పులి బయటికొస్తే బోనులోకే .. కేటీఆర్​ కామెంట్లకు సీఎం రేవంత్​ కౌంటర్​

పులి బయటికొస్తే బోనులోకే ..  కేటీఆర్​ కామెంట్లకు సీఎం రేవంత్​ కౌంటర్​
  • లోక్​సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ను బొందపెడ్తమని వార్నింగ్​
  • అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డా కేటీఆర్​, హరీశ్​కు బుద్ధిరాలే
  • ప్రజా ప్రభుత్వంపై ఓర్వలేక ఇష్టమున్నట్లు వాగుతున్నరు
  • లక్షల కోట్లు దోచుకొని ప్రజల నెత్తిమీద అప్పుల దరిద్రం మోపిన్రు
  • వాళ్ల అహంకారం, బలుపు ఇంకా దిగలే.. దించే బాధ్యత మాదే
  • ఈ నెల 26 తర్వాత ఇంద్రవెల్లి నుంచి రాష్ట్రమంతా పర్యటిస్తానని ప్రకటన
  • లండన్​లో తెలంగాణ వాసులతో సమావేశం

హైదరాబాద్, వెలుగు:  బీఆర్​ఎస్​ నేతలకు సీఎం రేవంత్​రెడ్డి వార్నింగ్​ ఇచ్చారు. త్వరలోనే కేసీఆర్​ అనే పులి బయటకు వస్తుందంటూ ఇటీవల కేటీఆర్​ చేసిన కామెంట్లకు ఆయన స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చారు. పులి బయటకు వస్తే బోనులో వేసి చెట్టుకు వేలాడదీస్తామని హెచ్చరించారు. తాము కూడా పులి బయటకు రావాలనే చూస్తున్నామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడి బొక్కలిరిగినా వాళ్ల అహంకారం, బలుపు తగ్గలేదని, రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టమున్నట్లు వాగుతున్నారని కేటీఆర్, హరీశ్​రావుపై మండిపడ్డారు. వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ నిషాన్​ను వందమీటర్ల గోతిలో బొందపెడ్తామని సవాల్​ చేశారు. రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజల నెత్తిమీద అప్పుల దరిద్రాన్ని మోపారని మండిపడ్డారు. 

ఈ నెల 26 తర్వాత ఇంద్రవెల్లి నుంచి రాష్ట్రం నలుమూలలా పర్యటిస్తానని ఆయన ప్రకటించారు. తమది ప్రజా ప్రభుత్వమని, ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. లండన్​లో పర్యటిస్తున్న సీఎం రేవంత్​ రెడ్డి అక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ అభిమానులు ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు. విదేశాల్లో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడొద్దనుకున్నప్పటికీ నాలుగు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్​ నేతలు చేస్తున్న దాడిని చూసి మాట్లాడక తప్పడం లేదని ఆయన అన్నారు. ‘‘పులి అంట.. ఇంట్ల పండుకున్నదంట.. లేసి వస్తదంట.. మేం కూడా దానికోసమే చూస్తున్నం. మా దగ్గర బోను ఉంది. వల ఉంది. రమ్మను.. పులిని చెట్టుకు వేలాడగట్టే బాధ్యత మా కార్యకర్తలు తీస్కుంటరు. బిల్లా, రంగా, చార్లెస్​ శోభరాజ్​(కేటీఆర్​, హరీశ్​రావు, కేసీఆర్​)కు ఇంకా బుద్ధిరాలేదు. ఆ అహంకారం ఏంది? ఆ బలుపు ఏంది? ఆ మాటలేంది ? పార్లమెంటు ఎన్నికల్లో ఆ బలుపును, ఆ అహంకారాన్ని  కూడా దించే పని మా కార్యకర్తలు తీస్కుంటరు” అని ఆయన హెచ్చరించారు. 

ఏదీ పడితే అది మాట్లాడకుండా ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని, ఆ ప్రజా ప్రభుత్వంపై బీఆర్​ఎస్​ నేతలు ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని రేవంత్​ మండిపడ్డారు.  ‘‘బీఆర్​ఎస్​ నేతలను బొక్కాబోర్ల పడేసి బొక్కలు ఇరగొట్టినా ఇంకా మాట్లాడుతనే ఉన్నరు.  రాబోయే పార్లమెంట్​ ఎన్నికల్లో చూస్కుందమంటున్నరు. బిల్లా, రంగా, చార్లెస్​ శోభరాజుకు సవాల్​ విసురుతున్నా.. పార్లమెంట్​ ఎన్నికల్లో తేల్చుకుందాం.  నేను సిద్ధం. రెండ్రోజులలో తెలంగాణ గడ్డ మీద కాలుపెడ్తున్న.  26వ తారీఖు తర్వాత ఇంద్రవెల్లిలో మొదలుపెట్టి రాష్ట్రం నలుమూలాల సుడిగాలి పర్యటన చేస్త.. పార్లమెంట్​ ఎన్నికల్లో మీ పార్టీ నిషాన్​ లేకుండా వంద మీటర్ల గోతి తీసి పాతిపెడ్తం” అని హెచ్చరించారు. ‘‘ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత మిగతా సమయాల్లో రాష్ట్రం అభివృద్ధి అనే ఆలోచనలో మేం ఉన్నం. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని అందరిని సమన్వయం చేసుకుని ముందుకెళ్తుంటే.. ఓర్వలేక ఏదీ పడితే అది మాట్లాడ్తున్నరు. సహించేది లేదు” అని తేల్చిచెప్పారు. 

