ఫోన్ ట్యాపింగ్​లో ఎవరున్నా.. చర్లపల్లి జైలుకే: రేవంత్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్​లో ఎవరున్నా.. చర్లపల్లి జైలుకే:  రేవంత్ రెడ్డి
  • ట్యాపింగ్​తో కేటీఆర్ మంది సంసారాల్లో వేలుపెట్టిండు ​ 
  • ఆయన బరితెగించి మాట్లాడుతున్నడు
  • దొంగచాటుగా ఫోన్లు విన్నోళ్లకు చిప్పకూడే గతి 
  • తప్పుడు పనులు చేసిన అధికారులు ఊచలు లెక్కబెడ్తున్నరు 
  • పదేండ్లు ప్రధానిగా ఉన్నా మోదీ ఏమీ చేయలేదని ఫైర్
  • వాల్మీకి బోయలకు తగిన స్థానం ఇస్తామని హామీ 

హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ అచ్చోసిన ఆంబోతులా బరితెగించి మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొద్ది మంది ఫోన్లు వింటే విని ఉండొచ్చంటున్నారని, వింటే ఏమవుతుందన్నట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. దొంగచాటుగా ఫోన్లు విన్నోళ్లు చర్లపల్లి జైలులో చిప్పకూడు తినక తప్పదని హెచ్చరించారు. ‘‘భార్యాభర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గపు ఆలోచన వారిది. వింటే విన్నామంటున్న కేటీఆర్​కు మంది సంసారాల్లో వేలు పెట్టి చూసేందుకు ఏం పని? సిగ్గున్నోడు ఎవడైనా బరితెగించి ఇలా మాట్లాడుతారా?” అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్ లో వాల్మీకీ బోయలతో సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

కేసీఆర్, కేటీఆర్ చెప్పినట్టు తప్పుడు పనులు చేసిన అధికారులు ఇప్పుడు జైలులో ఊచలు లెక్కబెడుతున్నారని రేవంత్​రెడ్డి అన్నారు. ఆ దుర్మార్గుల మాటలు వింటే జైలుకు పోతారని తాను ముందే చెప్పినా వినలేదన్నారు. ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నోళ్లను చూసి వాళ్లు అయ్యో పాపం అని కూడా అనడం లేదన్నారు. ‘‘ఇట్లనే చేస్తమన్నట్టుగా వాళ్లు మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు ఆవారాగాళ్లు, తాగుబోతోళ్లే మాట్లాడుతారు. బట్టలిప్పుకుని బజార్ల తిరుగుతమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దాని ఫలితం దానికి ఉంటుంది.

క్రమపద్ధతిలో విచారణ చేసి చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వ హయాంలో ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడే పరిస్థితి ఉండేది. ఏం మాట్లాడితే ఏం రికార్డ్​ చేస్తరోనన్న టెన్షన్ ఉండేది. గత ప్రభుత్వం అందరినీ భయపెట్టి, కేసులు పెట్టి అరాచక పాలన చేసింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందరూ స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణాన్ని తీసుకొచ్చాం’’ అని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. 

బీజేపీ, బీఆర్ఎస్ గూడుపుఠానీ 

పాలమూరు ఉమ్మడి జిల్లాకు లేక లేక మంచి అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ, ఎలాగైనా నష్టం చేయాలన్న ఉద్దేశంతో దొంగ దెబ్బ తీసేందుకు దొంగలంతా ఏకమయ్యారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై గూడుపుఠానీ చేస్తున్నాయన్నారు. వంశీచంద్ రెడ్డి మీదనో, మల్లు రవి మీదనో వారి కోపం కాదని.. రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టాలన్నదే వారి ఆలోచన అని అన్నారు. ‘‘సొంత జిల్లాల్లో రాజకీయంగా బలహీనం చేయాలని చూస్తున్నారు. దాన్ని చూసి రాష్ట్రమంతా తిట్టుకోవాలని కుట్రలు పన్నుతున్నారు. తద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టొచ్చన్న దుష్ట ఆలోచనలకు తెరతీస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాలలో కూడా గెలిచేవాళ్లం. కానీ, డీకే అరుణ వచ్చి వాళ్ల అల్లుడికి ఓట్లు వేయించింది. ఓట్లకు ముందు రోజు వరకు మామా అల్లుళ్లకు గొడవలు అన్నట్టుగా ప్రచారం చేశారు. పోలింగ్ రోజు మాత్రం ఓట్లన్నీ అల్లుడికి వేయించింది.

