చెరువులను చెరబడితే తాట తీస్తం: సీఎం రేవంత్

చెరువులను చెరబడితే తాట తీస్తం: సీఎం రేవంత్

 

  • నాలాలపై ఆక్రమణలు తొలగిస్తం: సీఎం రేవంత్ రెడ్డి
  • మాయగాళ్ల మాటలు నమ్మి జనం మోసపోవద్దు 
  • మూసీ పునరుజ్జీవానికి ప్రజలు సహకరించాలి 
  • వరదలను తట్టుకునే విధంగా ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి 
  • బతుకమ్మ కుంట ప్రారంభోత్సవంలో సీఎం

హైదరాబాద్ సిటీ, వెలుగు:  చెరువులను చెరబడితే తాట తీస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నాలాలపై ఆక్రమణలను తొలగిస్తామని చెప్పారు. మూసీ పునరుజ్జీవానికి ప్రజలు సహకరించాలని కోరారు. ‘‘మహానగరంలో ఎంతోమంది మాయగాళ్లు ఉన్నారు. ఆ మాయగాళ్లు జాగాలను కబ్జా చేసి.. పేదలకు తక్కువ ధరకు వాటిని అమ్ముతున్నారు. మాయగాళ్ల మాటలు నమ్మి జనం మోసపోవద్దు” అని సూచించారు. ఆదివారం హైదరాబాద్ అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటలో బతుకమ్మకుంటను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘హైడ్రా ఆలోచన చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా అన్నారు. కొందరు వాళ్ల ఆక్రమణలు బయటకు వస్తాయని ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారు. సినీ హిరో నాగార్జున తమ్మిడికుంటను ఆక్రమిస్తే, ఆ ఆక్రమణలను తొలగించాలని హైడ్రా అడిగింది. వినకపోవడంతోనే కూల్చివేతలు చేపట్టింది. ఆ తర్వాత నాగార్జునే వచ్చి భూమిని అప్పగించారు” అని తెలిపారు. ‘‘కరోనా తర్వాత పర్యావరణంలో చాలా మార్పులు వచ్చాయి. ఊహించనవి విధంగా ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. ప్రస్తుతం రోజుకు రెండు సెంటిమీటర్ల వర్షం పడితే తట్టుకునే విధంగా ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ర్టక్చర్ ఉంది. కానీ గంట, రెండు గంటల్లోనే 40 సెంటమీటర్ల వర్షం పడుతున్నది. తెలంగాణతో పాటు దేశమంతటా ఇదే పరిస్థితి ఉంది. ఈ వర్షాలను తట్టుకునే విధంగా ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ర్టక్చర్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కుండపోత వానలను తట్టుకునేందుకు ఏం చేయాలని శాస్త్రవేత్తలతో మాట్లాడి తీసుకున్న నిర్ణయాల్లో ఒక్కటి హైడ్రా ఏర్పాటు” అని పేర్కొన్నారు. 

అమెరికాలో చదివినోళ్లకు పేదల బాధలేం తెలుసు.. 

1908లో వచ్చిన వరదలకు వేలాది మంది చనిపోయారని,  దాంతో నిజాం ఆలోచించి మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో కలిసి  జంట జలాశయాలను కట్టారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ ఒకప్పుడు మంచి నదిగా ఉండేదని, కానీ ఆ తర్వాత మూసీ అంటే మురికి అన్నట్టుగా తయారైందని అన్నారు. ‘‘గ్రామాల నుంచి వచ్చి మూసీ పరీవాహక ప్రాంతాల్లో కొందరు గుడిసెలు వేసుకొని ఉన్నారు. పేదల బాధ నాకు తెలుసు. వాళ్లను తప్పకుండా ఆదుకుంటం” అని హామీ ఇచ్చారు. మూసీ కింద ఇండ్లు కోల్పోయేటోళ్ల వివరాలను మరోసారి సేకరించాలని.. బాధితులకు డబుల్ బెడ్‌‌‌‌‌‌‌‌రూమ్ ఇండ్లు అందించే అంశంపై సమావేశం నిర్వహించాలని హైదరాబాద్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సూచించారు. గుంటూరు, గుడివాడ, అమెరికాలో చదువుకున్నోళ్లకు పేదల గురించి తెలియదని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి విమర్శించారు. ఎంజీబీఎస్‌‌‌‌‌‌‌‌లో వరద వచ్చిందంటే రాత్రి 3 గంటల వరకు అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించానని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ‘‘అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటలో ఒక్క కార్యాలయం కూడా లేదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ చెబుతుంటే ఆశ్యర్యపోయాను. ఇక్కడే మినీ సెక్రటేరియెట్ మాదిరిగా ఏర్పాటు చేసి అన్ని కార్యాలయాలు ఉండేలా చూస్తాను. అందుకు  ప్రణాళికలు రూపొందించాలి. డిసెంబర్ 9 లోపు కేటాయింపులతో పాటు అన్ని  అనుమతులు ఇస్తాం” అని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరిక మేరకు బతుకమ్మ కుంటకు వి.హన్మంతరావు పేరు పెట్టాలనే దానిపై పరిశీలించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సూచించారు. కాగా, అంతకుముందు హైడ్రా పాటను సీఎం విడుదల చేశారు.  

