త్వరలో నల్గొండలో సీఎం రేవంత్​ పర్యటన ​: మంత్రి వెంకట్​రెడ్డి

త్వరలో నల్గొండలో సీఎం రేవంత్​ పర్యటన ​: మంత్రి వెంకట్​రెడ్డి

నల్గొండ, వెలుగు: త్వరలో నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్​ రెడ్డి పర్యటిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. జిల్లాలో పెండింగ్​లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి పరిశీలిస్తారని, ఆ తర్వాత ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు పకడ్బందీ కార్యచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన నల్గొండ జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సీఎం తన పర్యటనలో భాగంగా శ్రీశైలం సొరంగ మార్గం పనులు పరిశీలిస్తారని, అక్కడే అన్ని ప్రాజెక్టులపైన చర్చించడంతోపాటు జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష చేస్తారని వెల్లడించారు. గతంలో ఎప్పుడూలేని విధంగా సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి రూ. 2 లక్షల రుణ మాఫీ చేయబోతున్నారని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నదని చెప్పారు.

 రైతు భరోసా  అమలు చేయాలని కేబినెట్​ నిర్ణయించినట్టు తెలిపారు.  అందుకోసం నలుగురితో కమిటీలు ఏర్పాటు చేశారని చెప్పారు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం పదేండ్ల కాలంలో రుణ మాఫీని ఆరు, ఏడు విడతలుగా చేసిందని, కానీ సీఎం రేవంత్‌‌రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకుని ఒకేసారి  రూ.2 లక్షల రుణ మాఫీ చేయబోతున్నారని తెలిపారు. అందుకు ఆయనకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. రుణమాఫీతో ఇది రైతు ప్రభుత్వమని మరోసారి ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. విత్తనాలు, ఎరువుల విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు రానీయబోమనితెలిపారు.