
- స్టార్‌క్యాంపెయినర్ హోదాలో పర్యటన
- ఈ నెల 8 నుంచి 18 లోపు ప్రచారానికి సన్నాహాలు
- జార్ఖండ్ రాష్ట్ర ఎలక్షన్ ఇన్చార్జిగా భట్టి బిజీ
హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్రలో ఈ నెల 20 న అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండడంతో అక్కడ ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకున్నది. తెలంగాణను ఆనుకునే ఈ రాష్ట్రం ఉండడంతో అక్కడ ప్రచారానికి ఇక్కడి నేతలు తరలివెళ్తున్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. స్టార్ క్యాంపెయినర్ హోదాలో రేవంత్ ఈ నెల 8 నుంచి 18 లోపు అక్కడ ప్రచారం కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి.
ఇప్పటికే ఏఐసీసీ నుంచి ఆదేశాలు అందడంతో ఆ రాష్ట్రంలో ప్రచారం కోసం సీఎం సన్నాహాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ముంబైలో తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలతోపాటు తెలంగాణను ఆనుకొని ఉన్న జిల్లాల్లో రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ప్రచారం చేయనున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాగా, మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలుపు కోసం ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలతో రాష్ట్రానికి చెందిన మంత్రులు ఉత్తమ్, సీతక్క ఇప్పటికే ముంబైలో సమావేశమై, తగిన వ్యూహాలను రచించారు. ఇదే రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి తమకు కేటాయించిన యావత్మాల్, చంద్రాపూర్ జిల్లాల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక జార్ఖండ్ రాష్ట్ర కాంగ్రెస్ ఎలక్షన్ ఇన్చార్జిగా డిప్యూటీ సీఎం భట్టి.. అక్కడే మకాం వేసి ఆ రాష్ట్ర పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు.