
బీసీలపై ప్రేమ ఉంటే బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన సీఎం రేవంత్.. బీసీ రిజర్వేషన్ 42శాతం ఇవ్వాలన్నది తమ కమిట్మెంట్ అని అన్నారు. రిజర్వేషన్ సాధనకోసం తాము చేయాల్సింది చేశామని చెప్పారు. కులగణన, రిజర్వేషన్ల సాధనలో తమ చిత్త శుద్ధిని ఎవరు శంకించలేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వంగా అన్ని విధాల ప్రక్రియ పూర్తి చేశామన్న రేవంత్.. ప్రస్తుతం బీసీల రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలో ఉందన్నారు. కేంద్రం, బీజేపీ కోర్టులో రిజర్వేషన్ ల అంశం ఉందన్నారు. వాళ్లకు నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే బీసీ బిల్లును ఆమోదించాలన్నారు రేవంత్.
కేంద్రంపై ఒత్తిడి పెంచడం కోసం బీసీలకు న్యాయమైనా వాటా కోసమే తమ పోరాటమని చెప్పారు సీఎం రేవంత్. జంతర్ మంతర్ వేదికగా తమ వాణీ బలంగా వినిపించామన్నారు. జంతర్ మంతర్ ధర్నాపై బీజేపీ, బీఆర్ఎస్ నేతల విమర్శలు విడ్డూరమన్నారు. తమ కమిట్ మెంట్ కు వాళ్ల సర్టిఫికేట్ అవసరం లేదని వ్యాఖ్యానించారు రేవంత్. ప్రజలను అబద్ధపు మాటలు చెప్పి మభ్యపెట్టబోమని... అది తమ నైజం కాదన్నారు. బీసీ లకు రాహుల్ ఇచ్చిన మాటను అమలుచేడమే తమ టార్గెట్ అని తెలిపారు.
మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉందన్నారు సీఎం రేవంత్. తమ ఆఖరి పోరాటాన్ని పూర్తిచేశాం.. ఇక బీజేపీ నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రపతికి రాజకీయాలకు సంబంధం లేదన్నారు రేవంత్. కేంద్రం బిల్లుకు ఆమోదించక పోతే.. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా వెళ్లాలో ఆలోచిస్తామని చెప్పారు. గ్రామస్థాయి నుంచి ప్రజల అభీష్టం మేరకే పార్టీ నిర్ణయం తీసుకుంటాం మన్నారు. లోకల్ బాడీ ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని హైకోర్ట్ చెప్పిందన్నారు సీఎం రేవంత్.