హైదరాబాద్ అమీర్‌పేట్ మైత్రీవనం సర్కిల్‌లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా మైత్రీవనం సర్కిల్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ప్రజలకు, అభిమానులకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. సరిగ్గా ఎన్టీఆర్ జయంతి రోజే ఆయన భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి తన హామీని నిలబెట్టుకున్నారు రేవంత్.
తెలుగు సమాజానికి ఎన్టీఆర్ చేసిన సేవలు మర్చిపోలేనివి. ఆయన జయంతి రోజే ఇచ్చిన హామీని నెరవేరుస్తూ.. మైత్రీవనం సర్కిల్‌లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఎమ్మెల్సి బల్మూరి వెంకట్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, పలువురు సినీ నటులు హాజరయ్యారు..
