నేడు (మే 06) ఢిల్లీకి సీఎం రేవంత్..కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలతో భేటీ అయ్యే చాన్స్‌‌

నేడు (మే 06) ఢిల్లీకి సీఎం రేవంత్..కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలతో భేటీ అయ్యే చాన్స్‌‌
  • తెలంగాణ ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులకు మరోసారి విజ్ఞప్తులు
  • విద్యుత్ కొనుగోలు అక్రమాలు, కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ చేపట్టాలని కోరనున్న సీఎం!

న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో తెలంగాణ ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి మరోసారి విజ్ఞప్తులు అందజేయనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వినీ వైష్ణవ్‌‌తోపాటు పలువురు కేంద్ర మంత్రుల అపాయిట్‌‌మెంట్లు కోరినట్టు తెలిసింది.

రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) పనులను వేగవంతం చేయాలని నితిన్ గడ్కరీనీ కోరే అవకాశం ఉంది. ట్రిపుల్‌‌ ఆర్‌‌‌‌, రేడియల్ రోడ్లు, హైదరాబాద్-–అమరావతి గ్రీన్‌‌ఫీల్డ్ ఎక్స్‌‌ప్రెస్‌‌వే, రావిర్యాల్–ఆమన్‌‌గల్–మన్ననూర్ 4 -లేన్ రోడ్డు, మన్ననూర్–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌‌లాంటి కీలక ప్రాజెక్టులకు వేగవంతమైన ఆమోదం, నిధులపై చర్చించే అవకాశం ఉంది.

అలాగే, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీని బందర్‌‌‌‌ ‌‌పోర్టుతో కలుపుతూ 12 -లేన్ ఎక్స్‌‌ప్రెస్‌‌వే కోసం ప్రతిపాదనలపై చర్చించనున్నట్టు తెలిసింది. సుమారు రూ. 8 వేల కోట్ల విలువైన రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌తో చర్చించనున్నారు. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుతో పాటు వికారాబాద్-–కృష్ణ, కల్వకుర్తి–-మాచర్ల, డోర్నకల్–-గద్వాల్‌‌లాంటి కొత్త రైల్వే లైన్లకు మద్దతు ఇవ్వాలని కోరనున్నారు.

తెలంగాణలో మెట్రో రైల్ రెండో దశ, మూసీ ప్రాజెక్ట్, ట్రిపుల్‌‌ ఆర్‌‌‌‌లాంటి అభివృద్ధి పనులకు కేంద్రం సహకారం అందించాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌‌‌‌కు విజ్ఞప్తి చేయనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పీఎంఏవై స్కీమ్‌‌ కింద అదనపు ఇండ్లు మంజూరు చేయాలని కోరనున్నారు.   బీఆర్ఎస్ సర్కారు హయాంలో జరిగిన విద్యుత్ అక్రమాలు, కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ చేపట్టాలని కేంద్ర మంత్రులను  కోరే అవకాశం ఉన్నట్టు సమాచారం.

అధిష్టానంతో భేటీ!

కేరళలో కాంగ్రెస్ కూటమి గెలుపు నేపథ్యంలో పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్‌‌ భేటీ కానున్నారు. పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, ముఖ్య నేతల సమ యం కోరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, ఇటీవల కేబినెట్  తీసుకున్న నిర్ణయాలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే, నామినేటెడ్ పోస్టులు, పార్టీ సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియ, ఇతర అంశాలపై డిస్కస్‌‌ చేసే అవకాశం ఉన్నదని సమాచారం.