మీ అవినీతి గురించి చర్చ జరగొద్దా?

కేసీఆర్​ కుటుంబం రాష్ట్రాన్ని ఫణంగా పెట్టి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నదని సీఎం రేవంత్​ మండిపడ్డారు. ‘‘కుటుంబం కోసం కొంతమంది రాష్ట్రాన్ని ఫణంగా పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసి.. ఇయ్యాల అవినీతి గురించి చర్చనే జరగొద్దని చూస్తున్నరు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించొద్దనేలా మాట్లాడ్తున్నరు.  16 మంది సీఎంలు తెలంగాణకు రూ.72 వేల కోట్ల అప్పు ఇస్తే.. ఒకే ఒక్క కుటుంబం 10 ఏండ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేసి.. ఆ దరిద్రాన్ని తెలంగాణ ప్రజల నెత్తిమీద పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. ఏనాడూ ఉద్యోగులకు టైమ్​కు జీతాలు ఇయ్యలేదు. ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5వ తేదీలోపే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం మొదలుపెట్టినం. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి అభివృద్ధి వైపు నడిపించేందుకు ప్రయత్నిస్తున్నం. దీన్ని ఓర్వలేక ఇష్టమున్నట్లు మాట్లాడ్తున్నరు’’ అని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని రేవంత్ చెప్పారు. ‘‘వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల్లో చెప్పినం. డిసెంబర్​ 7న ప్రభుత్వం ఏర్పడి.. 9న అసెంబ్లీ స్టార్ట్​ కాగానే బిల్లా రంగాలు గ్యారంటీల అమలు ఏమైందని మాట్లాడుడు మొదలుపెట్టిన్రు. ఇదేం పద్ధతి?” అని కేటీఆర్​, హరీశ్​పై మండిపడ్డారు. ‘‘ఏది పడితే అది వాగకుండా ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చిన్రు.. ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్కున్నరు. ‘దొరల పాలన వద్దు.. ప్రజల పాలన కావాలి’ అని మేం ప్రజలదగ్గరికి వెళ్తే మమ్మల్ని ఆశీర్వదించిన్రు. ప్రజా పాలనను తెచ్చుకున్నరు” అని తెలిపారు. మంచి ఎవరు  చేసినా.. వాటిని కొనసాగించడానికి తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు.  

లండన్​లో స్మారక కేంద్రాల సందర్శన

లండన్‌‌‌‌ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌‌‌‌ శనివారం అక్కడ పలు స్మారక కేంద్రాలను,  చారిత్రక కట్టడాలను సందర్శించారు. బిగ్‌‌‌‌బెన్, లండన్‌‌‌‌ ఐ, టవర్‌‌‌‌ బ్రిడ్జ్‌‌‌‌ ఎట్‌‌‌‌ ఆల్‌‌‌‌ కట్టడాలను తిలకించారు. ఆ దేశ పురోగతి, ఆర్థికాభివృద్ధిలో ఈ పర్యాటక కేంద్రాల పాత్రను అడిగి తెలుసుకున్నారు. మన రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాల అభివృద్ధి, తద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పన ఎలా సాధించాలనే కోణంలో అక్కడ అనుసరిస్తున్న విధానాలను  స్టడీ చేశారు. ఆదివారం జెడ్డాలో రేవంత్ పర్యటించనున్నారు. ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు జెడ్డాలో రాష్ట్రానికి పెట్టుబడులపై పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతున్నారు.

ప్రపంచంతో పోటీ పడాలి

పక్క రాష్ట్రాలతో తెలంగాణ పోటీ పడాలన్నది తమ ఆలోచన కాదని, ప్రపంచంతోనే పోటీ పడాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. ‘‘ప్రపంచంతో పోటీ పడే హైదరాబాద్​ నగరం, ఐటీ తెలంగాణలో ఉన్నయ్​. ప్రపంచానికి వ్యాక్సిన్​ అందజేసిన గడ్డ నాది.  ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం” అని తెలిపారు. మూసీ నది కాలుష్యంతో మురికి కూపంగా మారిందని, 55 కిలో మీటర్ల మూసీ నదిని పూర్తిగా సజీవంగా ప్రజల ముందు సాక్షాత్కరించాలని చూస్తున్నామని చెప్పారు.