కల నెరవేరింది: విమలక్క  

తమ కల ఇన్నాళ్లకు నెరవేరిందని విమలక్క అన్నారు. బతుకమ్మకుంట మాదిరిగానే తెలంగాణలోని చెరువులు, వాగులు, కుంటలు, గుట్టలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతిని విధ్వంసం చేస్తే మానవ మనుగడకు ప్రమాదకరమని, ప్రకృతి వికృతి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పౌర సమాజంపై ఉందన్నారు. సెక్యులర్ పండుగగా బతుకమ్మను  ప్రకటించాలని కోరారు. అన్ని కులాలు, మతాలు, అన్ని వర్గాల వారితో కలిసి పండుగను జరుపుకోవాలన్నారు. 

మూసీ పనులు అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట నుంచే మొదలుపెట్టాలి: కాలేరు వెంకటేశ్
 
అంబర్‌‌‌‌‌‌‌‌పేట నియోజకవర్గంలో 3 లక్షల మంది ఓటర్లు ఉంటే, వారిలో 2.70 లక్షల మంది పేదలేనని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ‘‘అంబర్‌‌‌‌‌‌‌‌పేటలో 5 కిలోమీటర్ల మేర మూసీ నది ప్రవహిస్తున్నది. వర్షాలు పడినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుంచే మూసీ పునరుజ్జీవ పనులు మొదలు పెట్టాలి. అందులో భాగంగా రిటైనింగ్ వాల్ నిర్మించాలి. మూసారంబాగ్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలి. బతుకమ్మ కుంటకు వీహెచ్ పేరు పెట్టాలి” అని కోరారు. అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటలో సబ్ రిజిస్ర్టార్, ఆర్టీఏ, మున్సిపల్ ఆఫీసు లేదని.. వాటిని ఏర్పాటు చేయాలన్నారు. 

హైడ్రాకు అతిపెద్ద విజయం: ఏవీ రంగనాథ్  

బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం హైడ్రాకు అతిపెద్ద విజయమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. దీన్ని ఎంతో ప్రతిష్టాత్మ కంగా నిర్మించినట్టు తెలిపారు. ‘‘ఆరు నెలల కింద ఇక్కడ డంపింగ్ యార్డు మాదిరిగా చెత్త చెదారం ఉండేది. కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకుని పనులు ప్రారంభించాం. రూ.7.40  కోట్లతో  బతుకమ్మ కుంట సుందరీకరణ చేపట్టాం. 5 ఎకరాల 15 గుంటల స్థలంలో బతుకమ్మ కుంట పేరుతో వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేశాం. ఈ కుంట పునరుద్ధరణతో ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరిగింది. గజానికి రూ.25 వేలు పెరిగినట్టు స్థానికులు చెబుతున్నారు” అని పేర్కొన్నారు. హైడ్రా ఇప్పటి వరకు 900 ఎకరాల భూములను కాపాడిందని, దీని విలువ రూ.50 వేల కోట్ల వరకు ఉంటుందన్నారు.  హైడ్రా పని చేసేది భవిష్యత్ తరాల కోసమేనని చెప్పారు.