లేదంటే కాంగ్రెస్ గద్వాలలో ఈజీగా గెలిచేది. ఇప్పుడు కూడా మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్ లోక్​సభ సెగ్మెంట్​లలో అదే గూడుపుఠానీకి తెరతీశారు. నన్ను మహబూబ్​నగర్​లో దెబ్బ తీస్తే రాష్ట్రమంతా ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టవుతుందని.. నా మీద కుట్రలు చేస్తున్నారని తెలిసింది. ఆ పార్టీలోనూ ఉండే నా అభిమానులే ఈ విషయాలు నాకు చెప్పారు’’ అని సీఎం వెల్లడించారు. ‘‘ఐదేండ్ల నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ జిల్లా కోసం ఏం చేశారు? ఆర్డీఎస్ కాల్వలు తవ్వించి కర్నాటక నుంచి నీళ్లేమైనా తెప్పించారా? తుమ్మిళ్ల ప్రాజెక్టు కోసం కొట్లాడారా? మహబూబ్​నగర్ జిల్లాకు మోదీ నుంచి రూ.10 వేల కోట్లు ఏమైనా ఇప్పించారా? పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించారా? ఇవేవీ చేయని ఆమె.. తనకు మాత్రం పార్టీ పదవి తెచ్చుకున్నారు’’ అని రేవంత్ విమర్శించారు.  

మోదీ చంద్రమండలానికి రాజైతడా? 

కాంగ్రెస్​ను కాదని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీ పాలమూరుకు ఏమీ చేయలేదన్నారు. ‘‘మోదీ పదేండ్లు ప్రధానిగా ఉన్నారు కదా? ఇంకా ఏమవుతారు.. చంద్రమండలానికి రాజైతరా? చంద్రమండలానికి రాజై మనకు ఏమైనా మేలు చేస్తరా? వాళ్లెవరూ ఇక్కడ ఉండరు. వాళ్లు మనకేం చేయరు. ఇక్కడ శాశ్వతంగా ఉండేది మనమే. బీజేపీ వాళ్లు సంక్రాంతి గంగిరెద్దుల్లాగా వచ్చిపోయేటోళ్లే” అని రేవంత్ అన్నారు. 

ఓటు చాలా విలువైంది 

ఓటు చాలా విలువైందని, మనల్ని ఏలే వాళ్లను ఎన్నుకునేది ఓటు ద్వారానే అని సీఎం రేవంత్ అన్నారు. అందుకే ఎన్ని పనులున్నా ఢిల్లీ నుంచి వచ్చి మరీ మహబూబ్​నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశానని చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చి సీజేఐని కలిసి కొడంగల్​కు వెళ్లి ఓటేశానన్నారు. ‘‘కానీ, ఇలాంటి లఫంగా గాళ్లను ఎన్నుకుంటే నష్టమే జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పకుండా 200 ఓట్ల మెజారిటీతో గెలుస్తాం. సీఎం మనోడే.. ప్రభుత్వం మనదే.. మంచిగా అభివృద్ధి చేసుకోవచ్చు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చన్న ఉద్దేశంతో ఎంపీపీలు, ఎంపీటీసీలు, జిల్లా నాయకులు మద్దతిచ్చారు’’ అని రేవంత్ చెప్పారు.

బోయల డిమాండ్లు నెరవేరుస్తం

ఇప్పటికే బీసీ ఫెడరేషన్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చామని, మరికొన్ని నిర్ణయాలనూ తీసుకోవాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆ నిర్ణయాలను తీసుకోలేకపోతున్నామని, ఎన్నికలైపోగానే వాల్మీకీ బోయల డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమం, అభివృద్ధి, విద్యాఉద్యోగాల్లో మంచి స్థానం కల్పిస్తామన్నారు. వాల్మీకీ బోయలంతా కాంగ్రెస్​వైపు ఉండాలని కోరారు. ఎన్నికలవ్వగానే అందరినీ సెక్రటేరియెట్​కు పిలిపించుకుని మాట్లాడతామన్నారు. జిల్లాలోని రెండు ఎంపీ సీట్లలోనూ గెలిపించాలని కోరారు.  

సీఎంతో నిజామాబాద్ నేతల భేటీ

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ ముఖ్య నేతలతో పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమావేశమ్యారు. నిజాబామాద్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఎన్నికల ప్రచారంపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. సీఎంను కలిసిన వారిలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.