామంలో పబ్లిక్ మీటింగ్ పాల్గొని, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. అనంతరం సీఏం కప్ విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. సీంఎ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మరోవైపు, సీఎం బాసర పర్యటన నేపథ్యంలో అని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
