తెలంగాణ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ -2047 ఓ దిక్సూచి అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఫ్యూచర్ సిటీలో జరుగుతోన్న గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంట్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఆనంద్ మహీంధ్ర, మెగాస్టార్ చిరంజీవి,దువ్వూరి సుబ్బారావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఓ గదిలో రూపొందించింది కాదన్నారు. నిపుణులు, వ్యాపార వేత్తల సలహాలు, విస్తృత సంప్రదింపులు,అభిప్రాయాల తర్వాత దీన్నిరూపొందించామన్నారు . ఈ విజన్ డాక్యుమెంటరీ ప్రజలందరిదన్నారు. సమ్మిళిత వృద్ధి తెలంగాణ లక్ష్యమన్నారు. సోనియా గాంధీ బర్త్ డే వేళ.. రాష్ట్ర అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ , గ్లోబల్ సమ్మిట్ జరగడం సంతోషకరమన్నారు. సుధీర్ఘ లక్ష్యాలకు విజన్ డాక్యుమెంటరీ లక్ష్యం కాబోతుందన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తామన్నారు. డిజిటల్ ఇన్ ఫ్రాస్టక్చర్ కు ప్రాధాన్యమిస్తామని చెప్పారు భట్టి.
రెండో రోజు కూడా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు పారిశ్రామిక వేత్తలు. రెండో రోజు కూడా దాదాపు మూడు లక్షలకు కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి పలు జాతీయ ,అంతర్జాతీయ కంపెనీలు. మొదటి రోజు 2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం రెండు రోజుల్లో 5 లక్షల 75 వేల కోట్ల పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది.

